రెండు బుజ్జికథలు - Raka Lokam

రెండు బుజ్జికథలు

Share This
ముళ్ల చెట్టు




ఒకాయన వచ్చేపోయే దారికి అడ్డంగా ముళ్లచెట్టు నాటాడు. దానికి నీళ్లు పోసి పెంచసాగాడు.

అది ఇరుగూ పొరుగుకి అడ్డమైంది. దాని ముళ్లు కాళ్లకి గుచ్చుకునేవి. ఒంటికి గీరుకునేవి.

అయినా ఆ వ్యక్తి ఎవరి మాటా వినేవాడు కాదు.

చివరికి -

ఒక రోజు ఆ ముళ్లు అతని కాళ్లకే గుచ్చుకున్నాయి. ఒళ్లంతా గీరుకుని, రక్తం కారసాగింది.

అతనికి చాలా బాధ కలిగింది. కోపం కూడా వచ్చింది.

ముళ్ల చెట్టును పీకేసేందుకు ప్రయత్నించాడు. చెట్టు ఊడిరాలేదు. ఎందుకంటే ఆ చెట్టు అప్పటికే చాలా పెద్దదైపోయింది. నాటిన వాడికన్నా బలంగా నాటుకుపోయింది. వేళ్లు చాలా బలంగా లోతుగా పాతుకుపోయాయి. కాండమంతా ముళ్లే ముళ్లు.

పాపం .... పెంచడానికి చాలిన బలం తుంచడానికి సరిపోలేదు.







నాలుకా .... మజాకా?

ఒకసారి నాలుక, పళ్లూ నేను గొప్పంటే నేను గొప్ప అని వాదులాడుకున్నాయి.

" మా బలం నీకేం తెలుసు? ఒక సారి మాపళ్ల మధ్యకు రా! నీకు మా తడాఖా ఏమిటో చూపిస్తాం" అని హుంకరించాయి పళ్లు.

"కాస్సేపాగు.... ఎక్కడికీ ఎవరి మధ్యలోకీ రాకుండానే మీకు నా తడాఖా ఏమిటో చూపిస్తా" అన్నది నాలుక.
అంతలో ఒక పెద్దమనిషి అదే దారిన వెళ్తున్నాడు.

నాలుక ఆయన్ని నానా తిట్లూ తిట్టేసింది.

ఆయనకు కోపం వచ్చింది. దవడ మీద లాగి ఒక్కటిచ్చుకున్నాడు.

ముఫ్ఫై రెండు పళ్లూ రాలిపడ్డాయి.

"చూశావా నా తడాఖా.... నాలుకా .... మజాకా ....." అంది నాలుక.

No comments:

Post a Comment

Pages