దేశ విభజన సమయంలో అతని తల్లీతండ్రీ చనిపోయారు.
ఆ పిల్లవాడు ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీశాడు.
పాకిస్తాన్ నుంచి శరణార్థుల్నీ, శవాల్నీ మోసుకుని వచ్చే ఒక రైలులో ప్రయాణించి భారత్ చేరుకున్నాడు.
ఆకలి, దారిద్ర్యం, బెంగ, భయం అతడి వెన్నంటాయి. వాటినుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశాడు.
ఆ పరుగే అతనికి తెగింపునిచ్చింది. కాళ్లకు బలాన్నిచ్చింది. శరీరానికి దారుఢ్యాన్నిచ్చింది....
ఆ పరుగు ఇచ్చిన బలిమి అతడిని సైన్యంలోకి చేర్చింది.
సైన్యంలోఉంటూ కూడా అతను పరుగు మానలేదు. 1956 లో పటియాలాలో జరిగిన జాతీయ క్రీడల్లో అతని పరుగు అందరినీ అబ్బురపరిచింది. అతడు పరిగెడుతున్నాడా లేక గాలిలో ఎగురుతున్నాడా అని అందరూ ముక్కున వేలేసుకున్నారు.
1958 లో ఏషియా, కామన్వెల్త్ క్రీడల్లో పేరు ప్రఖ్యాతులున్న అథ్లెట్లను మట్టికరిపించాడు. బంగారు పతకాలను సాధించాడు.
ఆ పరుగే అతడిని 1960 రోమ్ ఒలింపిక్స్ కి తీసుకెళ్లింది. 400 మీటర్ల పరుగుపందెంలో పాల్గొనేనాటికి అతని వయస్సు 25 సంవత్సరాలు. ఆ రోజుల్లోనే అథ్లెట్లకు అది ముసలి వయస్సుతో సమానం.
అతనికి సదుపాయాలు లేవు. సౌకర్యాలు లేవు. కోచ్ లు లేరు. బహుమతులిచ్చి భుజం తట్టే వారు లేరు. ఆ రోజుల్లో ఆటంటే ఆటే. స్పాన్సర్లు, యాడ్ సంస్థల వేట కాదు.
కానీ ఆ లోపాలేవీ అతని స్థైర్యాన్ని దెబ్బతీయలేదు. అతనికి జీవితం నేర్పించింది ఒకటే... అదే పరుగు.
అతనికి తెలిసింది ఒక్కటే...
పరుగు.
400 మీటర్ల తొలి హీట్ లో 47.6 సెకన్లలో పరుగెత్తి రెండో స్థానంలో నిలిచాడు. సెమీఫైనల్ లో 45.9 సెకన్లలో గమ్యం చేరుకున్నాడు. ఫైనల్ లో 45.6 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు.
అతను ఆ పరుగుపందెంలో నాలుగో స్థానంలో నిలిచాడు. కాంస్యపతక విజేతకి, అతనికి మధ్య కేవలం 0.1 సెకను మాత్రమే తేడా!
ఆ తేడా ఎందుకొచ్చింది?
"పరుగు మధ్యలో వేగం కొద్దిగా తగ్గింది. అదే నా పొరబాటు" అన్నాడు అతను. బతుకు పరుగులో వేగం తగ్గించకూడదని అప్పుడే ఆయన నిర్ణయించుకున్నాడు.
ఆ పరుగువీరుడే మన ఫ్లయింగ్ సిఖ్ మిల్ఖా సింగ్.నాటికీ నేటికీ అతడిని మించిన ఎథ్లెట్ పుట్టలేదు మన దేశంలో. 1958 లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ఇచ్చిసత్కరించింది.
ఆయన తనకు లభించిన పతకాలు, ట్రాఫీలు అన్నిటినీ ఢిల్లీ లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని నేషనల్ స్పోర్ట్స్ మ్యూజియంకి ఇచ్చేశృ఼డు.
మిల్ఖా సింగ్ 1935 అక్టోబర్ 10 న పాకిస్తాన్ లోని లయాల్ పుర్ లో (ఇప్పుడది ఫైసలాబాద్) లో జన్మించాడు.
ఆయన పెద్దగా చదువుకోలేదు.
ఒక సారి ఆయన కాస్త విశ్రాంతిగా కూర్చుంటే ఒక విదేశీ అథ్లెట్ "ఆర్ యూ రిలాక్సింగ్? " అని అడిగాడట.
దానికి ఆయన " నో ... ఆయామ్ నాట్ రిలాక్సింగ్. అయామ్ మిల్ఖా సింగ్"అన్నాడట. ఆయన చదువు అంత మాత్రమే.
ఈ జోకు నిజమో కాదో తెలియదు కానీ మిల్ఖా సింగ్ కి నిజంగానే రిలాక్సింగ్ తెలియదు.
ఆయనకు తెలిసింది ఒక్కటే ...
పరుగు...
వేగంగా పరుగు....
ఇంకా వేగంగా పరుగు !!!
No comments:
Post a Comment