"డాక్టర్ గారూ.... మీరు నా కాలును ఒక్క అంగుళం కదిలించండి.... నేను ఒక్క మైలు కదిలిస్తాను"
పక్షవాతంతో ఆస్పత్రి మంచంపై పడి ఉన్న సమయంలో కె వి శేషగిరిరావుగారు వైద్యుడితో అన్న మాట ఇది. వైద్యుడు ఆయన ఆత్మవిశ్వాసం చూసి ఆశ్చర్యపోయాడు. నిజంగానే డాక్టర్ ఆయన కాలును అంగుళం కదిలించారు. శేషగిరిరావు గారు నడిచారు. పదిహేనేళ్లు నడిచారు. కాలు తీసేసిన తరువాత చక్రాలతో నడిచారు. మంచానికి పరిమితమైపోయిన తరువాత మనసుతో నడిచారు. చరైవేతి... చరైవేతి....అదే ఆయన జీవితం....
శేషగిరిరావు గారిది సాఫ్ట్ పవర్... పువ్వు రేకు మృదుత్వం లో దాగున్న మానసిక దారుఢ్యం ఎలా ఉంటుందో చూడాలంటే శేషగిరిరావు గారిని చూడాలి. చెరగని చిరునవ్వు, మెత్తటి మాట, నెమ్మదైన నడక, నడత, రిమోట్ సెన్సింగ్ ఎత్తులను, వ్యవసాయ శాస్త్రం లోతులను స్పృశించిన ఆయన సంఘ సాగరంలో ఈదులాడడమంటేనే ఇష్టపడ్డారు. మిగులు సమయమంతా సంఘానిది... ఇది ఆయన లక్ష్యం. దానికోసమే ఆయన నడిచారు. చరైవేతి... చరైవేతి....అదే ఆయన జీవితం....
ఇంతకీ ఎవరీ శేషగిరిరావుగారు? కెవి శేషగిరి రావుగారంటే పాత తరం స్వయంసేవకులకు తప్ప కొత్త తరానికి తెలియదు. ఎందుకంటే పదిహేనేళ్లుగా ఆయన అనారోగ్యంతో ఇంటికే పరిమితమైపోయారు. పాతతరం స్వయంసేవకులలో ఆయన పేరు తెలిసిన వారు కొంచెం తక్కువే. స్వాతి అన్న పేరుతో ఆయన వ్రాసిన పుస్తకాలు, వ్యాసాలు లక్షలాది స్వయంసేవకులకు, జాతీయవాదులకు ప్రేరణనింపాయి. ఆరోజుల్లో జాగృతి పత్రిక వస్తే ముందు స్వాతి ముత్యం లాంటి స్వాతిగారి ఆర్టికల్ చదివేయాల్సిందే. అస్మదీయుడి లాంటి వారిని ఇల్లు, ఊరు వదిలి అస్సాం దాకా వెళ్లి సంఘపని చేసేలా చేశాయి. నక్సల్స్ నిజ రూపం పేరిట ఎనభైయవ దశకంలో ఆయన చేసిన రచనలు నక్సల్ వాదపు సైద్ధాంతిక పరాజయానికి పునాదులు వేశాయి. పని చేయడం మానేసే దాకా ఆయన చేతులు నడుస్తూనే ఉన్నాయి. చరైవేతి... చరైవేతి...అదే ఆయన జీవితం....
బాల్యంలోనే నెల్లూరులో ఆరెస్సెస్ ఆయన జీవితంలోకి ఆటపాటల రూపంలో ప్రవేశించింది. ఆయన దాన్ని వదలలేదు. అది ఆయనను వదలలేదు. మల్కాజిగిరి నగరంలోని విష్ణుపురి, శివపురి ప్రాంతంలో ఆయన శాఖలు పెట్టించారు. ఇంటింటికీ తిరిగి స్వయంసేవకులను సమీకరించారు. అటు పెద్దలు, ఇటు పిల్లలతో శాఖ కళకళలాడింది. దైనిక శాఖలో వంద సంఖ్య వచ్చేది. నెమ్మదిగా ఆయన నగర బౌద్ధిక ప్రముఖ్ అయ్యారు. ఆ తరువాత జిల్లా బాధ్యత తీసుకున్నారు. వృత్తిరీత్యా ఢిల్లీకి వెళ్లినా స్వాతి పేరిట రచనలు వస్తూనే ఉండేవి. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మళ్లీ వచ్చేసిన తరువాత ఆయన జిల్లా సంఘచాలక్ అయ్యారు. పని అలాగే నడుస్తూనే ఉండేది. చరైవేతి... చరైవేతి....అదే ఆయన జీవితం....
పక్షవాతం వచ్చిన తరువాత ఆయన ఇంటికే పరిమితమయ్యారు. కొంతకాలానికి చక్రాల కుర్చీకి, తరువాత మంచానికి పరిమితమయ్యారు. కానీ ఎవరైనా కలిస్తే దేశం, ధర్మం, సంఘం, శాఖ.... ఈ నాలుగు మాటలే వచ్చేవి. నిన్న మొన్నటిదాకా గురుదక్షిణ క్రమం తప్పకుండా చేసేవారు. ఆయన ఎంత ఎత్తైన మనిషో, ఆయనది ఎంత లోతైన మనసో మాకు తెలిసేది కాదు. గృహస్తు కార్యకర్తలుగా ఉంటూ శేషగిరిరావుగారు, నేమాని గౌరీ శంకర్ గారు, గణేశ్ శంకర్ ఆచార్య గారు, రమణరావు గారు, దక్షిణామూర్తిగారు ఆరోజోల్లో చేసిన త్యాగాలు మాకు అర్ధమయ్యేవి కావు. ఎప్పుడు వెళ్లినా ఆ ఇళ్లలో టీలు, టిఫిన్లు మాకు దొరికేవి. ఎప్పుడు తలుపులు తట్టినా ఆత్మీయ పలకరింపులు దొరికేవి. అవి టిఫిన్లు, టీల కన్నా ఎంతో రుచిగా ఉండేవి. పేరు వెనక పరుగులు పెట్టకుండా, ప్రఖ్యాతి వెంట ఉరకలు వేయకుండా, నిశ్వబ్దంగా పనిచేసుకుంటూనే వెళ్లారు శేషగిరిరావు గారు. చరైవేతి... చరైవేతి... అదే ఆయన జీవితం.
శరీరం అనే పంజరం పాతబడిపోయింది. అది ఆయన ఆత్మ అనే పక్షిని పట్టి ఉంచలేకపోయింది. శేషగిరిరావుగారు వెళ్లిపోయారు. ఆఖరి దాకా మాత్రమే కాదు.. ఆఖరి తరువాత కూడా ఆయన నడకను ఆపలేదు.... నడవలేని చక్రాలబండిని, కదలలేని మంచాన్ని వదిలేసి నడుచుకుంటూ వెళ్లిపోయారు... చరైవేతి... చరైవేతి... అదే ఆయన జీవితం...
శేషగిరిరావు గారూ... మీ నడక ఆగిపోదని నాకు తెలుసు.... ఎందుకంటే మీది చరైవేతి చరైవేతి మంత్రం. శాఖకి టైమవుతోంది. ఖాకీ నిక్కరు వేసుకొండి.... గట పనిచేయాలి.... నడవండి... నడవంటి... టైమ్ కావస్తోంది!
very very nice... sir
ReplyDeleteraka garu chala sariga vari goorchi vrasaru
ReplyDeletevutukur
Raka garu mee posts chala baguntayi andi.
ReplyDeleteThanks for provide the good posts.