డెడ్ యాజ్ ఏ డోడో - Raka Lokam

డెడ్ యాజ్ ఏ డోడో

Share This



మారిషస్, న్యూజీలాండ్లలో వంద ఏళ్ల క్రితం ఒక పక్షి ఉండేది. దాని పేరు డోడో.

శత్రువులు కనిపించగానే అది చచ్చినట్టు పడి ఉండేది. శత్రువులు వదిలేసి వెళ్లిపోయేవి. చచ్చిన దాన్ని స్థానిక మావురీ, మారిషస్ ప్రజలు ముట్టుకునేవారు కాదు. అందుకే డోడోలు బతికిపోయేవి.

ఆ తరువాత ఆంగ్లేయులొచ్చారు. వాళ్ల తోలెంత తెలుపో మనసంత నలుపు. వాళ్లు మావురీల్లాంటి వాళ్లు కాదు. డోడోల్ని చంపడం వాళ్లకి సరదా అయిపోయింది. చచ్చిపడున్నట్టు పడుండే డోడోల్ని కాల్చి చంపే పిట్టల దొరలు వాళ్లు. డోడోల వెర్రిబాగుల రక్షణ వ్యూహాన్ని చూసే "డెడ్ యాజ్ ఏ డోడో" అన్న ఆంగ్ల అభివ్యక్తి పుట్టుచొచ్చింది.

అలా మొత్తం డోడోలను వరస పెట్టి చంపేశారు. చిట్టచివరి డోడో 1671 ప్రాంతంలో చనిపోయింది. తెల్లోళ్లు తీసిన ఫోటోలు, గీసిన బొమ్మలు తప్ప డోడోఅనే పక్షి ఉందన్న ఋజువులే లేకుండా పోయాయి.




అసలు కథ ఆ తరువాతే మొదలైంది.

డోడోలు చనిపోయిన ఒక వందా యాభై ఏళ్లకి శాస్త్రవేత్తలు ఒక విచిత్రాన్ని గమనించారు. కాల్వేరియా మేజర్ అనే చెట్టు విత్తనాలు మొలకెత్తడం మానేశాయి. పాత చెట్లను విచక్షణా రహితంగా నరికేశారు. అడవులను కాల్చేశారు. కొత్తవి మొలకెత్తడం లేదు. ఇప్పుడు ప్రపంచంలో 13 మాత్రమే మిగిలాయి. అవీ ముసలి చెట్లు. అన్నీ 300 ఏళ్లు దాటినవే. ఎంత ప్రయత్నించినా, ఎన్ని ప్రయోగాలు చేసినా విత్తనాలు మాత్రం మాట వినడం లేదు.

అప్పుడు అర్థమైంది సైంటిస్టులకి.

డోడోలకి కాల్వేరియా కాయలే ప్రధాన ఆహారం. డోడోల జీర్ణకోశం లోని ప్రత్యేక రసాయనాలకు కాల్వేరియా విత్తనాల పై పొర కరిగిపోయేది. దాని రెట్టనుంచి విత్తనాలు నేలపై పడిన మరుక్షణం మొలకెత్తేవి.

కాల్వేరియా విత్తనపు కంచు కవచం తాళం చెవి తన కడుపులోనే దాచుకుని డోడో అంతరించిపోయింది.

కాల్వేరియా జీవ బిందువు బయటికి రానుగాక రానంటూ విత్తనంలోపలే దాగుండిపోయింది.

దేశం ఏమిటి? ఉంటే ఎంత? పోతే ఎంత? భారత్ కాకపోతే అమెరికా ... అదీ కాకపోతే అంతరిక్షం.... దేశం అంటే డోడో లాంటి డెడ్ థింగే కదా అనుకుంటారు చాలా మంది.

పాపం వాళ్లకి తెలియదు...

వాళ్లు కాల్వేరియా మేజర్ లాంటి వాళ్లని.




పి.ఎస్ – కాల్వేరియా అన్న పేరుకి కాస్త తమాషా కథ ఉంది. కాల్వేరియాకి క్రైస్తవులు పవిత్రంగా ప్రస్తావించే కల్వరికి సంబంధం ఉంది. యూరోపియన్లు ఆ చెట్టుని కల్వరి పేరు పెట్టుకున్నారు. కాల్వేరియా అంటే పుర్రె అని అర్థం. కల్వరిని ఆరామక్ భాషలో గోల్ గట్రా అని కూడా అంటారు. ఈ గోల్ గట్రానే బైబిల్ లో గోల్ గోథా అని చెప్పారు.

No comments:

Post a Comment

Pages