ఎదలో చేదబావి - Raka Lokam

ఎదలో చేదబావి

Share This



విశాఖపట్నం వెళ్లినప్పుడు...

బీచ్ అందాలు చూడండి....

బొర్రా గుహలు చూడండి .....

సబ్మెరీన్ మ్యూజియం చూడండి ....

సబ్బవరమూ చూడండి .....

ఆంధ్ర విశ్వకళా పరిషత్తు అంటే ఆంధ్రా యూనివర్సిటీనీ చూడండి....

తెలుగువారికి గౌరవాన్నిచ్చిన మహనీయుల విగ్రహాలనీ చూడండి.....

వీటన్నిటితో పాటు నారాయణమ్మని చూడటం మాత్రం మరిచిపోకండి.

ఎందుకంటే ....

మిగతావన్నీ ఆనందాన్నిస్తే ....

నారాయణమ్మ ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మశక్తిని ఇస్తుంది.


నారాయణమ్మ పుట్టుగుడ్డి.

కానీ .... గొప్ప పోరాట యోధురాలు.

హైదరాబాద్ లో అప్పట్లో దారుషిఫాలో బాలబాలికలకి కలిపి ఒకే బ్లైండ్ స్కూలు ఉండేది. నారాయణమ్మని తల్లిదండ్రులు అందులోనే చేర్చారు.

రెండో తరగతి చదువుతూండగానే ఆమె తన తోటి బాలబాలికలతో కలిసి అంధ బాలికలకు వేరే స్కూలు కావాలని రోడ్డెక్కారు.

అప్పట్లో అదొక సంచలనం....

అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి "అంధులు రోడ్డెక్కడం దేశానికే అరిష్టం" అని స్పందించారు. గవర్నర్ శారదా ముఖర్జీకి ఆదేశాలు వెళ్ళాయి. ఆ మరుసటి రోజు మలక్ పేటలోని హౌసింగ్ క్వార్టర్స్ ఖాళీగా ఉంటే అందులో అంధ బాలికల స్కూలు ప్రారంభమైంది.

పదో తరగతి వచ్చే సరికి పుస్తకాలు లేదు. పాఠాలు చెప్పే పంతుళ్లూ లేరు.

పరీక్షలో ఎందుకు పాస్ కాలేదంటే చెప్పేందుకు ఈ రెండు సాకులూ చాలు...

కానీ ....

నారాయణమ్మ తోటి అంధ విద్యార్థులను తీసుకుని నేరుగా డీఈఓ గారి ఛేంబర్ లోకి దూసుకెళ్లింది.

"మీరైనా పాఠాలు చెప్పండి. లేకపోతే టీచర్లనైనా ఇవ్వండి"అని డిమాండ్ చేసింది.

ఆ మరుసటి రోజు పంతులు వచ్చాడు. పాఠాలు చెప్పాడు.

నారాయణమ్మ అలాగే ఎమ్మే దాకా చదివింది.

అడుగడుగునా అంధత్వాన్ని అట్టడుగుకి తొక్కేసుకుంటూ ....

భగవద్గీతను ఏకబిగిన ౩౩ గంటలు నిద్రాహారాలు మానేసి బ్రెయిలీ లిపిలో వ్రాసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కి ఎక్కింది. ప్రాచీన సాహిత్యాన్ని బ్రెయిలీ లిపిలో వ్రాసి అంధులకు అందచేసింది.

అంతే కాదు ...

కళ్లున్న వారి జ్ఞాననేత్రాలను తెరిపించేందుకు స్తోత్రాలు, శ్లోకాలు, సంస్కృతం నేర్పిస్తుంది. లలితా సహస్రనామం, సౌందర్యలహరి వంటివి నేర్పుతూ అందులోని అనంత రహస్యాలను విడమరుస్తుంది.

విశాఖ మున్సిపాలిటీ నిర్వహించే ఒక స్కూలులో ఆమె టీచర్. అక్కడా చేసేది జ్ఞానబోధే.

ఆమెకి అంధత్వం అవరోధం కాదు...

అది ఆత్మావలోకనానికి, ఆధ్యాత్మికతకు దారి చూపించింది. దేవుడిని చూసేందుకు, ఆయన అనంతానంద స్పర్శానుభూతిని పొందేందుకు తెన్ను చూపించింది.

గలగలా మాట్లాడే నారాయణమ్మ నోటి వెంట ప్రేరణాస్పద పదాలు వెలువడుతూనే ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని నింపుతూనే ఉంటాయి.

"ఎదురుగ ఎండమావి నిలుచున్నా

ఎదలో చేదబావి ఉందన్నా

కదలని ఓ సినారె నిను చూసి

కాలం మార్చుకుంది తన వేగం"


అన్న నారాయణ రెడ్డి కవితకు ఆమె నిలువెత్తు రూపం.

నిజమే ....

ఎదలో చేదబావి ఉంటే ....

ఎండమావులంటే ఎందుకు భయం?


(ఇవాళ వైట్ కేన్ డే. అంటే అంధులు వాడే తెల్లని చేతి కర్ర దినం. "యాక్సిడెంట్లు కళ్లున్న వాళ్లకి అవుతాయి. మా చేతుల్లో వైట్ కేస్ ఉంది. మాకు యాక్సిడెంట్లు కావు" అనే నా మిత్రుడు దిలీప్ ఘోష్ (రాష్ట్రీయ దృష్టి విహీన్ కళ్యాణ సంఘ్ జాతీయ అధ్యక్షుడు) మాటలను స్మరించుకుంటూ .... వైట్ కేన్ కీ జై.... )

No comments:

Post a Comment

Pages