ఏక్ దిన్ కా సుఖం .... హజార్ సాల్ కా అవమానం - Raka Lokam

ఏక్ దిన్ కా సుఖం .... హజార్ సాల్ కా అవమానం

Share This



ఏక్ దిన్ కా సుల్తాన్ కథ చాలా మందికి తెలుసు. సుల్తాన్ ఏక్ దిన్ మాత్రమే గడిపిన భవనం గురించి తెలుసా?

ఇరవై తొమ్మిదేళ్లు ఏకధాటిగా నిర్మాణం చేసిన భవనం..... వేలాది మంది పనివాళ్లు కట్టిన భవనం..... ఒక్కటంటే ఒక్క రాత్రి అందులో సుల్తాన్ గడిపాడు. ఆ తరువాత వందల సంవత్సరాలు గడిచినా భవనంలో నివసించిన వాళ్లు లేరు. అతి రమ్యమైన భవనమైనా అది మిగతా భవనాల మధ్య షోకేసుకి మాత్రమే పరిమితమైపోయిన అమ్మాయి బొమ్మలా అలా ఉండిపోయింది.

ఇలాంటి వింత భవనం చూడాలంటే ఉత్తరప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతానికి ప్రాణకేంద్రమైన ఓర్ఛాకి వెళ్లాల్సిందే. ఝాన్సీకి అతి చేరువలో ఉన్న నగరమే ఓర్ఛా. ఒకప్పుడు బుందేలా రాజుల రాజధాని అది. ఆ నగరానికి వెళ్లే రాజపుత్ర రాజసం అణువణువునా ఉట్టిపడుతూ ఉంటుంది. శతాబ్దాల కత్తుల ఖణేల్ ఖణేళ్, గుర్రాల గిట్టల చప్పుడు వినిపిస్తున్నాయా అన్నట్టు ఉంటుంది ఓర్ఛా. హఠాత్తుగా శతాబ్దాల వెనక్కి మనల్ని తోసేసుకుంటూ మరీ తీసుకువెళ్తుంది ఓర్ఛా.

ఆ ఓర్ఛాలో ఉన్న భవనాలన్నిటిలోనూ అతి పెద్దది, అతి గొప్పది అయిన భవనమే జహంగీర్ మహల్. అదే సుల్తాన్ ఒక్క రోజు గడిపిన భవనం.

అసలు బుందేలాల చరిత్రే ఒళ్లు గగుర్పొడిపించే వీరత్వపు చరిత్ర. మొగల్ దురాక్రమణదారులను శతాబ్దాల తరబడి సవాలు చేశారు. కత్తులకు, కదనానికి విశ్రాంతినివ్వలేదు. 1531 ప్రాంతంలో రాజస్థాన్ నుంచి ఖడ్గాన్ని, గుర్రాన్ని నమ్ముకుని వచ్చిన రుద్రప్రతాప్ ఓర్ఛాలో బుందేలా సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీళ్లు మొగలులకు ఏనాడూ లొంగలేదు. కొందరు దక్షిణాదికి వచ్చేశారు. మన తెలుగునాడు, తమిళనాడుకి వచ్చేసరికి బుందేలాలు బొందిలిలుగా మారిపోయారు.

బొందిలివాళ్లు రాయలసీమ, నెల్లూరు, రాజమండ్రి, కావలి వంటి ప్రాంతాల్లో ఉన్నారు. ఇళ్లలో బుందేల్ ఖండీ భాష మాట్లాడతారు. వీళ్ల పేర్లు క్షత్రియ బాలసుబ్రమణ్యం సింగ్ వంటి తెలుగు, హిందీల ఖిచిడీలుగా ఉంటాయి. రాయలసీమను బొందిలి రాజు భీమ్ సింగ్ 20 ఏళ్లు పాలించాడని శ్రీశైల చరిత్రం చెబుతోంది. బొందిలి రాజులు తమిళనాట జింజీ కోటను పాలించారు. అందులో ఒకరైన రాజా తేజ్ సింగ్ (రాజా దేసింగ్) ఆర్కాట్ నవాబుతో వీరోచిత పోరాటం చేసి ప్రాణత్యాగం చేస్తాడు. ఈయనపై ఎంజీఆర్ హీరోగా ఒక తమిళ సినిమా కూడా వచ్చింది.

అలాంటి బుందేలాలకు ఓర్ఛా రాజధాని. ఈ ఓర్ఛాను వీర్ సింగ్ దేవ్ మహారాజు పరిపాలిస్తున్న సమయంలో ఆయన పదేపదే అక్బర్ పై తిరుగుబాటు చేశాడు. ఎన్నో పోరాటాలు చేసినా అక్బర్ కి కొరుకుడు పడలేదు. చివరికి అక్బర్ కి, ఆయన కుమారుడు జహంగీర్ కి మధ్య ఆధిపత్య పోరు వచ్చినప్పుడు వీర్ సింగ్ దేవ్ జహంగీర్ ను సమర్ధించాడు. చివరికి అక్బర్ యుగం అంతరించి, జహంగీర్ సుల్తాన్ అయ్యాడు. జహంగీర్ ను తన రాజ్యానికి ఆహ్వానించాడు రాజా వీర్ సింగ్ దేవ్. అప్పటికి జహంగీర్ కి కేవలం పదహారేళ్లు. వస్తానన్నాడు జహంగీర్. ఎంత సామ్రాట్టు అయినా మ్లేచ్ఛుడు. మ్లేచ్ఛుడు అంతఃపురంలోకి రాకూడదు. అందుకే మ్లేచ్ఛమహారాజు గారి కోసం ఒక ప్రత్యేక భవనం నిర్మింపచేశాడు. దీనికి 29 ఏళ్లు పట్టింది. రమ్మన్న రాజుగారు రావడానికి 29 ఏళ్లు పట్టింది.

ఆ భవనమే జహంగీర్ మహల్ . ఈ భవనం ఎంత విశాలంగా ఉండేదంటే దీని పైభాగంలో ఉన్న గుమ్మటాల్లోకి ఏనుగులు వెళ్లి రావచ్చు. జహంగీర్ స్నానానికి ఒక బాత్ టబ్ తయారు చేసి, దానికింద మంట రగిలించి మొత్తం తొట్టె అంతా వేడి నీళ్లుండేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఆ కాలపు గీజర్ అది. 1635 ప్రాంతంలో జహంగీర్ ఓర్ఛా వచ్చాడు. బుందేలాల పట్ల గౌరవ సూచకంగా ఒక రాత్రి ఈ భవనంలో గడిపి, తిరిగి వెళ్లిపోయాడు.

జహంగీర్ వెళ్లిపోయాడు. కానీ జహంగీర్ మహల్ అలాగే ఉండిపోయింది. ఎంత అందమైన భవనమైనా మ్లేచ్ఛుడి పాదస్పర్శతో మలినమైపోయింది. అందుకే బుందేలా మహారాజులెవరూ ఆ భవనంలో అడుగు కూడా పెట్టలేదు. సామంతులైనా ధీమంతులు వాళ్లు. ఆ భవనాన్ని అలాగే పాడుపెట్టారు. బుందేలాలు మొగలులను గౌరవించారా లేక అవమానించారా అన్నది ఈ పాటికే మనకు అర్థమైపోయి ఉండాలి.

బుందేలాలు అక్కడితో ఆగలేదు. 1671లో ఔరంగజేబు జహంగీర్ మహల్ పై తన జెండా ఎగరేశాడు. గుడ్డ ముక్కనైతే ఎగరేయగలిగాడు కానీ, ఔరంగజేబు బుందేలా ప్రజలను లొంగదీసుకోలేకపోయాడు. బుందేలా మహారాజు ఛత్రసాల్ అదే ఏట మొగలులపై తిరుగుబాటు చేశాడు. వాయవ్యాన గురుగోవిందసింగ్ నాయకత్వంలో సిక్కులు, ఈశాన్యాన లాచిత్ బడ్ ఫుకన్ నాయకత్వంలో అసొం ప్రజలు, రాజస్థాన్ లో ఠాకూర్ జస్వంత్ సింగ్, అమర్ సింగ్ రాఠోడ్ నాయకత్వంలో రాజపుత్రులు, దక్షిణాన ఛత్రపతి శివాజీ, ఆయన తరువాత పీష్వాల నాయకత్వంలో మరాఠాలు, బుందేల్ ఖండ్ లో వీర ఛత్రసాల్ నాయకత్వంలో బుందేలాలు ఔరంగజేబుకి నిద్ర లేకుండా చేశారు. (ఇదంతా పాఠ్యపుస్తకాల్లో చెప్పని చరిత్ర). ఔరంగజేబు పోయాక ఢిల్లీలో ఎవరు సింహాసనమెక్కాలో, ఎవరు దిగాలో మరాఠాలే నిర్ణయించేవారు. చివరికి బ్రిటిష్ వారు వచ్చే సరికి ఢిల్లీలో షా అలం అనే మొగల్ బాద్షా ఉండేవాడు. ఆయన రాజ్యం గురించి "The empire of shah alam extends from Delhi to Palam" అని బ్రిటిషర్లు లిమరిక్కులు వ్రాసుకున్నారు. ఢిల్లీ నుంచి పాలం (నేటి ఢిల్లీ విమానాశ్రయం) దాకా మాత్రమే ఆయన హుకుం నడిచేదన్న మాట.

ఈ రోజు మొగలులు లేరు. వారి వారసులు లేరు. కానీ ఓర్ఛాలో బుందేలా మహారాజుల వంశజులు ఇంకా మిగిలే ఉన్నారు. వారి భవనాలు కూడా ఉన్నాయి. వాటికి కాస్త దూరంగా సుల్తాన్ తో ఏక్ దిన్ కా సుఖాన్ని అనుభవించిన పాపానికి హజార్ సాల్ కా అవమానాన్ని మోస్తూ జహంగీర్ మహల్ కూడా ఉంది.


1 comment:

Pages