అద్భుతాలు సాధ్యమే!! - Raka Lokam

అద్భుతాలు సాధ్యమే!!

Share This



ఆమె రోజూ అదే దారిన వెళ్తూండేది.

రోడ్డుకు ఒక పక్కన మురికిముద్దలా, విసిరేసిన విస్తరిలా పడున్న ఆ వ్యక్తిని రోజూ చూసేది.

చెత్తకుప్పకు దూరంగా ఉన్నట్టు వచ్చిపోయేవారందరూ అతనికి దూరంగా ఉండేవారు. ఆ పక్కకు కూడా ఎవరూ వెళ్లేవారు కాదు.

రెండు మూడు రోజులయ్యాక అమె మనసులో ఆ మురికిముద్ద పట్ల ఏదో తెలియని జాలి కలిగింది. తన టిఫిన్ బాక్సును తెరిచి అన్నం ముద్దను ఆ మురికి ముద్ద ముందుంచింది.

అన్నం తిని ఎన్నాళ్లైందో... ఆ వ్యక్తి పాపం గబగబా తినేశాడు.

రెండు మూడు రోజులు ఆమె టిఫిన్ తేవడం, అతను తినేసి పక్కకి తిరిగి పడుకోవడం జరిగాయి.

ఆ తరువాత నుంచి అతను సందు మలుపులో ఆమెను చూడగానే లేచి కూర్చునేవాడు.

అయితే ఏమి అడిగినా చెప్పే వాడు కాదు. ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానమే ఉండేది కాదు.

ఆ అమ్మాయి ఆ వ్యక్తి గురించి ఇంట్లో వారికి చెప్పింది. ఇంట్లో వారు కూడా ఆమె సేవాతత్పరతను ప్రోత్సహించారు. దానితో ఆమె ఆ వ్యక్తి ఎక్కడెక్కడో తిరుగుతున్నా వెతికి మరీ అన్నం తినిపించేది.

ఒక రోజు అతడిని గోదావరికి తీసుకువెళ్లి స్నానం చేయించింది. క్షవరం చేయించింది.

ఇలా కొన్ని నెలలు గడిచాయి. ఒక రోజు ఆమె హిందీలో నీ పేరేమిటి అని అడిగింది. దానికి అతను "కుసుమ్ రాజ్ చౌధురి" అని బదులిచ్చాడు.

ఆ అమ్మాయి ఆశ్చర్యానందాలకు అంతు లేదు. ఒక కాగితం ఇచ్చి "నీ అడ్రస్ వ్రాయి," అంది.

అతను కుసుమ్ రాజ్ చౌధురి, తండ్రిపేరు రామ్ స్వరూప్ చౌధురి, కేలారీ జిల్లా, భజానీ గజీసా, నేపాల్ అని వ్రాశాడు.

ఆమె ఆ చిరునామాకి లేఖ వ్రాసింది. మొదటిసారి జవాబు రాలేదు. రెండోసారి స్థానిక పోస్టు మాస్టర్ సాయంతో హిందీలో జాబు వ్రాసింది.

ఈ సారి జవాబు మాత్రమే కాదు. అతడిని వెతుక్కుంటూ అతని చిన్నాన్న, అన్నయ్యలు కూడా వచ్చారు.

కుసుమ్ రాజ్ భార్య వేధింపుల వల్ల మతిస్థిమితం కోల్పోయాడు. నేపాల్ లోని అతని గ్రామంలో అతనొక మోతుబరి రైతు. బోలెడంత ఆస్తి ఉంది. మానసిక వ్యాధి చికిత్స కోసం పుణే తీసుకువెళ్తూండగా, అతను పొరబాటున రైలు దిగిపోయాడు. ఆ రైలూ, ఈ రైలూ మారి చివరికి రాజమండ్రి చేరుకున్నాడు.

అక్కడ వీధుల్లో పారేసిన ఎంగిలి తింటూ బ్రతికాడు. భాష రాదు. ఊరు తెలియదు. అలాగే వీధిబతుకు వెళ్లదీస్తూ వచ్చాడు.

కుసుమ్ రాజ్ ఎవరో తెలియకుండానే, ఏ ప్రతిఫలమూ ఆశించకుండానే కేవలం మానవతా ధర్మంతో ఆ అమ్మాయి అతనికి ఏడాదిన్నర పాటు సేవ చేసింది.

ఆ అమ్మాయి పేరు కొప్పిశెట్టి అనూరాధ. ఆమెది రాజమండ్రి. అప్పట్లో ఆమె బిఇడి కోర్సు చదివేది. ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్ గా పనిచేసేది.

ఈ అమ్మాయికి ఏం దక్కింది? ఆదాయవ్యయాల లెక్కల్లో, అంకెల్లో అక్షరాల్లో ఏమీ దక్కలేదు.

కానీ అంకెలకూ, అక్షరాలకు అందని ఆత్మతృప్తి ఏదో ఆమెకు దక్కింది.

అన్నిటినీ మించి -

ఈ సంఘటన జరిగి ఏళ్లు గడిచినా నేపాల్ నుంచి ఒక అన్నయ్య ఫోన్ చేసి పలకరిస్తాడు. భాషలకు అందని ఆత్మీయతా భావం ఆ పలుకుల్లో ప్రతిఫలిస్తుంది. రాజమండ్రికి, భజానీ గజీసాకి మధ్య ఉన్న వేల మైళ్ల దూరాన్ని ఆత్మీయతల బైపాస్ రోడ్డు అరక్షణానికి తగ్గించేస్తుంది.

మరి ఈ సంఘటన నుంచి మనకేం దక్కింది.

అద్భుతాలు అసంభవం కాదు. అంతేకాదు. ప్రతి ఆకలికడుపుకీ ఒక ముద్ద అన్నం ఎక్కడో ఉండే తీరుతుంది. ఆ అన్నం పెట్టే చేయి దేవుడిది. కుసుమ్ రాజ్ విషయంలో దేవుడి చేయి కొప్పిశెట్టి అనూరాధ చేయి రూపంలో వచ్చింది.

ఎక్కడి భజానీ గజీసా? ఎక్కడి రాజమండ్రి? ఎక్కడి కుసుమ్ రాజ్ చౌధురి? ఎక్కడి కొప్పిశెట్టి అనూరాధ? ఎక్కడి మోతుబరి రైతు? ఎక్కడి ప్రైవేటు పంతులమ్మ? ఎక్కడి అన్నకు ఎక్కడి చెల్లెలు? ఎక్కడి ఆకలికి ఎక్కడి అన్నంముద్ద? ఎక్కడి అవహేళనకు ఎక్కడి ఆత్మీయహస్తం?

ఇదంతా చూస్తే ఎక్కడలేని ధైర్యం, ఆత్మబలం రావడం లేదూ?

(2008లో ఈనాడు వసుంధర పేజీలో కొప్పిశెట్టి అనూరాధ గురించి ప్రచురితమైన వ్యాసం దీనికి ఆధారం.)

No comments:

Post a Comment

Pages