ఒక సూత్రం.... రెండు కథలు.... - Raka Lokam

ఒక సూత్రం.... రెండు కథలు....

Share This

కష్టాలుండవు....


శిష్యుడికి అన్నీ కష్టాలే....

తన కష్టాలు చెప్పుకుని గురువు గారి దగ్గర భోరుమన్నాడు.

గురువు గారు అతని చేతికి సగం నీటితో నిండిన ఓ గ్లాసునిచ్చాడు.

"దీని బరువెంత నాయనా?"

"ఓ ఇరవై ముఫ్పై గ్రాములుంటుందేమో గురూజీ!"

"దీన్ని చెయ్యి ఎత్తి పట్టుకుని నిలుచో నాయనా...." అన్నాడు.

శిష్యుడు గురువు చెప్పినట్టు చేశాడు.

అర గంట తరువాత గురువు వచ్చాడు.

"ఎలా ఉంది?"

"కొంచెం చెయ్యి నొప్పిగా ఉంది గురూజీ"

"మంచిది అలాగే ఉండు నాయనా."

ఓ నాలుగు గంటల తరువాత గురువు గారు మళ్లీ వచ్చారు.




"గురూజీ.... చెయ్యి లాగేస్తోంది. భుజం తిమ్మిరెక్కింది. వేళ్లు నొప్పులు పుడుతున్నాయి. నిలబడలేకపోతున్నాను. ఈ బాధ భరించలేకపోతున్నాను. ఈ గ్లాసు ఇక కింద పెట్టేస్తాను." అన్నాడు శిష్యుడు.

"అదేమిటి ... గ్లాసు బరువేమైనా పెరిగిందా? ముప్ఫై గ్రాములే కదా?"

"కానీ భరించలేకపోతున్నాను స్వామీ... ఇక నా వల్ల కాదు..." అంటూ శిష్యుడు గ్లాసును కిందకు దించేశాడు. "అమ్మయ్య" అనుకున్నాడు.

"నాయనా.... గ్లాసు బరువు పెరగలేదు. కానీ భారం మాత్రం పెరిగింది. మోసే కొద్దీ భారం పదింతలవుతూనే ఉంటుంది. కష్టాలు కూడా అంతే నాయనా. కష్టాలను మోస్తూ ఉంటే భారం పెరుగుతూనే ఉంటుంది. ముందు కాస్త నొప్పిగా ఉంటుంది. తరువాత భరించలేము. కష్టాలు పోవు. అవి అలాగే ఉంటాయి. కానీ వాటిని భుజాన మోస్తూ ఉంటే భారం పెరుగుతూనే పోతుంది. కాబట్టి బరువును దించేసుకోవడం తప్ప మరో మార్గం లేదు నాయనా."


పరిష్కారం ఉంటుంది....


"నాయనా.... నువ్వేమో జైలులో ఉన్నావు. నేనేమో ముసలివాడినైపోయాను. నువ్వుంటే పొలం దున్నే వాడివి. నేను దున్నలేకపోతున్నాను. ఈ సారి ఇక పంట వేయలేనేమో"

తండ్రి జైల్లో ఉన్న కొడుకుకి లేఖ వ్రాశాడు.

నాలుగైదు రోజులకు కొడుకు నుంచి ఉత్తరం వచ్చింది.

"నాన్నా... ఎట్టి పరిస్థితుల్లోనూ పొలం దున్నకు. పొలం లోనే నేను బంగారాన్ని, డబ్బుని పాతి పెట్టాను. పొలం దున్నితే దొంగ సొమ్ము బయటపడిపోతుంది."

ఆ లేఖ చేరిన కొన్ని గంటల్లోనే జైలు అధికారులు, పోలీసులు బిలబిలమంటూ ఇంటిపై దాడి చేశారు. ముసలి తండ్రిని పొలం ఎక్కడుందో చూపించమన్నారు.

గజగజ వణుకుతూ ముసలాయన తన పొలం చూపించాడు.

అంతే.... అధికారులు, పోలీసులు మొత్తం పొలాన్ని తవ్వేశారు.

బంగారం దొరకలేదు. చివరికి నిరాశతో పోలీసులు వెనక్కి వచ్చేశారు.

నాలుగు రోజుల తరువాత జైలు నుంచి కొడుకు వ్రాసిన ఇంకో లేఖ వచ్చింది.

"బాధపడకు నాన్నా... పొలం దున్నించేశాను. ఇక పంట వేసేసుకో."


1 comment:

Pages