"నాన్నా... పందులే గుంపులుగా వస్తాయి.... సింహం... సింగిల్ గా వస్తుంది...."
"నా దారి రహదారి ...."
"దేవుడు శాసిస్తాడు ... అరుణాచలం పాటిస్తాడు"
"బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే."
"గతం గతం"
"బాబా కౌంటింగ్ స్టార్ట్స్ ... వన్ ....టూ...త్రీ ...."
యస్.... ఇవన్నీ సూపర్ స్టార్ రజనీ పంచ్ డైలాగులు. బాక్సాఫీసు బద్దలుగొట్టే భలే డైలాగులవి. ఎన్నో సార్లు విన్నాం... వింటూనే ఉన్నాం.... రజనీ సూపర్ స్టయిల్... యమా క్రేజీ డైలాగ్ డెలివరీ... పదేళ్ల బుజ్జాయి నుంచి పచాస్ సాల్ బాబుగారి దాకా అందరికీ కంఠోపాఠమే.
కానీ పంచ్ డైలాగుల ప్రపంచంపై సీరియస్ రీసెర్చి నడుస్తోందా? ఈ వేడివేడి డైలాగులు వేద రహస్యాలా? రజనీ మార్కు సిగ్నేచర్ స్టేట్ మెంట్ల సీక్రెట్లేమిటి? రజనీకాంత్ డైలాగుల్లో రహస్య సంకేతాలున్నాయా? గుప్త భాషలో గుర్తుతెలియని ఫార్ములాలు ఉన్నాయా? పాపులర్ డైలాగుల్లో ఏవైనా సందేశాలున్నాయా?
"ఉన్నాయి బాబూ ఉన్నాయి" అని గంట మోగించి మరీ చెప్పేస్తున్నారు పి.సి. బాలసుబ్రమణ్యం, రాజా కృష్ణమూర్తి.
చంద్రముఖిలో కనిపించే రహస్యమయ వ్యక్తుల్లా ఈ కొత్త పాత్రలెవరు?
సుబ్బు ఒక చార్టర్డ్ ఎకౌంటెంట్. దేశంలోనే పేరొందిన వెరిఫికేషన్ కంపెనీ మాట్రిక్స్ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక డైరెక్టరు. క్రిష్ పేరొందిన హెచ్ ఆర్ కన్సల్టెట్. టాలెంట్ మాగ్జిమస్ సంస్థ డైరెక్టరు.
వీళ్లిద్దరూ రజనీ పంచ్ డైలాగుల్లో వ్యక్తిత్వ వికాస, వాణిజ్య వికాస పంచతంత్రం దాగుందని అంటున్నారు. రజనీ చెప్పిన పంచ్ డైలాగులలో మేనేజ్ మెంట్ సూత్రాలున్నాయంటున్నారు. లీడర్ షిప్, మోటివేషన్, కమిట్మెంట్, దూరదృష్టి, సామాజిక బాధ్యత, విలువలు, టైమ్ లైన్లు, క్వాలిటీ వంటి ఎన్నెన్నో మేనేజ్ మెంట్ అంశాలు ఈ డైలాగుల్లో ఉన్నాయంటున్నారు. ఈ మేనేజ్ మెంట్ మాస్టార్లు రజనీ డైలాగులు లఘువులే అయినా అవి పాఠాలు చెప్పే గురువులని వాదిస్తున్నారు. అసలీ సిగ్నేచర్ స్టేట్ మెంట్లన్నీ నిజానికి వేల్యూ స్టేట్ మెంట్లు అని సూత్రీకరించేశారు. ఇలాంటి ఒక 30 పంచ్ డైలాగులతో "రజనీస్ పంచ్ తంత్ర" అనే ఒక పుస్తకమే రాసేశారు. దీనికి అశోక్ లీల్యాండ్ సంస్థ ఎండీ ఆర్. శేషసాయి ముందుమాట రాశారు.
ఉదాహరణకి గతం గతం నుంచి అయిందేదో అయిపోయింది. ఇక ముందుకి నడు అన్న మేనేజ్ మెంట్ సూత్రం ఉందట. మంచైనా, చెడైనా దాన్నే పట్టుకుని కూచోవడం కాదు. పాస్ట్ టెన్స్ కాదు ...ఫ్యూచర్ కోసం ప్రజెంట్ టెన్స్ లో ఉండమంటుందిట ఈ డైలాగు. అలాగే ఒక పని చేపట్టాక సోమరితనం ఉండకూడదు. నిర్దిష్ట సమయలక్ష్యాలను నిర్ణయించుకుని ముందుకు పొమ్మన్న సందేశం "బాబా కౌంటిగ్ స్టార్ట్స్ వన్... టూ... త్రీ" లో ఉందట. ప్రతి వ్యక్తి జీవితంలో తనదైన ముద్ర వేయాలని, తనదైన బాటను ఏర్పరచుకోవాలని " నా దారి .... రహదారి..." డైలాగు చెబుతుందట. లీడర్ అనేవా డి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ప్రభావవంతంగా ఉండాలంటే ఒక్క సారి చెబితే వందసార్లు చెప్పినట్టే ఉండాలట. వాణిజ్యంలో కానీ, వ్యక్తిత్వంలో కానీ మందలో మందేశ్వర్రావులా కాక, సింహంలా సింగిల్ గా రావాలని రజనీ డైలాగ్ చెబుతుందట.
పడటం మామూలే. పడి లేవడం గొప్ప. ఏనుగు పడితే లేవడం కష్టం. అదే గుర్రం చటుక్కున లేస్తుంది. "నేను ఏనుగును కాదు. గుర్రాన్ని. పడిన వెంటనే మళ్లీ లేస్తాను" అని రజనీ చంద్రముఖి సక్సెస్ ఫంక్షన్లో అన్నాడు. బాబా ఫెయిల్యూర్ తరువాత వచ్చిన చంద్రముఖి సక్సెస్ నేపథ్యంలో ఆయన అన్న మాటలు అప్పట్లో చాలా పాపులరయ్యాయి. తప్పులనుంచి నేర్చుకోవడం, నేలకేసి కొట్టిన బంతిలా లేచి నిలబడటం వంటి వ్యక్తిత్వ వికాసాలు నేర్పే మంత్రం లాంటిది ఈ డైలాగ్ అంటారు సుబ్బు అండ్ క్రిష్.
అసలు రజనీకాంతే ఒక పాఠం. నల్లోడు. బస్ కండక్టర్. పేద కుటుంబం. పెద్ద స్పెషాలిటీలేమీ లేవు. కర్నాటకకు చెందిన ఈ మహారాష్ట్రియన్ తమిళనాట సూపర్ స్టార్ కావడం ఓ అద్భుతం. పందుల గుంపులా మొదలైన కేరీర్ ను సింగిల్ సింహంగా నా దారి రహదారి అన్నరీతిలో నడిపించి ఒక్క హిట్టిస్తే వంద హిట్లిచ్చినంత రికార్డులు సృష్టించడమే కాక, ఆధ్యాత్మికంగా ఎత్తులు ఎదిగి దేవుడు శాసిస్తాడు, రజనీకాంత్ పాటిస్తాడు అన్నట్టు జీవించడం, బాబా ఫెయిల్యూరు తరువాత బయ్యర్లకు డబ్బులు తిరిగి ఇచ్చేసి "గతం..గతం..." అనుకోవడం రజనీ ఇమేజ్ ను మరింత పెంచాయి.
సరదా రీడింగ్ లో సక్సెస్ సూత్రాలు, సాఫల్య సత్యాలు రాసేశారు. ధ్రువీకృత సూత్రాలకు సరదా డైలాగులు జోడించి, నూటపాతిక రూపాయల రీడబుల్ బుక్ గా మార్చేశారు సుబ్బు అండ్ క్రిష్. అలనాడు పంచతంత్రంలో విష్ణుశర్మ పాఠాలంటే భయపడే రాచబిడ్డలకు కథల రూపంలో సామర్థ్యాలను, నైపుణ్యాలను నేర్పించినట్టు, పంచ్ డైలాగుల్లో మేనేజ్ మెంట్ పాఠాలు చెప్పారు వీళ్లిద్దరూ.
"బాబోయ్... నాలో ఇంతుందా? నాకు ఇంత దృశ్యం ఉందా" అని ఆశ్చర్యపోయిన రజనీకాంత్ నాలుగంటే నాలుగు లైన్ల రెస్పాన్స్ పంపించారు. అది కూడా పుస్తకం ఫస్టుపేజీలో ఉంది.
బుక్కు పేరు - రజనీస్ పంచ్ తంత్ర, ప్రచురణ - ఆక్సిజెన్ బుక్స్, చెన్నై
No comments:
Post a Comment