"జై బోలో గణేశ్ మహరాజ్ కీ" - Raka Lokam

"జై బోలో గణేశ్ మహరాజ్ కీ"

Share This




ఒక సారి బొజ్జ గణపయ్య వైపు పరిశీలనగా చూడండి.

తొండం, ఏకదంతం, తోరపు బొజ్జ!

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అందరినీ అలరించే ఆకారం.

అందుకేనేమో అందరికన్నా ఎక్కువ కార్టూన్లు అయ్యవారి మీదే వస్తాయి.

గణపతి బొమ్మ అంటేనే వినోదం.

కొంచెం జాగ్రత్తగా చూడండి.

ఆ విగ్రహంలో విజ్ఞానం కనిపిస్తుంది.

ఇంకాస్త పరికించి చూస్తే వివేకం కనిపిస్తుంది.

ఆయన కళ్లు చిన్నగా ఉంటాయి.

చెవులు చాలా పెద్దగా ఉంటాయి.

నోరు అసలెక్కడుందో కనిపించదు.

బాన పొట్ట.

ఒక చేయి అభయమిస్తుంది.

ఇంకో చేయి ఆయుధం పట్టింది.

మరో చేతిలో ఉండ్రాళ్లు

నాలుగో చేతిలో పాశం.

చిన్నకళ్లు నిశిత పరిశీలనకీ, కుశాగ్రబుద్ధికి చిహ్నాలు. అవి అన్నీ పరిశీలించి, ఆకళింపు చేసుకుని, అధ్యయనం చేసి, విశ్లేషణ చేయమని చెబుతున్నాయి.

పెద్ద చెవులు అన్నీ వినమంటున్నాయి. అందరి వాదనల్నీ వినాలి. అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలి. అందుకు ఓపిక కావాలి. వినదగునెవ్వరు చెప్పిన అన్నట్టుండాలని చెవులు చెబుతున్నాయి.

నోరు అస్సలు కనిపించడం లేదు. ఎందుకు?

విను.... చూడు ..... కానీ అనవసరంగా మాట్లాడకు. మాటలను ఆచితూచి ఉపయోగించు. మాట తూటా లాంటిది. వదిలామా వెనక్కి తీసుకోలేము. అందుకే మితభాషణం భూషణమే కాదు. ఆయుధం కూడా అని అగుపించని నోరు చెబుతుంది.

తొండం ఏం చెబుతోంది? దూరంగా ఉన్న వాటిని కూడా తొండం సంగ్రహించగలదు. అన్ని విషయాలనూ దరిచేర్చుకొమ్మని చెబుతోంది తొండం.

బానబొజ్జ విన్నవన్నీ కడుపులోనే దాచుకొమ్మంటుంది. చేట చెవులతో విన్నది బానబొజ్జలో దాచుకో.

అంతేకానీ, వదరుబోతులా మాటలు అటూ ఇటూ వదిలేసి రహస్యాలను రట్టు చేయకు అంటోంది గణపతి బొజ్జ.

చేతిలోని ఆయుధం కర్తవ్య నిర్వహణ చేయనివారి పట్ల కరకుదనాన్ని, అభయహస్తం కర్తవ్యనిష్ఠులకు రక్షణను ఇస్తున్నాయి. ఏకదంతం పనిచేయని వారిని భయపెడుతుంది. విరిగిన దంతం దుష్టులను ఎలా చీల్చి చెండాడగలదో చెబుతుంది.

అయితే..అవి కినిపించే దంతాలే. అసలు దంతాలు కనిపించవు. నిజానికి నాయకుడు అలాగే ఉండాలి. ఆయన్ని చూస్తే భయం, అభయం రెండూ కలగాలి. చెడ్డవారికి భయం, మంచివారికి అభయం కలగాలి. పనిచేసే వారికి గణపతిచేతిలోని ఉండ్రాళ్లే బహుమతులు.

ఆధునిక నేత అన్నీ పరిశీలించాలి. అన్నీ గమనించాలి. అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలి. ఓపికగా వ్యవహరించాలి. తొందరపాటు కూడదు. మాటలు జారకూడదు. విన్న విషయాలను తనలోనే దాచుకోవాలి. తనతో పాటు పనిచేసేవారికి అభయం ఇవ్వగలగాలి. వారిని కాపాడాలి. పనిచేయనివారిని దండించగలగాలి. దండించి దారిలోకి తేగలగాలి. తానంటే భయమూ భక్తీ ఉండేలా వ్యవహరించాలి. అలాంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలి. బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకాలిచ్చి ఉత్సాహపరచాలి.

ఏ మేనేజిమెంటు నిపుణుడైనా, ఏ ఎంబీఏ కోర్సు అయినా చెబుతోంది ఇదే. ఇవే నాయకత్వ లక్షణాలు. మహానేత నుంచి ముఠామేస్త్రీ దాకా, పాఠశాల పంతులు నుంచి కార్పొరేట్ బాసు దాకా ప్రతి వ్యక్తికీ ఇవే కావాలి.

నాయకుడు బలవంతుడైనా, అతని దగ్గర అధికారపు దంతాలు, ఆయుధాలు ఉన్నా అందరితోనూ స్నేహంగా ఉండాలి. అదే ప్లీజింగ్ పర్సనాలిటీ. గణపతిని చూస్తే అలాంటి భావమే కలుగుతుంది.

అందుకే ఆయన బాలల దేవుడయ్యాడు.

నాయకుడూ అలాగే ఉండాలి.

అంతటి భారీకాయుడు గణాలకు నాథుడు అయినా అతిసాధారణమైన ఎలుకను వాహనంగా ఎంచుకున్నాడు. సదుపాయానికి తప్ప సౌఖ్యానికి ప్రాముఖ్యం ఇవ్వలేదు. ఎడ్జస్ట్ మెంట్, ఎకామిడేషన్ లకే పెద్దపీట వేశాడు. పత్రి, గరిక, జిల్లేడు ... ఏం పెట్టినా ఆనందంగా స్వీకరించాడు.

అందుకే అందరూ ఆయన్ని "గణపతి బప్పా మోరియా" అని వీడ్కోలు చెబుతూనే "అగలే బరస్ తూ జల్డీ ఆ" అంటూ త్వరగా రమ్మని మనసారా కోరుకుంటారు.

ఏ నాయకుడైనా ఇంతకన్నా కోరుకునేది ఏముంది? అందుకే ఆ తరం నుంచి ఆధునిక తరం దాకా అందరికీ ఆయనే స్ఫూర్తి.

అందుకే గొంతెత్తి అందాం "జై బోలో గణేశ్ మహరాజ్ కీ"


3 comments:

  1. వివరణ చాలాబాగుంది సార్...

    ReplyDelete
  2. mee lokam raka gurinchi yeppudu waitinge. Adem maayo.

    ReplyDelete
  3. mee visleshana abhinandaneeyam sir...

    ReplyDelete

Pages