వాడొక దొంగ సాములోరు.
వేషం వేశాడు. భాష మార్చాడు.
గారడీలు నేర్చాడు.
బురిడీలు కొట్టించాడు.
జనం బోల్తా పడ్డారు. కూర్చున్న చోటకే కనకాదులు, కంచం నిండా భోజనాలు వచ్చేస్తున్నాయి సాములోరికి. ఆయనకి ఒక ఆశ్రమం, బోలెడంత ఆస్తీ తయారైంది.
ఇదంతా ఒక తెలివైన కుర్రాడు చూశాడు.
స్వామివారి పని పట్టాలనుకున్నాడు.
ఒక రోజు దొంగబాబా జోరుజోరుగా భజన చేయిస్తూండగా పరుగుపరుగున వచ్చి పాదాలపై పడ్డాడు. ఎక్కడ లేని భక్తిని నటించాడు.
ఉన్నట్టుండి బాబా తల మీదనుంచి ఆరు వెంట్రుకలను గట్టిగా ఊడ పీకాడు.
భక్తి తన్మయత్వం నటిస్తూ "స్వామివారి కేశాలు స్వర్గానికి చేంతాళ్లు. వీటిని పట్టుకుని స్వర్గానికి ఎగబాకవచ్చు. రాత్రి దేవుడు కల్లోకి వచ్చి మరీ నాకిదంతా చెప్పాడు. ఒక వెంట్రుక నాకు, ఒకటి నాకు కాబోయే భార్యకి, మిగిలినవి నాకు పుట్టబోయే బిడ్డలకి" అంటూ కేకలు వేస్తూ నాట్యం చేసేశాడు.
ఇంకేముంది?
భజన ఆగిపోయింది.
భక్తులందరూ అందినంత మేరకు స్వామివారి బొచ్చు పట్టుకుని ఊడపీకారు.
వార్త ఆనోటా ఈ నోటా పాకింది.
ఆశ్రమానికి జనం బారులు తీరారు.
ఆ తరువాత ఏమైంది?
స్వామివారి బొచ్చంతా ఊడింది. బోడిగుండైంది.
భక్తులు మాత్రం ఆగలేదు.
కాలికి, చేతికి, ఛాతీకి ఉన్న వెంట్రుకల్ని కూడా పీకనారంభించారు.
ఈ బొచ్చు భక్తిని భరించలేని బాబా గారు ఓ అమావాస్య అర్ధరాత్రి చీకట్లో ఎవరికీ తెలియకుండా ఊరొదిలి ఉడాయించాడు.
నమ్మకం....విశ్వాసం
రెండు ఇరవై అంతస్తుల భవనాలు. పక్కపక్కనే ఉన్నాయి.
వాటిని కలుపుతూ ఒక తాడు.
ఆ తాడుపై గారడీవాడు అలవోకగా నడిచేస్తున్నాడు.
అందరూ చూసి చప్పట్లు కొట్టేస్తున్నారు. వాడి ధైర్యానికి, సాహసానికి, నైపుణ్యానికి అబ్బురపడిపోతున్నారు.
ఆ గారడి వాడు తాను నడవడమే కాదు. తన తొమ్మిదేళ్ల పాపని కూడా భుజాన ఎక్కించుకున్నాడు. ఆమెతో సహా తాడుపై నడిచాడు.
అందరూ కేరింతలు కొట్టారు.
"నాపై నమ్మకం ఉందా? నేను ఈ తాడుపై నడవగలనన్నది మీరే చూశారు కదా"
ప్రజలందరూ పెద్దపెట్టున అరిచారు. "ఉంది...ఉంది...ఉంది"
"అయితే మీలో ఎవరైనా నా భుజం మీదకి ఎక్కండి. ఆ భవనానికి తాడుమీద తీసుకెళ్తాను"
ప్రజలందరూ ఒక్కసారి చల్లబడిపోయారు.
ఉలుకు లేదు
పలుకు లేదు
నమ్మకం వేరు....విశ్వాసం వేరు.
గారడివాడు తాడుపై పడిపోకుండా నడవగలడు .... ఇది నమ్మకం.
అతని భుజం మీద కూర్చుని, అతనితో పాటు తాడుపై నడవటం ... దీనికి విశ్వాసం కావాలి.
సర్వస్వ సమర్పణ భావం కావాలి.
No comments:
Post a Comment