వీణ వేరు. వాణి వేరు. వాళ్లిద్దరూ కలిసి పుట్టారు. కాళ్లు వేరు. చేతులు వేరు. మొండాలు వేరు. కానీ తలలు మాత్రం కలిసిపోయి పుట్టారు.
ఇలాంటి వాళ్లను సయమీస్ కవలలు అంటారు. ఈ పేరు వెనుక ఒక కథ ఉంది. నేటి థాయ్ లాండ్ ను ఒకప్పుడు సయాం (శ్యామ దేశం) అనేవారు. ఆ దేశానికి చెందిన చాంగ్, ఎంగ్ అనే వాళ్లు తలలు మాత్రం వేరు. ఒళ్లంతా ఒకటిగా పుట్టారు. వీళ్లని అమెరికా, యూరోప్ లలో సర్కస్ లలో చూపించేవారు. సయాం నుంచి వచ్చారు కాబట్టి వారు సయామీస్ ట్విన్స్ అన్న పేరుపొందారు. ఆ తరువాత నుంచీ ఇలాంటి వాళ్లని సయామీస్ కవలలు అనే అంటున్నారు.
కలిసిపుట్టిన వీణావాణిలనూ వేరు చేయాలని వాళ్లు పుట్టినప్పటినుంచీ ప్రయత్నిస్తున్నారు. ఆపరేషన్లకు అంతా సిద్ధం చేస్తారు. పత్రికల్లో, ఛానెళ్లలో వార్తలు వస్తాయి. హడావిడి జరుగుతుంది. ఆ తరువాత అంతా సద్దుమణుగుతుంది. ఏవేవో సమస్యలు, సాకులు వస్తాయి. ఆపరేషన్ ఆగిపోతుంది.
సమస్యేమిటంటే కలిసి ఉంటే ఇద్దరూ బతకలేరు. అలాగని విడిపోయినా బతుకుతారని గ్యారంటీ లేదు.
కలిసుంటే ఎవరో ఒకరు చనిపోతారు. బతికున్నవారు తన శరీరంలో శవమైన సగాన్ని మోసుకుంటూ తిరగాలి. తరువాత కొన్నాళ్లకి రెండో వారూ చనిపోతారు.
అందుకని వాళ్లిద్దరినీ వేరు చేయాలి. ఒకరు కాకపోతే ఒకరైనా బతుకుతారు. అదృష్టం ఉంటే ఇద్దరూ బతుకుతారు.
ఇప్పుడు సమస్యంతా ఇలాంటి వింత సయామీస్ కవలల గురించే.
ఒక కవల పేరు సీమాంధ్ర.
ఇంకొక కవల పేరు తెలంగాణ.
వీణావాణిలు తలలు అతుక్కుని పుడితే, ఈ కవలలు ఒళ్లంతా అతుక్కుని పుట్టారు.
తలలు మాత్రం వేరు. తలపులూ వేర్వేరు.
వీళ్లను విడదీయాలన్న విషయం అందరూ అంగీకరిస్తారు. కానీ విడదీయటం ఎలాగో తెలియడం లేదు. ఆపరేషన్ దాకా 1969 లో వచ్చింది. ఆ తరువాత 2009 డిసెంబర్ 10 న విడగొట్టేస్తామని డాక్టర్ చిదంబరం ప్రకటించేశారు. కానీ మళ్లీ ఆపరేషన్ వాయిదాపడింది. విడదీయడం ఖాయం. కానీ ఎప్పుడు విడదీస్తామో చెప్పలేం అంటున్నారు. ఎలా విడదీయాలో చెప్పమని డాక్టర్ శ్రీకృష్ణ అనే నిపుణుడిని అడిగితే ఆయన ఆరు నెలల పాటు అన్నిరకాల టెస్టులూ చేసి ఆరు రకాల ప్రిస్క్రిప్షన్లు వ్రాశాడు.
"కలిపే ఉంచండి. విడదీయండి. కలిపే ఉంచి గుండెకాయను మాత్రం వేరు చేయండి. విడదీసి, గుండెకాయను వేరు చేసి, దాని నుంచి రెండు శరీరాలకీ కనెక్షన్ ఇవ్వండి, తలో, మొండెమో తీసేయండి" ఇవే ఆ ఆరు ప్రిస్క్రిప్షన్లు. ఇప్పుడేం చేయాలో తెలియక మళ్లీ డాక్టర్లు మంతనాలు చేస్తున్నారు. ఆ మంతనాలకి అటు గులామూ కాని, ఇటు ఆజాదూ కాని ఒకడు పెద్దరికం చేస్తున్నాడు.
ఈ సయామీస్ కవలలతో ఇంకొక చిక్కు వచ్చిపడింది. వీణా వాణిలు కలిసి నడుస్తారు. కలిసి ఆడుకుంటారు. కలిసి పడుకుంటారు. కానీ మన సయామీస్ కవలలకు మాత్రం ఒకరంటే ఒకరికి పడదు. ఒకరిని చూస్తే ఒకరికి కోపం. ఒకరంటే ఇంకొకరికి అనుమానం. ఒకడు బాగుపడిపోతున్నాడేమోనని ఇంకొకడికి సందేహం. వాడు ఎడమొహం అయితే వీడు పెడమొహం. వాడు తూర్పు అయితే వీడు పడమర. పడుకుందాం అని ఒకడంటే పరుగెడదాం అంటాడు ఇంకొకడు.
వెనకటికి ఇలాగే ఇద్దరు ఋషులుండేవారు. ఒకడంటే ఒకడికి పడదు. ఇద్దరూ విడివిడిగా తపస్సు చేశారు. దేవుడు మొదటి వాడి ముందు ప్రత్యక్షం అయ్యాడు. ఏంకావాలో కోరుకొమ్మన్నాడు.
"దేవా... నువ్వు నా పగవాడి దగ్గరకి కూడా వెళ్తావా?"
"అవును."
"అయితే వాడేం కోరుకుంటాడో దానికి రెండు రెట్లు నాకు ప్రసాదించు స్వామీ" అన్నాడు వాడు. తథాస్తు అంటూ దేవుడు రెండో వాడి దగ్గరకి వెళ్లాడు.
"దేవా ... నువ్వు నా శత్రువు దగ్గర్నించి వస్తున్నావు కదా. వాడేం కోరుకున్నాడు?"
"నువ్వేం కోరుకుంటే దానికి రెండు రెట్లు కావాలని కోరుకున్నాడు" అని దేవుడు చెప్పాడు.
రెండో వాడు ఒక్క క్షణం ఆలోచించి "అయితే నాకు ఒక కన్ను తీసెయ్యి దేవా" అన్నాడు.
కలిసికట్టుగా విడిపోవచ్చు ..... కలిసుండీ విడిపోవచ్చు ....
విడిపోయీ కలిసుండొచ్చు .... విడిపోయేదాకా కలిసుండొచ్చు....
ఏది చేసినా వీణావాణిలంత సమన్వయంతో చేసుకోవచ్చు కదా.... !!
(వీణావాణిలకు వేలవేల క్షమాపణలతో)
ఏం క్రియేటివిటీ సార్.. అదరహో...
ReplyDeletechala bagundi.....cheppadaniki aksharalu saripovu..................................................................
ReplyDeleteSuperb Raka garu
ReplyDelete