చార్మినార్ కన్నా ఎత్తైనది - Raka Lokam

చార్మినార్ కన్నా ఎత్తైనది

Share This



నా పేరు ఎవరికీ తెలియొద్దు.

నాకు సమాధి వద్దు... స్మృతి సౌధమూ వద్దు.

సమాధి కడితే అది పూజా స్థలం అవుతుంది.

దానికి మహిమలు ఆపాదిస్తారు.

ఆ ప్రభువును తలిస్తే చాలు.

నన్ను ఎవరూ తలచుకోకూడదు.

జీవితకాలమంతా తాను నమ్మినదాని కోసం పనిచేసి, అంతిమఘడియల్లో ఆయన కోరుకున్నది ఇదే.

ఆయన సాధించింది సామాన్యమైనదా?

పుట్టింది ఎక్కడో యూరప్ లో...

వచ్చి చేరింది మన దేశానికి ...

యేసువాక్కును ప్రచారం చేసేందుకు మన దేశానికి వచ్చాడు.

మెదక్ లో మత ప్రచారం ప్రారంభించాడు.

ఊరూరా తిరిగాడు.


తన ప్రభువును పూజించేందుకు ఒక చర్చిని కట్టాలనుకున్నాడు. అదీ ఆషామాషీ చర్చి కాదు. ఏషియాలోనే అతిపెద్ద చర్చి. అంగరంగవైభవంగా కట్టాలనుకున్నాడు.

దాని కోసం యూరప్ వీధుల్లో తిరిగి బిచ్చమెత్తాడు.

దాతలిచ్చిన పైసా పైసా కూడబెట్టాడు.

అదంతా పోగేసి మెదక్ లో చర్చి నిర్మాణం ప్రారంభించాడు. దేశదేశాలనుంచి నిర్మాణ సామగ్రి తెప్పించాడు. ప్రతి అంగుళమూ ప్రేమగా కట్టించాడు.

అంతలోనే అసలు సమస్యవచ్చింది.

ఆసియాలోనే అతిపెద్ద చర్చి మెదక్ లో నిర్మాణమౌతోందన్న సంగతి నిజాం ప్రభువుకి తెలిసింది. "ఎంత ఎత్తైనా కట్టుకో. కానీ చర్చి శిఖరం చార్మినార్ కన్నా ఒకడుగు తక్కువగానే ఉండాలి. ఎక్కువ ఉండటానికి వీల్లేదు" అని షరతుపెట్టాడు.

చేసేదేముంది? చర్చి శిఖరం చార్మినార్ కన్నా ఒక అడుగు తక్కువగానే ఉంచాల్సి వచ్చింది.

మొత్తం మీద ఆసియాలోనే అతిపెద్ద చర్చి తయారైంది. అదే మెదక్ చర్చి.

చర్చి పూర్తయ్యాక చుట్టుపక్కల క్రైస్తవులకు ఆయన దేవుడయ్యాడు. ఆయన మహిమల గురించి కథలుకథలుగా ప్రచారాలు మొదలయ్యాయి.

ఇదంతా చూసిన ఆ మిషనరీకి ప్రజలు దేవుడికి బదులు తనను పూజిస్తారేమోనని భయం వేసింది.

దేవుడి మందిరం ముందు దీపస్తంభంలా భాసిల్లాలని కూడా ఆయన కోరుకోలేదు.

తాను పునాది రాయి. పునాదిరాయికి పూజలక్కర్లేదు.

అట్టడుగున ఎక్కడో భవంతి బరువును మోస్తూనో, బలాన్నిస్తూనో ఉంటే చాలు.

అందుకే ఆయన నాకు సమాధి వద్దు, స్మృతిస్తంభం వద్దు అనుకున్నాడు.

అందుకే ఆకాశాన్నంటే ఆరాధనాస్థలిని నిర్మించిన ఆయన ఆరడుగుల నేలలో అజ్ఞాతంగా ఉండిపోయాడు.

కానీ

ఆశ్చర్యం...

ఆయన్ని అనుయాయులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఇంటింటా ఆయన ఫోటోలు ఉన్నాయి. గుండె గుడిలో ఆయన బొమ్మ కొలువుంది. హైదరాబాద్ రామ్ కోట్ లో ఆయన అనుయాయులు ఒక భారీ భవనం కట్టుకున్నారు. దానికి ఆయనపేరే పెట్టుకున్నారు. అదే పాస్నెట్ భవనం.

ఆ క్రైస్తవ మిషనరీ పేరు పాస్నెట్.

ఇంకా తమాషా ఏమిటంటే

నిజాం ప్రభువు ఆదేశాల మేరకు చార్మినార్ కన్నా ఒక అడుగు తక్కువ ఎత్తునే కట్టినా, మెదక్ చర్చి ఎత్తైన భూమిపై ఉండటం, హైదరాబాద్ తో పోలిస్తే మెదక్ సముద్ర మట్టంకన్నా ఎక్కువ ఎత్తున ఉండటం వల్ల వాస్తవానికి మెదక్ చర్చే చార్మినార్ కన్నా ఒక అడుగు ఎక్కువ ఎత్తున ఉన్నట్టయింది.

No comments:

Post a Comment

Pages