మోడల్ - Raka Lokam

మోడల్

Share This



అనగనగా ఒక పెయింటర్.

ఆయనకి దేవుడి బొమ్మ గీయాలని కోరిక పుట్టింది.

దైవత్వం ఉట్టిపడే మోడల్ కోసం ఎంతో వెతికాడు. చివరికి వెతికి వెతికి ఒక పసిపాపను ఎంచుకున్నాడు.

పాలుగారే చెక్కిళ్లు...పసిడి కాంతుల ముఖం....వెన్నెల కురిపించే కళ్లు...తేనెల వాన కురుస్తుందా అనిపించే నవ్వు.... ఆ ముఖంలో ఒక అద్భుతమైన వెలుగు.....

ఆ పసివాడినే మోడల్ గా పెట్టుకుని అద్భుతమైన పెయింటింగ్ వేశాడు. దానికి దేవుడు అని పేరు పెట్టాడు.

ఆ పెయింటింగ్ కి ప్రపంచమంతటా పేరొచ్చింది. అందరూ ఆయన్ని వేనోళ్ల పొగిడారు.

దానితో "దేవుడి బొమ్మ గీశాక ఇంకే బొమ్మా వేయను" అని నిర్ణయించుకున్నాడు. కుంచె కేన్వాస్ పక్కన పెట్టేశాడు.

ఆ తరువాత ప్రపంచమంతా పాతికేళ్ల పాటూ పర్యటించాడు.

పాతికేళ్ల తరువాత ఆయనకు మళ్లీ పెయింటింగ్ వేయాలనిపించింది.

ఈ సారి రాక్షసుడి బొమ్మ వేయాలనుకున్నాడు.

దానికోసం ఒక క్రూరాతిక్రూరమైన, కరడుగట్టిన నేరస్తుడిని ఎంచుకున్నాడు. ఎన్నో నేరాలు, ఎన్నెన్నో హత్యలు చేసి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు ఆ నేరస్తుడు.

ఆ నేరస్తుడితో మాట్లాడేందుకు వీల్లేదన్నారు జైలు అధికారులు. కటకటాలలో నేరస్తుడు, బయట పెయింటర్ ఉండి పెయింటింగ్ వేయాలన్నారు వాళ్లు. పెయింటర్ అన్ని నిబంధనలకూ ఒప్పుకున్నాడు.

ఆ నేరస్తుడిని మోడల్ గా పెట్టుకుని చిత్రాన్ని గీశాడు పెయింటర్.

క్రౌర్యం నిండిన కళ్లు...ఒళ్లు జలదరించే విషపు నవ్వు....భయం పుట్టించే ముఖం....ఏదో తెలియని చీకటి ఆ ముఖంలో నిండి ఉంది.

చివరికి పెయింటింగ్ తయారైంది.

ఆ పెయింటింగ్ ని చూసిన వారంతా జడుసుకున్నారు.

పెయింటర్ కి చాలా పేరొచ్చింది. బోలెడంత డబ్బు కూడా వచ్చింది.

తనకు వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని ఆ నేరస్తుడికి ఇవ్వాలనిపించింది. ఆ పెయింటర్ డబ్బు తీసుకుని నేరస్తుడిని కలిసేందుకు జైలుకి వెళ్లాడు.

ఈ సారి నేరస్తుడిని కలిసి, మాట్లాడేందుకు అనుమతి దొరికింది.

లోపలికి వెళ్లి నేరస్తుడి ముందు డబ్బు మూటను ఉంచాడు పెయింటర్.

"నాకీ డబ్బుతో పనిలేదు... రేపు నన్ను ఉరి తీస్తారు" అన్నాడు నేరస్తుడు.

చాలా సేపు మౌనంగా ఉండిపోయాడు పెయింటర్.

చివరికి బయలుదేరేందుకు లేచాడతను.

జైలు ఊచల వైపే తదేకంగా చూస్తున్న నేరస్తుడు ...

"పాతికేళ్ల క్రితం నేను నెలల బాబుగా ఉన్నప్పుడు మీలాగే ఒక పెయింటర్ వచ్చి నా బొమ్మ వేశాడట. దానికి దేవుడు అన్న పేరు కూడా పెట్టాడట. మా అమ్మ ఎప్పుడూ చెప్పేది. మిమ్మల్ని చూస్తే మా అమ్మ మాటలే గుర్తుకొస్తున్నాయి." అన్నాడు.

నేరస్తుడు నెమ్మదిగా నడిచి వెళ్లి రాతిబల్లపై పడుకున్నాడు.

పెయింటర్ రాయిలా అయిపోయాడు.

ఆ రోజు దేవుడి బొమ్మకి, ఈ రోజు రాక్షసుడి బొమ్మకి మోడల్్ ఒకరేనా?

నోట మాట రాలేదు ....

దేవుడు దానవుడెలా అయ్యాడు ....?

1 comment:

  1. Each story is really nice n touching Sir......Nanamma chinnapudu cheppina Kadhalla anipisthunai.....

    ReplyDelete

Pages