అల్తాఫ్ వంటి వీరుల కథ మీడియా రాయదెందుకు? - Raka Lokam

అల్తాఫ్ వంటి వీరుల కథ మీడియా రాయదెందుకు?

Share This

అల్తాఫ్ అహ్మద్ దార్ పేరు బుర్హాన్ వానీ పేరులా నలుదిక్కులా మార్మోగదు. ఆయన పేరిట రీములకు రీములు పత్రికలు వ్రాయవు. ఎందుకంటే వేర్పాటువాదాన్ని పాలు పోసి పెంచే కశ్మీరీ పత్రికా రంగానికి, దానిని మోస్తున్న ఢిల్లీలోని కొంతమంది కిరాయి మీడియా జర్నలిస్టులకు అల్తాఫ్ అహ్మద్ దార్ పేరు మిగతా దేశానికి తెలియడం ఇష్టం లేదు.
కానీ అల్తాఫ్ పేరు వినగానే కశ్మీర్ ఉగ్రవాదులకు, పాక్ టెర్రరిస్టులకు హడల్. ఎందుకంటే వారి దృష్టిలో ఆయన 24 గంటలూ పనిచేసే పోలీసు. ఉగ్రవాద నెట్ వర్క్ లను కూకటివేళ్లతో పెళ్లగించే వ్యక్తి. తమ రహస్య స్థావరాలను, తమ రహస్య టెలిఫోన్ సంభాషణలను పట్టేసి తమ గుట్టు మట్లు కనిపెట్టే వ్యక్తి. ఆయనను ఉగ్రవాదులు లాప్ టాప్ పోలీసు అనేవారు.
1989 నుంచి కశ్మీర్ లోయను అతలాకుతలం చేస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను 2006-7 నాటికి దాదాపుగా ఒంటిచేత్తో ధ్వంసం చేశాడు. పోలీసుగా పనిచేస్తూనే ఉగ్రవాదులతో చేతులు కలిపిన అబ్దుల్ రషీద్ షిగన్ ను, హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్లు కాజీ మిస్బావుద్దీన్, ముజఫర్ దార్, హనీఫ్ ఖాన్ ను హతమార్చాడు. పదేళ్లలో వంద మంది ఉగ్రవాదులను హతమార్చడమే కాక, మరో వందమందిని అరెస్టు చేయడంతో కశ్మీర్ లోయలో ఉగ్రవాదం వెన్ను విరిగింది.
ఉగ్రవాదుల సంభాషణలను వినేందుకు, వారి కదలికలను విశ్లేషించేందుకు ఆయన అప్పు చేసి ఒక లాప్ టాప్ ను కొనుక్కుని, పనిచేశారు. ఆయన కృషిని గుర్తించిన ప్రభుత్వం చివరికి ఒక టెక్నికల్ సర్వేలెన్స్ విభాగాన్నే ఏర్పాటు చేసింది.
ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఆయన అనుభవం ఎంత లోతైనదంటే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) సీనియర్ అధికారులు కౌంటర్ టెర్రరిజంలో శిక్షణ పొందేందుకు ఆయన వద్దకు వచ్చేవారు.
2009 లో అల్తాఫ్ దార్ ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నంలో కశ్మీర్ లోయలోని బాందీపూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయారు.


దురదృష్టం ఏమిటంటే దార్ గురించి కశ్మీరులోని వేర్పాటు వాద పత్రికలు వ్రాయలేదు. అంతకన్నా దురదృష్టం ఏమిటంటే మిగతా దేశానికి ఆయనెవరో పట్టించుకునే ఓపికా తీరికా లేవు.
జావేద్ అహ్మద్ విచ్ఛిన్నవాదానికి ఆయువుపట్టైన షోపియాన్ లో ఇన్స్ పెక్టర్. 2012 లో షోపియాన్ కాలేజీలో ఒక ఉగ్రవాది ఉన్నట్టు సమాచారం వచ్చింది. జావేద్ మరో ఇద్దరు కానిస్టేబుల్స్ తో కాలేజీకి వెళ్లాడు. జావేద్ ను చూడగానే ఉగ్రవాది గ్రెనేడ్ తీసి వివరబోయాడు. జావేద్ ఒక్క ఉదుటున అతని అదిమిపట్టుకున్నాడు. ఒక చేత్తో గ్రెనేడ్ పిన్ తీయకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఒక కానిస్టేబుల్ భయంతో పారిపోయాడు. మరొకడు కొయ్యబారిపోయాడు. జావేద్ మాత్రం పట్టు విడవ లేదు. అయిదు నిమిషాల పాటు ఈ పెనుగులాట కొనసాగలేదు. ఉగ్రవాది గ్రెనేడ్ పిన్ను లాగడానికి విశ్వప్రయత్నం చేశాడు. కానీ జావేద్ ఉడుం పట్టు ముందు అతని ఆటలు సాగలేదు. చివరికి అయిదు నిమిషాల తరువాత గరెనేడ్ పిన్ను తీయకుండానే వదిలేశాడు ఉగ్రవాది. జావేద్ ఉగ్రవాదిని అరెస్టు చేశాడు. ఇలాంటి అనేక సంఘటనలు కశ్మీర్ లోజరుగుతున్నాయి.

ఎస్ పి ఇంతియాజ్ హుస్సేన్, ఎస్ పి మహమ్మద్ ఇర్షాద్, అఫాదుల్ ముజ్తబా, అసిస్టెంట్ ఐజీ ఆషిక్ బుఖారీ ఇలా కశ్మీర్ లో అనేకమంది పోలీసులు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడుతున్నారు. కశ్మీర్ హిందూ ముస్లిం ఇష్యూగా చూపించేందుకు వేర్పాటువాదులు, హురియత్ వంటి సంస్థలు విశ్వప్రయత్నాలు చేస్తున్నా, పోలీసులు మాత్రం ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు పోరాడుతూనే ఉన్నారు.

దురదృష్టం ఏమిటంటే వేర్పాటువాదులకన్నా ప్రమాదకరమైన దురుద్దేశపూరిత మీడియా చాలా తెలివిగా ఈ విషయాన్ని దాచేస్తోంది. భద్రతాదళాలు అన్న పదాన్ని వాడటం ద్వారా ప్రజలకు ఉగ్రవాద వ్యతిరేక దాడి చేసింది కశ్మీర్ పోలీసులా, బిఎస్ ఎఫ్ సైనికులా లేక సైన్యానికి చెందినవాడా అన్నది ప్రజలకు తెలియకుండా చేస్తోంది. గత పదేళ్లలో జావేద్ పాతికకు పైగా ఉగ్రవాదులను పట్టుకున్నాడు.

1 comment:

Pages