మృత్యువు కళ్ల ముందుంటే.... - Raka Lokam

మృత్యువు కళ్ల ముందుంటే....

Share This



యుద్ధనౌక రెండు ముక్కలైంది. టార్పిడో దెబ్బకి యుద్ధనౌకలో నిప్పుల కుంభవృష్టి కురుస్తోంది....
సముద్రం భయంకరంగా పడగ విప్పింది.
యుద్ద నౌక తాలూకు ఒక పెద్ద భాగం సముద్రంలోకి జారిపోయింది.
అలలు ఉవ్వెత్తున లేచాయి.
నిప్పు పగబట్టింది. నీరు నోరు తెరిచింది.
యుద్ధ నౌక రెండో భాగమూ నెమ్మదిగా నీటిలోకి మునగడం మొదలైంది.
కాదు కాదు... మృత్యువు ఒడిలోకి జారడం మొదలైంది.
ఈ భీతావహ సన్నివేశంలో యుద్ధనౌక కాప్టెన్ తన కుర్చీలో కూర్చున్నాడు.... నిశ్చలంగా... నిర్భయంగా...
యుద్ధ నౌక ఒక్కొక్క క్షణానికీ నీటి ఒడిలోకి వెళ్లిపోతోంది.
చీకటి మృత్యువస్త్రం కప్పుతోంది.
కానీ కాప్టెన్ కళ్లలో భయం లేదు.
అలాగే పడవతో పాటూ మునిగిపోతూ ఒక సిగరెట్ వెలిగించాడు.
మృత్యువుతో ముఖాముఖీ అవుతున్న వేళ మామూలు మనుషులకు ముచ్చెమటలు పడతాయి. భయంతో పరుగులు తీస్తారు. కానీ ఆ కాప్టెన్ పడవ తోటే నెమ్మదినెమ్మదిగా నీటిలో కలిసిపోయాడు.
ఛాతీ ఎదురొడ్డి మరీ చావును ఆహ్వానించిన ఆ కాప్టెన్ పేరు మహేంద్రనాథ్ మల్లా.


అది 1971 భారత పాకిస్తాన్ యుద్ధం. ఆ రోజు డిసెంబర్ 9. సమయం రాత్రి 8.50. పశ్చిమ సాగర తీరంలో డయ్యూకి 64 కిమీ దూరంలో పాకిస్తాన్ టార్పిడో తగలడంతో యుద్ధనౌక ఐ ఎన్ ఎస్ ఖుక్రీ ధ్వంసం అయింది. యుద్దనౌకలో మంటలు ఎగిశాయి. కాప్టెన్ మహేంద్రనాథ్ మల్లా ఆ యుద్ధనౌకకి నాయకుడు. అందుకే వీలైనంత మందిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఆయన ప్రయత్నాల వల్ల 6గురు అధికారులు, 61 మంది నావికులు సురక్షితంగా తప్పించుకోగలిగారు. కానీ మరో 18 మంది అధికారులు, 178 మంది పడవలోనే చిక్కుబడిపోయారు.
ఒక నావికుడు కాప్టెన్ మల్లాకి లైఫ్ జాకెట్ ఇవ్వబోయాడు.
"నా గురించి ఆలోచించకు. నిన్ను నువ్వు కాపాడుకో..." అని మల్లా లైఫ్ జాకెట్ తిరిగి ఇచ్చేశాడు.
నౌకాదళ సంప్రదాయం ప్రకారం కాప్టెన్, యుద్ధనౌక వేర్వేరు కారు. చెక్క, స్టీల్ తో చేసిన పడవ, రక్తమాంసాల మనిషీ మధ్య అద్వైత స్థితి ఉంటుంది. అందుకే కాప్టెన మల్లా ప్రాణాలు దక్కించుకునే పరిస్థితి ఉన్నా తన పడవతో, పడవలో చిక్కుకున్న వారితో కలిసి జలసమాధి అయ్యాడు. నిజమైననాయకుడిగా నిలిచాడు.
1971 యుద్ధంలో భారత్ కోల్పోయిన ఏకైక యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఖుక్రీ.
మల్లా చూపిన అసమాన ధైర్యానికి యుద్ధానంతరం భారతప్రభుత్వం మహావీరచక్రను ప్రకటించింది. మరో వీరుడు కాప్టెన్ ఆర్ ఆర్ సూద్ కి వీర చక్రను ఇచ్చింది. నేటికీ డయ్యూలో ఒక ఎత్తైన కొండ మీద ఐఎన్ ఎస్ ఖుక్రీ ప్రతిమను, దానిపై వీరమరణాన్ని స్వాగతిస్తూ కూర్చున్న కాప్టెన్ మల్లా విగ్రహాన్ని ప్రతిష్టించి ఉంచారు. కొలాబాలోని నేవీ నగర్ లో కాప్టెన్ ఎం ఎన్ మల్లా ఆడిటోరియం ఉంది. దానిలో మల్లా విగ్రహం ఉంది.
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్లో పుట్టిన మల్లా డయ్యూ వద్ద భారతమాత కోసం ప్రాణాలర్పించాడు.
ఆయన నిజమైన హీరో!!

4 comments:

  1. welcome back sir!! I have been waiting for your posts since last NOV. Happy that after one year again you gave a very nice post. thanq sir

    ReplyDelete
  2. heart touching
    hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/garamchai

    ReplyDelete

Pages