గూగుల్ తల్లికి తెలియని గుడి - Raka Lokam
demo-image

గూగుల్ తల్లికి తెలియని గుడి

Share This



భువనగిరి రోడ్డులో రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు కరచాలనం చేసుకునే చోట ఉన్న కొండమడుగు నుంచి ఉత్తరం దిశగా మహదేవపూర్ గతుకుల రోడ్డులో రాబోయే రోజుల్లో కట్టబోయే రిసార్టుల పైన పటారపు సింహద్వారాలను చూసుకుంటూ ఆరేడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆ గుడికి వెళ్లే దారిని చెప్పే బోర్డు కనిపించింది.

మరి కాసింత ప్రయాణించే సరికి సూర్యుడు ఆఫీసు మూసేసుకున్నాడు. సాయంకాలం రాత్రితో సమాగమం కోసం చీకటి దుప్పట్లో దూరేస్తోంది.
సరిగ్గా అదిగో అదే సమయంలో ఆ రెండు దేవాలయాలూ కనిపించాయి. చాలా పెద్ద దేవాలయాలవి.

పాత రాతి స్తంభాలు, పెద్ద పెద్ద రాతి దూలాలు.... ఆ గుడుల పాతదనానికి సర్టిఫికేట్ ఇస్తున్నాయి.

కాకతీయుల శైలి కాదిది.

చాళుక్యుల శైలి కూడా కాదు.

కానీ గుడులు కనీసం నాలుగు వందల ఏళ్ల ఎండ, వానల సంతకాలు వీపున మోస్తున్నట్టున్నాయి. వాటికి ఏజ్ సర్టిఫికేట్ ఇస్తున్నట్టు పక్కనే ఊడలు పాతుకున్న పాత మర్రి చెట్టు సాక్ష్యంగా నిలుచుంది.

ఆ పాత రాతి స్తంభాలు, ఆ చీకటి, ఆ ఊడల మర్రిని చూసే సరికి ఒక నిమిషం గుండెల్లో ఎక్కడో కాసింత జడుపు పుట్టింది. మరుక్షణం గర్భగుడిలో దేదీప్యమానంగా వెలుగుతున్న వేణుగోపాల స్వామి విగ్రహం అభయం ఇచ్చింది.

10526142_10203425513943837_5046500819293968046_n


"మీరెంతో అదృష్టవంతులు. ఆ దేవుడే మిమ్మల్నిక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చారంటే మీకేదో మంచి జరగబోతోంది" అన్నారు పూజారి గారు. ఆయన పూజారి కాదు. ఆయన పరవళ్లు తొక్కుతున్న పాజిటివ్ నెస్. ఆయన మాటలతో ఎక్కడలేని శక్తి వచ్చేసింది.

"ఇది అక్కన్న మాదన్నలు పునరుద్ధరించిన గుడి. గోల్కొండ నుంచి భువనగిరి కోటకు జమాబందీ పనుల నిమిత్తం వెళ్లి తిరిగి వస్తూ వారిక్కడ కాసేపు విశ్రమించారు. ఆ మధ్యాహ్నం వచ్చిన కలలో శివుడు, వేణుగోపాలుడు కలిసి కనిపించి, ఇక్కడి గుట్టకింద మేమున్నామని చెప్పారు. అన్నదమ్ములిద్దరూ అక్కడ తవ్వించారు. విగ్రహాలు బయటపడ్డాయి. వారి ఆజ్ఞతోనే ఇక్కడ ఈ విశాలమైన దేవాలయాలు నిర్మితమయ్యాయి." అని చెప్పారు పూజారి గారు.

వేణుగోపాలుడి గుడికి, పక్కనేఉన్న శివుడి గుడికి అక్కన్న మాదన్నలు పూజలు, పునస్కారాలకు, ధూపదీపనైవేద్యాలకు ఏర్పాట్లు చేశారు.
కుతుబ్ షాహీల యుగం హైదరాబాద్ కి స్వర్ణయుగం. రాజు ముస్లిం. ఆయన మంత్రులు హిందువులు. అక్కన్న మాదన్నల చాణక్యం, చాకచక్యం, చాతుర్యాల వల్ల రాజ్యం సుభిక్షంగా ఉండేది. అక్కన్న మాదన్నలు మరాఠాలతో కుతుబ్ షాహీలకు దోస్తీ చేయించారు. అక్కన్న, మాదన్నలు గ్రామగ్రామాన హిందువులను కరణాలుగా నియమించారు. వీలైనన్ని చోట్ల విశాల దేవాలయాలు కట్టించారు. వాటిని మణులు, మాన్యాలు ఇచ్చారు. తమ పూజలకు ఆటంకం లేనందుకు హిందువులకూ ఆనందం, గొడవలు లేనందుకు ముస్లింలకూ ఆనందం. ముస్లిం కుతుబ్ షాహీలు హిందూ దేవాలయాలకు మాన్యాలిచ్చారు. హిందువులు కుతుబ్ షాహీల మొహర్రంను తమ పండుగ చేసేసుకున్నారు. తమ పిల్లలకు సయ్యద్ మీద సైదులు, హసన్ మీద ఆశన్న, హుసేన్ మీద ఊశన్న, జాన్ పహాద్ దర్గా మీద జానయ్య, జానా రెడ్డి వంటి పేర్లు పెట్టుకున్నారు.

రాజు గారైన మాలిక్ ఇబ్రహీంను హిందువులు మల్కి భరాం అనే పేరు మార్చేశారు. అయోధ్యలో రాముడెంతవాడో ఇక్కడ ఇభరాముడు (ఇబ్రాహీం) అంతటి వాడన్నారు.

"ఆకుంటే వృక్షంబగు
ఈకుంటే లోభియౌను హీనాత్ముండౌ
మీకుంటే మాకీయుడు
మాకుంటే మేము రాము మల్కిభరామా!"


అని దబాయించి మరీ దక్షిణలు పుచ్చుకున్నారు. ఆయన బందరు వెళ్తూ వెళ్తే రాత్రి కూచిపూడిలో బసచేస్తే రాత్రి కూచిపూడి నృత్య కళాకారుల లయబద్ధ మణికింకిణీ నిస్వనాలు విని, వారి నాట్యాలు చూసి, మురిసిపోయి గ్రామాలకు గ్రామాలు దానంగా ఇచ్చాడు. ఆయన పుణ్యంగానే కూచిపూడిలో నాట్య కళ ఇప్పటికీ బతికుంది. ప్రాపకం ముస్లిం రాజుది. ప్రాభవం హైందవానిది.

a-horz

(ఇది అక్కన్న మాదన్నల చిత్రం)


హిందువులు ముస్లింలు ఎంతగా ఒక్కటైపోయారంటే ముస్లింల హుస్సేన్, హిందువుల సాగరం కలిసి హుసేన్ సాగర్ అయింది. తెలుగువారి గొల్ల, ఉర్దూలో కిటికీ కలిసి గొల్ల ఖిడికీ (పాతబస్తీలో ఒక ప్రదేశ నామం ఇది) అయింది. ఇస్లామిక్ ఇబ్రహీం తెలుగు పట్నంతో పెనవేసుకుపోయి ఇబ్రహీంపట్నం అయింది. హిందువులు, ముస్లింలు ఒక్కటైపోతే మతోన్మాద ఔరంగజేబ్ కి నిద్ర పడుతుందా? ఆయన ఢిల్లీనుంచి దండెత్తాడు. గోల్కొండ కోటను ముట్టడించాడు. కొండపల్లి కోటకో, భువనగిరి కోటకో వెళ్లి తలదాచుకొమ్మని అక్కన్న మాదన్నలిచ్చిన సలహాని రాజు అబూ హసన్ తానీషా ఎందుకో గాని పట్టించుకోలేదు. చివరికి ఔరంగజేబ్ గెలిచాడు. తానీషా బందీ అయ్యాడు. అక్కన్న మాదన్నను ఆయన ముస్లిం అంగరక్షకులే ఔరంగజేబుకి అమ్ముడుపోయి, కిరాతకంగా చంపి, తలలను తెగేశారు. ఆ తలలను పళ్లెంలో పెట్టి గుజరాత్ లోని అహ్మదాబాద్ లో యుద్ధంలో ఉన్న షాజహాన్ కి పంపించారు. ఆ తాలిబాన్ల తాతయ్య, ఐఎస్ ఐఎస్ ఆదిపురుషుడు పిల్లాడో పిచ్చాడో తెలియదు కానీ ఏనుగులతో ఆ తలలను తొక్కించి మరీ ఆనందపడిపోయాడు.

ఆ తరువాత గుడులు నెమ్మదిగా నిర్లక్ష్యమైపోయాయి. పట్టించుకునేవారు లేరు. చరిత్ర చెప్పే వారు లేరు. అక్కన్న మాదన్నలు కట్టించిన గుడులు అన్న పేరు మాత్రం అలాగే కొనసాగింది. రాయరావు పేట అనే ఆ ఊళ్లో ఈ గుడే అసలు ఆకర్షణ.

తమాషా ఏమిటంటే ఈ గుడుల గురించి ఎక్కడా ఏమీ వ్రాయలేదు. గుడి, గుడి చరిత్ర, దాని జాతరలు, ప్రశస్తి గురించి చెప్పేవారు లేరు. హైదరాబాద్ కి 35 కిమీ దూరం మాత్రమే ఉన్న ఈ గుడుల ఫోటోలు కూడా లేవు. అన్ని సంగతులు చెప్పే గూగుల్ తల్లికి కూడా ఈ గుడి గురించి తెలియదు.

గూగుల్ తల్లికి సైతం తెలియని ఈ గుడి గురించి తెలిసిన వారెవరైనా ఉంటే దయచేసి చెప్పరూ!

10686651_10203289163575163_4629523497703447132_n
Comment Using!!

5 comments:

  1. blogger_logo_round_35

    Marinni photographs post chesi unte bagundedi. Chala vishayala meeda clarity vachindi.

    ReplyDelete
  2. venky+logo

    ఇంత చక్కగా చరిత్రను... బాహ్య ప్రపంచానికి తెలియని ఆలయ విశేషాలను వివరించిన మీకు సర్వదా కృతజ్ఞతలు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఆలయం గురించి గూగుల్్కి తెలియకపోవడం కించిత్్ ఆశ్చర్యం కలిగిస్తోంది. మన సంస్కృతిని చాటి చెప్పే ఇలాంటి చారిత్రక సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

    ReplyDelete
  3. blogger_logo_round_35

    Fantastic , thank you for this

    ReplyDelete
  4. blogger_logo_round_35

    Namaskaram
    Chala bags chepparu EE gudi gurchi
    Dhanyavadamulu

    ReplyDelete
  5. blogger_logo_round_35

    Namaskaram
    Chala bags chepparu EE gudi gurchi
    Dhanyavadamulu

    ReplyDelete

Pages