తీరితే తిరుపతి .... తీరకపోతే మన్నెం కొండ! - Raka Lokam

తీరితే తిరుపతి .... తీరకపోతే మన్నెం కొండ!

Share This



తిరుపతిలోని శేషాచలంపై తపస్సు చేసుకునే శ్రీ రామయోగికి కల వస్తుంది. కలలో శ్రీవేంకటేశ్వరుడు కనిపించి "తిరుమల ఎంత పవిత్రమో ఆ కొండ కూడా అంతే పవిత్రం. అక్కడ కూడా నేనే కొలువై ఉన్నాను. నీవు అక్కడికి వెళ్ళు. అక్కడ కొండ కోనల్లో అజ్ఞాతంగా ఉన్న నన్ను వెలికి తియ్యి. నా తిరుమల కొండకు రాలేని భక్తులకు అక్కడే దగ్గరలోనే నా దర్శనం లభించేలా చేయి" అని అదేశిస్తాడు.

అంతే. శేషాచలవాసుడికి సాష్టాంగ ప్రణామం చేసి శ్రీరామ యోగి వెంకన్న చెప్పిన ఆనవాళ్లు పట్టుకుని ఆ కొండను వెతుక్కుంటూ బయలుదేరతాడు. ఆయనకు ఒక విగ్రహం దొరుకుతుంది. ఆదికేశవుడు పడగపట్టినట్టున్న ఒక గుహలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉంటాడు.

ఎక్కడో తమిళనాడు శ్రీరంగం పొరుగునే అళహరి అన్న చిన్న గ్రామంలో కేశవయ్యకు కూడా అదే కల వచ్చింది. "కృష్ణా నదీ తీరంలో ఒక కొండ మీద నేనున్నాను" అని వేంకటేశ్వరుడు చెబుతాడు. మెలకువ రాగానే కేశవయ్య తన కుటుంబాన్ని మొత్తం వెంటబెట్టుకుని కొండలలో నెలకొన్న కోనేటిరాయడి కోసం బయలుదేరతాడు.

అళహరి కేశవయ్య శ్రీరంగం నుంచి కృష్ణా నది తీరం చేరుకుంటాడు. నదిలో మొలలోతు నీటిలో మునిగి దేవదేవుడికి అర్ఘ్యం ఇస్తాడు.




ఆశ్చర్యం.

ఆ దోసిట్లో శ్రీవేంకటేశ్వరుడి దివ్యమంగళ రూపం కనిపించింది. నెమ్మదినెమ్మదిగా ఆ ఆకారం ఘనీభవించింది. ఒక విగ్రహం తయారైంది. కేశవయ్య ఆ విగ్రహాన్ని తీసుకుని వచ్చి నదీతీరానికి దగ్గరలో ఉన్న అదే కొండపై ప్రతిష్ఠించాడు. ఆ కొండ మామూలుదా? కానేకాదు. అది అలౌకికమైన కొండ.

ఆ కొండపైన

చెయ్యని పాదాలు,

చెక్కని విగ్రహం,

కట్టని గుడి,

తవ్వని కోనేరు


తమంతట తాము సాక్షాత్కరించాయి.

అటు శ్రీరామయోగి, ఇటు అళహరి కేశవయ్య కొండపై నెలకొన్న ఆ దేవుడిని సేవిస్తూ, కీర్తిస్తూ కాలం గడిపేశారు.
శ్రీరామయోగి ఏరకమైన ఆహారమూ తీసుకునేవాడు కాదు. నిత్యం తపస్సులోనే మునిగి ఉండేవాడు. అళహరి కేశవయ్య ఎంతో బతిమాలగా నీ ఆవుల నుంచి పితికిన పాలు తీసుకువస్తే తాగుతానని చెప్పాడు. అయితే రెండో వ్యక్తికి ఈ సంగతి తెలియరాదని ఆంక్ష విధించాడు.

అలా అళహరి పితికిన పాలు తేవడం, శ్రీరామయోగి వాటిని తాగేయడం జరుగుతోంది. ఒక రోజు పాల లెక్క తేలక అళహరి భార్య భర్తను నిలదీసింది. తప్పనిసరై నిజం చెప్పేశాడు అళహరి. అంతే పితికిన ఆవుపాలు నీరుగా మారిపోయింది. రహస్యం బయటపడినందుకు ఇక తనువు చాలిస్తానని శ్రీరామయోగి అళహరికి చెప్పాడు. అళహరి కన్నీరు మున్నీరవుతుండటం చూసి, "నీవు నాకు రోజూ పాలు తాగించావు. కాబట్టి నేను నీకు ఋణపడి ఉన్నాను. ఋణ విముక్తి కోసం నీ కొడుకుగా పుడతాను"అని చెప్పాడు.

"అళహరీ ... నేను నీ భార్య గర్భంలో ఉన్నాననేందుకు ఋజువుగా ఆమె గర్భం నీలంగా ఉంటుంది. తిరునామాల నీలమోహన వేంకటేశ్వరుడిని నువ్వు, నేను ఆరాధించాం. అందుకు ప్రతీకగానే నీభార్య గర్భం నీలం రంగులో ఉంటుంది" అన్నాడు శ్రీరామయోగి.

అలా పుట్టినవాడే మహాయోగి హనుమద్దాసు. ఖమ్మంజిల్లా భద్రాచలంలో రామతారక మంత్ర దీక్ష తీసుకుని భక్తిపారవశ్యంలో కీర్తనలు వ్రాయనారంభించాడు. అవే చరితకెక్కిన హనుమద్దాసు కీర్తనలు.

దాదాపు అయిదువందల ఏళ్ల క్రితం శ్రీ రామయోగి ప్రతిష్ఠించిన విగ్రహం, అళహరి కేశవయ్య ప్రతిష్ఠించిన విగ్రహం ఆదిశేషుడి పడగలాంటి గుహలో కొలువయ్యాయి. కొండలు, అడవులు, నదులు, లోయలు దాటి తిరుమల కొండ ఎక్కలేని భక్తులకు దగ్గర్లోనే వెంకన్న దర్శనమివ్వసాగాడు. అడవుల గర్భంలో దాగున్న కొండల కోనపై నెలవైన ఆ శ్రీవేంకటేశ్వరుడు అయిదు శతాబ్దాలుగా పాలమూరు ప్రజలకు కొంగుబంగారంలా నిలిచి కోరినవి ఇస్తూ వస్తున్నాడు.

ఆ కొండే మన్యం కొండ. ఆ దేవుడే మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి. ఆ దేవుడికి క్షేత్రపాలకుడు వీరభద్రుడు. శివకేశవ అభేదాన్ని తెలిపేందుకు అదే కొండపై శివలింగం వెలసింది. కొండ కింద కొద్ది దూరంలో అలమేలుమంగ వెలసింది. హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్ నగర్ నుంచి రాయచూరు వెళ్లే దారిలో 20 కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉంది.

ఇప్పటికీ పాలమూరు భక్తకోటికి మన్యంకొండ అత్యంత ఆరాధ్యం. "తీరితే తిరుపతి..... తీరకపోతే మన్యం కొండ" అన్న నానుడి ఈ గుడికి వచ్చింది. మహబూబ్ నగర్ ప్రజలకు ఇది రెండో తిరుపతిగా నిలిచింది.
అయిదు వందల ఏళ్ల క్రితం తమిళనాడు వదిలి వెంకన్నను వెతుక్కుంటూ వచ్చిన అళహరి కుటుంబానికి చెందిన వారే ఇప్పటికీ ఈ ఆలయానికి ధర్మకర్తలు, పూజారులు. కొండపైకి ఘాట్ రోడ్ వేయించారు. దేవుడికి గుడిని కట్టించారు. తమిళనాడునుంచి వచ్చిన పూజారులు తెలుగునాట కన్నడ నాడు నిర్మాణ శైలిలో ద్వారాలను, ప్రాకారాలను కట్టించారు. అటు మన రాష్ట్రం నుంచి, ఇటు కర్నాటకనుంచి భక్తులు ఇక్కడికి వస్తారు.

మన్యం కొండపైకి వెళ్తే మనల్ని మనం మరిచిపోతాం. మన ఇల్లు, వాకిలి, అలసట, ఆయాసం ఏవీ గుర్తుకు రావు. ఈ కొండ కోనల్లో దేవుడు ఏసాక్ష్యమిచ్చేందుకు ఇక్కడ శతాబ్దాలుగా నిలుచున్నాడో తెలియక అయోమయంలో పడిపోతాం. ఈ కొండలో అడుగడుగునా సంభ్రమాశ్చర్యాలే. వంగి వెళ్లాల్సిన గుహలోనుంచి వెళ్తే ఇంకో చీకటి గుహ. అందులో స్వామివారు కొలువుంటారు. అలా గుడిలోనుంచి బయటకు రాగానే మెట్లు మళ్లీ మలుపులు తిరుగుతాయి. కొన్ని మెట్లెక్కగానే శివమందిరం. అక్కడనుంచి బయటకు రాగానే కిందకి దారి. అంతా రహస్యమయంగా ఉంటుంది. కొండపైనుంచి కిందకి చూస్తే దారులు నేల నుదుటిపై గీసిన నామాల్లా కనిపిస్తాయి. సర్వం వేంకటేశ మయం అన్నట్టు అనిపిస్తుంది.

అసలు ఏమిటీ వెంకన్న బాబు మహత్మ్యం? తాను తిరుపతిలో కొలువుంటాడు. కానీ తనవద్దకు రాలేని భక్తులకోసం వారి చెంతనే వెలుస్తాడు. చెంబులో నీరే గంగాజలం అన్నట్టు చెంతనే ఉంటూ అల్లంతన ఉన్న తనను ఇక్కడే దర్శించమంటాడు. లేకపోతే చిలుకూరులో బాలాజీ, మహబూబ్ నగర్ శ్రీరంగాపురంలో వెంకటేశుడు, రంగారెడ్డి జిల్లా జిల్లేళ్లగుడా వెంకన్న, మన్యంకొండ వెంకన్న, ఖమ్మంలోని మంగాపురం వెంకన్న, జమలాపురం వెంకన్న, పశ్చిమగోదావరిలోని ద్వారకా తిరుమల ఇలా ఎక్కడంటే అక్కడ తిరుపతి వెంకన్న ఎందుకు వెలిశాడు? ఇవన్నీ చిన్న తిరుపతులే ఎలా అయ్యాయి? లేకపోతే పరకీయుల మతోన్మాద దాడుల విషఘడియల్లో హైందవజాతిలో ధార్మిక చేతనా దీపం కొడిగట్టకుండా ఉండేందుకు ఎక్కడంటే అక్కడ ధర్మజ్యోతులు వెలిగించేందుకు ధార్మిక నేతలు చేసిన మహత్ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరిగిందా? అక్కడో ముగ్గు చుక్క, ఇక్కడో ముగ్గు చుక్కల్లా దేవాలయాలను నిర్మించి, ఆ ముగ్గు చుక్కల్ని కలిపి గీసి ముగ్గుగా చేయడం వెనుక పరమార్థం ఏమిటి?

కొండగుహలో వెంకన్న బాబు ముందు నిలుచునే సరికి ప్రశ్నలుండవు. సందేహాలుండవు. శంకలుండవు. సమాధానాలు అవసరముండవు. మనకి మనం గుర్తుండం.

అప్పుడెప్పుడో ఎవరో భక్తుడు

"జబ్ మై థా

తబ్ హరి నహీ

అబ్ హరి హై

మై నహీ

ప్రేమగలీ అతి సాంకరీ

జ్యా మే దో న సమాయ్"
అన్న సంగతి గుర్తుకొస్తుంది. (నేను అన్న అహం ఉంటే హరి దరి చేరడు. హరి దరిచేరితే ఇక నేను అన్న భావనే ఉండదు. ప్రేమ మార్గం ఎంత ఇరుకైనదంటే ఇందులో ఇద్దరికి తావు లేదు. జీవాత్మ, పరమాత్మల ఏకాత్మకే స్థానముంటుంది.)

మన్యం కొండపై వేంకటేశ్వరుడు కొలువున్న చోటు అంత ఇరుకుగా ఉండేది అందుకేనేమో !!


1 comment:

  1. Dear Sudhakarji,
    Greetings from Jc Bharadwaja
    Very nice story to read and to know about a new devotional place in detail. Keep writing like this.
    Yours,
    biju

    ReplyDelete

Pages