ఇంటావిడ వంటింట్లో ఓ ఎలుకల బోను పెట్టింది.
ఎలుక గుండె ఠారెత్తిపోయింది. ఇక తనపని అయిపోయినట్టే అనుకుంది. భయంతో పరుగెత్తింది పావురం దగ్గరకి.
"నాకేం భయం. నేను ఎలుకల బోనులో పడే ప్రశ్నే లేదు. నీ చావు నువ్వు చావు" వెటకారంగా అంది పావురం.
కోడి దగ్గరకి పరుగెత్తింది ఎలుక.
"నేను బోను దగ్గరికి వచ్చేదా, బోనులో పడేదా? నాకు దీంతో ఎలాంటి సంబంధమూ లేదు. అది నీ సమస్య" అంది కోడి తాపీగా.
"మేక బావా మేక బావా.... నాకేదైనా ఉపాయం చెప్పు"
మేక ఇకిలించింది. "ఇక నీ పని అయిపోయినట్టే" అంది వేళాకోళంగా.
పాపం ఎలుక బిక్కు బిక్కు మంటూ కలుగులోకి వచ్చేసింది. ఆకలి నకనకలాడినా, బోనులో ఆహారం కనిపించినా అడుగు ముందుకేయలేదు.
ఆ రాత్రి.... ఎలుక కోసం వచ్చిన ఓ పాము ఆ బోనులో చిక్కుకుంది. తల ఇరుక్కుపోయి దానికి మహాతిక్కగా ఉంది. తెల్లారే ఇంటావిడ పామును చూసి బయటకు తీసేయబోయింది. అప్పటికే తిక్క కోపంతో ఉన్న పాము ఆమెని కాటేసింది.
ఇంట్లో వాళ్లు ఆమెను వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన విషం విరుగుడు మంత్రం వేశాడు. "ఈ రాత్రికి కోడి మాంసం వండి పెట్టండి ఈమెకి" అని పథ్యం చెప్పాడు.
కోడి ఖతం.
ఆ తెల్లారి ఆమెను చూసేందుకు బంధువులు వచ్చారు.
ఫలహారానికి పావురం ఖతం.
మరింతమంది బంధువులు బిలబిలమంటూ బండి దిగారు.
భోజనానికి మేక ఖతం.
కన్నంలో దాగున్న ఎలుక తన మిత్రులు ఒక్కొక్కరుగా ఖతం కావడం చూసి కన్నీరు పెట్టుకుంది.
తోటివాడి కష్టాల్లో సాయపడకపోయినా, కాసింత సానుభూతి చూపించి ఉంటే ఈ మూడు జీవులూ బతికుండేవి కదా అనుకుంది. నాకోసం పెట్టిన బోను నన్నేమీ చేయలేదు. కానీ ఈ బోను మమ్మల్నేమీ చేయలేదు అనుకున్న వారంతా ఖతమైపోయారు కదా అని బాధపడింది.
నిజంగా మీరు చెప్పిన కథ లో నీతి చాలా ఉందండి, అసలు ఇది నీతి కథలా కాకుండా ఒక వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగ పడేదిగా ఉందండి
ReplyDeleteExcellent
ReplyDeletebagundi :)
ReplyDeleteSuperb
ReplyDelete