ప్రదీప్ గాంధీ - Raka Lokam

ప్రదీప్ గాంధీ

Share This




"జీవితాలను మార్చుకొండి. సత్యపథంలో పయనించండి. దేవుడు అన్నీ చూస్తున్నాడు."
"మీ నిజాయితీయే మిమ్మల్ని కాపాడుతుంది. పరమేశ్వరుడిని నమ్ముకొండి."
నాగపూర్, బిలాసీపూర్ ల మధ్య ప్రయాణించే రైళ్లు రాజానందగావ్ లో ఆగుతాయి. అక్కడ ఒక నడివయస్సు వ్యక్తి చకచకా రైలెక్కి, కంపార్ట్ మెంట్లలో పైన పేర్కొన్న సందేశాల స్టిక్కర్లను అతికిస్తూ, ఇవే సందేశాల కరపత్రాలను పంచిపెడుతూ కనిపిస్తాడు.
కాషాయరంగు కుర్తా పైజామా, అదే రంగు కండువా, ముఖంపై చెరగని చిరునవ్వు, కళ్లలో ఎనలేని ప్రశాంతితో ఆయన పనిచేసుకుపోతూంటాడు.
రైల్వే స్టేషన్ లోనే కాదు. రాజానందగావ్ నగరంలోని పలు చోట్లా ఆయన సుభాషితాలను ప్రచారం చేస్తూ, మంచిని పంచుతూ, పెంచుతూ కనిపిస్తాడు.
ఆయన పేరు ప్రదీప్ గాంధీ.
ఎవడో సాడేతీన్ కోన్ కిస్కా ప్రదీప్ గాంధీ .... ఎవడైతే మాకేం ... అనుకుంటున్నారు కదూ!
ఆయన అలాంటిలాంటివాడు కాదు. ఆయన మాజీ ఎంపీ.
ఆయన బిజెపి సీనియర్ నేత. ఒకప్పుడు ఆయన వెంట వందలాది మంది నడిచారు. బుగ్గకార్లు, బ్లాక్ క్యాట్లూ ఆయన వెన్నంటేవి. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కోసం తన అసెంబ్లీ సీటును వదులుకుని, దానికి ప్రతిగా ఎంపీ గా నిలిచి, గెలిచాడు.
ఆయనకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది.... 2005 లో దేశాన్ని కుదిపేసిన క్యాష్ ఫర్ క్వెర్రీ కుంభకోణం నిందితుడు. పదవిని పోగొట్టుకున్న వాడు.
లోకసభలో ప్రశ్నలడిగేందుకు ఎంపీలు డబ్బు తీసుకుంటూంటారు. ఇది చట్టవిరుద్ధం. ఇది అవినీతి. కానీ దాదాపు ఎంపీలందరూ తీసుకుంటూంటారు. తెహల్కా మచాయించాలన్న తహతహలో కోబ్రాపోస్ట్ అనే ఛానెల్ ఆపరేషన్ దుర్యోధన అనే స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. అందులో ప్రదీప్ గాంధీ కూడా ఒక నిందితులు. ఆయన సభ్యత్వం రద్దయిపోయింది.
సొంత మనుషులే ఆయన్ని దొంగ అన్నారు. దిక్కుతోచని పార్టీ పక్కకు తప్పుకుని ఊరుకుంది. బిజెపిని దొంగదెబ్బ తీసేందుకు కుట్ర చేసిన కాంగ్రెస్ బాగానే ఉంది. కాసుల కోసం స్టింగ్ ఆపరేషన్ చేసిన జర్నలిస్టూ బాగానే ఉన్నాడు. తనవైపు తప్ప అందరివైపూ సీక్రెట్ కెమెరా తిప్పే కోబ్రాపోస్టు పని పూర్తయ్యాక తరువాత ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రదీప్ గాంధీ ప్రపంచం మాత్రం తలకిందులైపోయింది.
కానీ ప్రదీప్ గాంధీ బాధపడలేదు. ప్రజాసేవకు కొత్త మార్గం ఎంచుకున్నాడు. ప్రజలకు ఇప్పుడు ఆయనంటే అపార గౌరవం. పార్టీ మళ్లీ ఆయనను నెత్తిన పెట్టుకుంది. ఓటు రాజకీయాలలోకి మాత్రం మళ్లీ వెళ్లకూడదని ప్రదీప్ గాంధీ నిర్ణయం తీసుకున్నాడు. దానికే కట్టుబడి ఉన్నాడు. ఈ మధ్య సచిన్ తెందూల్కర్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రదీప్ గాంధీ ఆయన పక్కనే నిలుచున్నాడు. బురద జల్లిన కాంగ్రెస్ కూడా ఆయన సచిన్ పక్కన నిలుచుంటే విమర్శల విచ్చుకత్తులతో పొడవలేదు.



క్యాష్ ఫర్ క్వెర్రీ స్కామ్ గురించి అడిగితే ప్రదీప్ గాంధీ చిన్నగా నవ్వుతారు.
"మేము సూదిని దొంగిలించాం. మాది తప్పే. మాకు శిక్షపడింది. అదీ సరైనదే. మరి గునపాలు, గడ్డపారలను దొంగిలించినవారి సంగతేమిటి? వాళ్లు మాత్రం హాయిగా రాజ్యం చేస్తూనే ఉన్నారు."
నిజమే కదూ..... గుడినీ, గుడిలో లింగంపై భస్మాసుర హస్తం వేసే వారిపై మాత్రం స్టింగ్ ఆపరేషన్ ఎందుకు జరగదో ఎప్పుడైనా ఆలోచించామా?

No comments:

Post a Comment

Pages