అసలు ... నకిలీ..... - Raka Lokam

అసలు ... నకిలీ.....

Share This




బాటసారికి పక్కనే మురికి గుంటలో మిలమిల మెరుస్తున్న కెంపుల హారం కనిపించింది.

చెయ్యి మురికి నీళ్లలో పెట్టి దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు.

చేతికి దొరకలేదు.

ఆశ పెరిగింది. పట్టుదల ఇంకా పెరిగింది. మరింత లోపలికి చెయ్యి దూర్చి కెలికాడు. చేతికి బురద అంటుకుంది. కంపు కొడుతోంది. కానీ కెంపుల హారం దొరకలేదు.

కాస్సేపాగి మళ్లీ బురద నీళ్లలోకి తొంగి చూశాడు.

కెంపుల హారం కనిపించింది.

పైపైన కెలికితే లాభం లేదు. లోపలికి దిగాలి అనుకుని ఆ బురద నీటిలోకి దిగాడు. కాలు చెయ్యి బురద మయం అయిపోయాయి తప్ప కెంపుల హారం చేతికందలేదు.

కళ్లకు కనిపిస్తోంది. చేతులకు అందటం లేదు. దాంతో ఆ బురద నీటిలో నిండా మునిగాడు. పొర్లిపొర్లి మరీ వెతికాడు.హారం దొరకలేదు.

అంతలో అదే దారిలో సాధువు ఒకాయన పోతూ, బురద గుంటలో మనోడిని చూసి ఆగిపోయాడు.

"స్వామీజీ.... ఈ నీళ్లలో చూస్తే కెంపుల హారం కనిపిస్తోంది. కానీ చెయ్యి పెట్టి వెతికితే మాత్రం దొరకడం లేదు." అన్నాడు మనోడు.

అప్పుడు ఆ సాధువు... "నాయనా....అసలు కెంపుల హారం అదిగో ఆ చెట్టుకొమ్మనుంచి వేలాడుతోంది. నీకు నీళ్లలో కనిపిస్తున్నది ప్రతిబింబం మాత్రమే. నీళ్ళు నిశ్చలంగా ఉంటే నీకు హారం ఉన్నట్టు అనిపిస్తుంది, అసలు హారాన్ని చూడకుండా నువ్వు దాని ప్రతిబింబాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నావు. ఒళ్లంతా బురద అంటించుకుంటున్నావు...." అన్నాడు.

నిజమే మరి... చాలా సార్లు మనం వెతకాల్సిన చోట వెతకకుండా ఇంకెక్కడో వెతుకుతాం. అసలు ను వదిలేసి ప్రతిబింబాన్ని పట్టుకోవాలనుకుంటాం. దీని వల్ల బురదగుంట, చీదర కంపు మిగులుతాయి తప్ప కెంపుల హారం దొరకదు.




చివరికి మిగిలేది......


అదొక మహావృక్షం.....

కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూవులు, బలమైన కాండం, లోతైన వేర్లు....

అబ్బో .... చాలా పెద్ద చెట్టు అది.

ఆ చెట్టు పైకి ఒక తీగ పాకింది. కొద్ది రోజుల్లోనే అది అల్లుకుపోయింది. చెట్టు మొత్తం చుట్టేసింది. తీగ రోజూ మారాకులు తొడిగింది. ప్రతిక్షణం లేతాకులు పుట్టుకొచ్చాయి.

ఆ తీగ గర్వంగా చెట్టువైపు చూసింది... "నేనెలా పెరుగుతున్నానో చూశావా? నా వేగం చూశావా? గంటకో ఆకు, గడియకో పువ్వు పుట్టుకొస్తున్నాయి. నువ్వూ ఉన్నావు.... మొద్దులా పడున్నావు" అంది.

చెట్టు ఏమీ జవాబివ్వలేదు. పిల్ల తెమ్మెరకి దానికి ఆకులు తలూపినట్టు ఊగాయి.

తీగకి పట్టుదల పెరిగింది. "నా ఎదుగుదల చూడు. నా ఆకులు చూడు ఎలా నిగనిగలాడుతున్నాయో..."

చెట్టు నిదానంగా నోరు విప్పింది. "నేను 150 ఏళ్లుగా ఉన్నాను. నా చుట్టూ పెనవేసుకుని లతలు నన్ను ముంచెత్తడం జరగడం ఇది 130 వ సారి. ప్రతి సారీ తీగెలు జూన్ జులైలో వానలు పడగానే చకచకా పెరుగుతాయి. అక్టోబర్ వచ్చే సరికి ఆకులు, పువ్వులు, కాయలు, పిందెలు కాయడం రాలడం అయిపోతుంది. మళ్లీ మిగిలేది నేనే." అంది.

నిజంగానే అక్టోబర్ వచ్చే సరికి తీగ ఎండిపోయింది.

చెట్టు మాత్రం మిగిలే ఉంది.... పిల్ల గాలికి ఆకులు ఊపుతూ.....!!

1 comment:

Pages