కొడితే కొట్టాలి....సిక్సు కొట్టాలి....
ఒక రాజుగారు అడవిలో వేటకి వెళ్లి మిగతావారి నుంచి వేరైపోయాడు.
ఆయన అలసి ఉన్నాడు... ఆదమరిచి ఉన్నాడు...
అప్పుడే ఒక పులి ఆయనపై దాడి చేసింది. ఆయన కత్తి చేజారిపోయింది.
పులి ఆయన్ని చంపేసేదే.
అంతలో నలుగురు యువకులు ఎక్కడినుంచో వచ్చి శాయశక్తులా పోరాడి పులిని చంపేశారు. రాజుగారిని రక్షించాడు.
ఇంతలో రాజుగారి సైన్యం, సేవకులు, మంత్రీ రాజును వెతుక్కుంటూ వచ్చారు.
రాజుగారు నలుగురు యువకులకీ కృతజ్ఞతలు చెప్పారు. రాజుగారు కదా...ఆయన కృతజ్ఞత స్టయిల్ వేరు. "మీకేం కావాలో కోరుకొండి" అన్నాడు.
మొదటివాడు "బీదోడిని మహారాజా...నాకు ఒక ఉద్యోగం ఇప్పించండి" అన్నాడు.
రాజుగారు ఉద్యోగం ఇచ్చేశారు.
రెండోవాడు "నాకు పెద్ద ఇల్లు, బోలెడు ధనం కావాలి" అన్నాడు. రాజుగారు సరేనన్నారు. మంత్రి కావలసిన ఏర్పాట్లకు ఆదేశాలిచ్చేశాడు.
మూడో వాడు "నాకేమీ వద్దు. కానీ మా ఊరికి సరైన బాట లేదు. అది వేయించండి చాలు" అన్నాడు.
రాజుగారు సరేనన్నారు.
నాలుగోవాడు "నాకేం వద్దు మహారాజా" అన్నాడు.
"వీల్లేదు ...ఏదో ఒకటి కోరుకోవాల్సిందే"
"నాకేం వద్దు మహారాజా"
రాజుగారికి పట్టుదల పెరిగింది.
"ఏదో ఒకటి కోరుకుని తీరాల్సిందే"
"ఏదడిగినా ఇస్తారా" అని అడిగాడు యువకుడు.
"ఏదైనా అడుగు. ఇస్తాం" అన్నారు రాజుగారు.
"మీరు మా ఇంట్లో ఒక పూట భోజనం చేయాలి" అన్నాడు యువకుడు.
"ఒస్ అంతేనా...దానికేం భాగ్యం..." అన్నారు రాజుగారు. ఏర్పాట్లు చూడమని మంత్రికి చెప్పాశారు.
యువకుడి ఊరు కుగ్రామం. దారి లేదు. రాజుగారు వెళ్లాలంటే ఆ ఊరికి కొత్తగా దారి వేయాల్సిందే. అలాగే వేశారు.
ఆ యువకుడిది పూరి గుడిసె. రాజుగారు వెళ్లేందుకు పనికిరాదు. దాంతో మంచి భవనం కట్టించి ఇవ్వాల్సి వచ్చింది.
ఆ తరువాత ఇంకో ప్రశ్న వచ్చింది. రాజుగారు అల్లాటప్పా వాళ్లింటికి వెళ్లకూడదు. అలా వెళ్తే రాజుగారికి నామోషీ.
దాంతో రాజదర్బారులో ఆ యువకుడికి పెద్ద ఉద్యోగం ఇచ్చారు.
ఆ తరువాత అసలు ప్రశ్న వచ్చింది. రాజుగారి భోజనం గురించి ఆ యువకుడికి తెలియదు. రాజుగారి సేవకులు వెళ్లి వండిపెడితే యువకుడి ఇంట్లో భోజనం చేసినట్టు కాదు. రాజుగారేమైనా రాహుల్ గాంధీయా... తన సెక్యూరిటీ తెచ్చిన భోజనాన్ని కళావతి పూరింట్లో తిని పోజులిచ్చేందుకు. రాజుగారు పాత కాలం మనిషి. మాటంటే మాటే మరి. రాజుగారి భోజనపు అలవాట్లు తెలిసిన వ్యక్తి ఆ ఇంట్లో ఉంటేనే ఆయన మాట చెల్లుతుంది. ఆయనకు కావలసిన భోజనం దొరుకుతుంది. రాజుగారు మాట తప్ప దలచుకోలేదు.
"మా అమ్మాయిని ఇచ్చి ఈ యువకుడికి పెళ్లి చేయండి. అప్పుడు సమస్య ఉండదు."అన్నారు.
రాజుగారికి ఆ కుర్రవాడి తెలివితేటలు అర్థమయ్యాయి. ఏమీ కోరకుండానే అన్నీ సంపాదించుకున్నాడు.
"హారి పిడుగా" అనుకున్నారు.
అల్లుడిని చేసుకున్నారు. అర్ధ రాజ్యం ఇచ్చారు.
సెంట్ పర్సెంట్
మన మంత్రి గారు చైనా పర్యటనకి వెళ్లారు. అక్కడ ఒక మంత్రిగారితో మాంఛి స్నేహం ఏర్పడింది.
చైనా మంత్రిగారింటినుంచి మన మంత్రి గారికి విందు ఆహ్వానం వచ్చింది. చైనా మంత్రి గారింట్లో ఎక్కడ లేనంత వైభోగం.
"ఇంత డబ్బు ఎలా వచ్చింది" అని అడిగారు మన మంత్రి.
చైనా మంత్రి మన మంత్రిని తన మేడ బాల్కనీ మీదకి తీసుకెళ్లి దూరంగా చూపించి "అక్కడ ఒక నది కనిపిస్తుందా?" అన్నాడు.
"కనిపిస్తుంది"
"దానిపై వంతెన కనిపిస్తోందా?"
"కనిపిస్తోంది"
"అందులో టెన్ పర్సెంట్" అని భోంచేసినట్టు అభినయించేశాడు చైనా మంత్రి.
కొన్నాళ్లకు చైనా మంత్రి మన దేశ పర్యటనకు వచ్చాడు. మన మంత్రిగారూ విందుకు ఆహ్వానించాడు.
మన మంత్రిగారి వైభోగం చూసి చైనా మంత్రి కళ్లు చెదిరిపోయాయి. చైనా మంత్రి వైభోగానికి వంద రెట్లుగా ఉంది అది.
"ఇదెలా సాధ్యం" అని మన మంత్రిని అడిగాడు.
తన మేడ మీదకి తీసుకెళ్లి, బాల్కనీ నుంచి దూరంగా చూపించాడు మన మంత్రి.
"అక్కడ ఒక నది కనిపిస్తోందా?"
"కనిపిస్తోంది."
"దానిపై వంతెన కనిపిస్తోందా?"
"లేదు...అసలక్కడ వంతెన ఏదీ?"
మన మంత్రిగారు చిద్విలాసంగా నవ్వి చిరుబొజ్జ తడుముకుంటూ చెప్పారు.
"హండ్రెడ్ పర్సెంట్!!!"
పి.ఎస్ - మొదటి కథ ఏం కోరుకోవాలో తెలిసిన యువకులకి, రెండో కథ హండ్రెడ్ పర్సెంట్ గాళ్ల మీద హండ్రెడ్ పర్సింట్ పోరాడుతున్న యువతరానికి అంకితం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment