ఒరిజినల్ కంప్యూటర్ - Raka Lokam

ఒరిజినల్ కంప్యూటర్

Share This




కంప్యూటర్ అంటే తెలియనిదెవరికి? పాత తరానికి మానిటర్ అంటే క్లాస్ మానిటర్. ఇప్పటి తరానికి మానిటర్ అంటే కంప్యూటర్ మానిటర్. పాత తరానికి మౌస్ అంటే ఎలక. ఇప్పటి తరానికి మౌస్ అంటే కంప్యూటర్ మౌస్. పాత తరానికి కీబోర్డు అంటే సంగీతం వాయిద్యం. ఇప్పటి తరానికి కీబోర్డు అంటే కంప్యూటర్ కీ బోర్డే.

కానీ ఈ నాటి కంప్యూటర్ల కన్నా చాలా ముందే కంప్యూటర్ ఒకటి ఉండేది. దాని గురించి తెలుసా?

ఆ కంప్యూటర్ పేరు రాధానాథ్ సిక్దర్. రాధానాథ్ సిక్దర్ చేసిన ఉద్యోగం పేరు కంప్యూటర్ - అంటే లెక్కించే వాడు అని అర్థం.

మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఎంతో కనుక్కొన్నది రాధానాథ్ సిక్దరే. అదే ప్రపంచంలో అన్నిటికన్నా ఎత్తైన శిఖరం అన్న సంగతి ప్రపంచానికి తెలియచెప్పిందీ అతనే.

1831 లో బ్రిటిషర్లు దేశమంతటా సర్వేలు నిర్వహించి, మొత్తం నేల నాలుగు చెరగులనూ అధ్యయనం చేశారు. అదంతా సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగింది. ఈ అధ్యయనానికి వాళ్లు "ది గ్రేట్ ట్రిగొనామెట్రిక్ సర్వే" అని పేరు పెట్టుకున్నారు. ఈ సర్వే కోసం లెక్కలు బాగా చేయగలిగిన మేధావుల కోసం సర్వే ఆఫ్ ఇండియా చీఫ్ జార్జి ఎవరెస్టు వెతుకుతున్నాడు.

అదే సమయంలో కోల్ కతా హిందూ కాలేజీ ప్రిన్సిపాల్ జాన్ టైట్లర్ ఒక 19 ఏళ్ల కుర్రవాడిని ఆయన దగ్గరికి పంపించాడు. "ఈ కుర్రాడు నడిచే లెక్కల పుస్తకం.." అని చెప్పాడు. ఎవరెస్ట్ ఆ కుర్రాడిని నెలకి 30 రూపాయల జీతానికి నియమించుకున్నాడు. ఆ కుర్రాడే రాధానాథ్ సిక్దర్. రాధానాథ్ నైపుణ్యం, సామర్థ్యం చూసి ఎవరెస్ట్ అచ్చెరువొందాడు. కొత్త కొత్త లెక్కల విధానాలని కనుగొనేవాడు రాధానాథ్. మిగతా వారికి రీములు పట్టే లెక్కలు ఆయన వేళ్ల మీద లెక్కించేవాడు. రాధానాథ్ గణిత నైపుణ్యం చూసి జర్మన్ ఫిలాసఫికల్ సొసైటీ ఆయనకు గౌరవ సభ్యత్వం ఇచ్చింది. అంత గొప్పవాడు ఆయన.

రాధానాథ్ ఉద్యోగం మానాలని ప్రయత్నిస్తే ఎవరెస్ట్ ఒప్పుకోలేదు. అసలు పై అధికారి అనుమతి లేకుండా వేరే ఉద్యోగంలో చేరడానికి వీల్లేదని రూలు రాధానాథ్ ను ఆపేందుకే తీసుకొచ్చాడు ఎవరెస్ట్.

డెహ్రాడూన్ లోని సిరోంజ్ లో, కోల్ కతాలో పనిచేస్తూండగా ఆయన హిమాలయాల్లో అన్నిటికన్నా ఎత్తైన శిఖరం (అప్పట్లో ఇంగ్లీషు వాళ్లు దానిని పీక్ నంబర్ 15 అనేవారు) ఎత్తును కనుగొన్నారు. ప్రపంచంలో అన్నిటికన్నా ఎత్తైన శిఖరం అదేనని కూడా రాధానాథ్ నిర్ధారించాడు. అప్పటికి ఎవరెస్ట్ రిటైరైపోయాడు. ఆయన తరువాత 1843 లో కల్నల్ వా అనే వాడు డైరెక్టర్ అయ్యాడు. కల్నల్ వా ఈ సంగతిని చాలా కాలం బయటకు రాకుండా ఉంచాడు. చివరికి అన్ని రకాలుగా రూఢి చేసుకున్నాక ఆ శిఖరమే అన్నిటికన్నా ఎత్తైన శిఖరమని ప్రకటించాడు.
తమాషా ఏమిటంటే ఎవరెస్ట్ చాలా నిక్కచ్చిగా అమలు చేసిన విధానం ప్రకారం పర్వత శిఖరాలకు స్థానికంగా ఉన్న పేర్లనే వాడాలి. కానీ కల్నల్ వా తన గురువైన ఎవరెస్టు పేరు పెట్టాడు. దానితో అది మౌంట్ ఎవరెస్ట్ అయింది. చరిత్రలో ఎవరెస్టు పేరునిలిచిపోయింది. రాధానాథ్ పేరు మరుగున పడిపోయింది.




రాధానాథ్ తెల్లవాళ్ల కింద ఉద్యోగమైతే చేశాడు కానీ ఏ రోజు తెల్లవాడి నల్ల పనులను సమర్థించలేదు. సర్వే విభాగంలోని భారతీయ ఉద్యోగుల దోపిడీని వ్యతిరేకించి ఆయన పెద్ద పోరాటం చేశాడు. అందుకు ఆయనకి 200 రూపాయల జరిమానా విధించారు. ఈ విషయాన్ని అప్పటి పత్రిక బెంగాల్ స్పెక్టేటర్ రిపోర్టు చేసింది. ఆయన పట్ల ఉన్న కోపంతో సర్వే విభాగం మాన్యువల్ కి రాధానాథ్ రాసిన ముందుమాటను తొలగించారు. 1851 లో ప్రచురించిన మాన్యువల్ లో రాధానాథ్ వ్రాసిన ముందుమాట ఉంది. కానీ 1875 నాటి మూడవ ఎడిషన్ నాటికి ముందు మాట మాయమైపోయింది. అప్పటికే రాధానాథ్ చనిపోయారు. అప్పట్లో ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనే పత్రిక దీన్ని చనిపోయిన వాడిని దోచుకోవడంతో పోల్చింది.

అలా రాధానాథ్ చరిత్ర మరుగున పడిపోయింది. ఆయన గురించి ఇప్పటి తరానికి ఎవరికీ తెలియకుండా అయిపోయింది. విదేశీ శాస్త్రవేత్తల ఫోటోలను ఎంతో భక్తిశ్రద్ధలతో పెట్టుకునే మనం ఇలాంటి మన మహనీయుల్ని మరిచిపోయాం. 2004 లో అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో భారత ప్రభుత్వం ఈ మరుగున పడ్డ మేధావి పేరిట స్టాంపును జారీ చేసింది. మరిచిపోయిన మహనీయులను గుర్తుచేసే ఆ సర్కారుకు ఓటేయడం మనం మరిచిపోయాం. ఆ ప్రభుత్వమూ పోయింది. ఇంగ్లండు వాళ్లే రాధానాథ్ ను మరుగుపరిచారు. ఇక ఇటాలియన్లెందుకు పట్టించుకుంటారు?

1862 లో రిటైరైన తరువాత రాధానాథ్ 1870 లో బెంగాల్ లోని సొంత ఊరిలో స్థిరపడ్డారు. అక్కడే గంగా తీరంలో ఆయన తుదిశ్వాసను విడిచారు.

శ్రీనివాసన్ రామానుజన్ గణితం లోతులను కొలిస్తే, రాధానాథ్ గణితం ఎత్తులను కొలిచాడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గణితం ఆధారంగా నిర్మాణాలు చేశారు. ఈ ముగ్గురినీ నిజానికి మనం ఫోటోలు పెట్టుకుని స్మరించాలి. కానీ వీళ్ల గొప్పదనం తెలియకుండా తెల్లవాళ్లు జాగ్రత్త పడ్డారు. తెల్లవాళ్ల తోకల్లా బతికే నల్లవాళ్లు ఇప్పటికీ అదేపనిని చేస్తున్నారు.




ఇంతకీ కల్నల్ వా కుట్రపూరితంగా పీక్ నంబర్ 15కి స్థానికపేరు పెట్టకుండా మౌంట్ ఎవరెస్ట్ అని పేరు పెట్టారని చెప్పుకున్నాం కదా. ఆ పీక్ నంబర్ 15 స్థానిక పేరు ఏమిటో తెలుసా?

గౌరీశంకర శిఖరం. ఒక నలభై యాభై ఏళ్ల వరకూ ఈ పేరు గుర్తుండేది. ఇప్పుడు ఇంగ్లీషు చదువుల పుణ్యమా అని మౌంట్ ఎవరెస్ట్ మాత్రమే మిగిలింది. రాధానాథ్ సిక్దర్ లాగా గౌరీ శంకరశిఖరమూ మరుగున పడిపోయింది.

4 comments:

  1. Thank U Raka!! U r bringing out the best!

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. రాకా గారు కృతజ్ఞతలండి ఆంగ్ల దౌష్ట్యాన్ని బాగా బయట పెట్టారు . మరి మన స్వంత బ్రతుకులు మనకెప్పుడు వస్తాయో !!!

    ReplyDelete

Pages