మహాకుంభమేళాను వర్ణనల చట్రంలో బిగించలేం.
వివరణల పంజరంలో బంధించలేం.
ఎందుకంటే మన మాటలు మూగబోతాయి....
భాషలో విశేషణాలు వెలవెలబోతాయి....
మనిషి మేథస్సు అశక్తమవుతుంది.....
కవుల అభివ్యక్తి అవ్యక్తమవుతుంది......
మన మనసు మూలల్లోని మకిలిని తొలగించే జలతరంగిణీ మందిరంలో మానవాళి విముక్త ప్రాణులై విహరించే మహా సంరంభమే కుంభమేళా...
జల వాహిని, జనవాహిని కలగలిసి కళకళతళతళలాడే మహా దివ్య ఘట్టమే మహాకుంభమేళా.
జేజ ఒడిలో జనం పాపాలు కడిగేసుకునే పావన క్షణాలు, పుణ్యఘడియల ప్రోది మహాకుంభమేళా.
దేశభక్తి, దేవభక్తి, సమాజ శ్రద్ధల త్రివేణీ సంగమ స్థలంలో జరుగుతున్న మహాపర్వమే కుంభమేళ.
భస్మం పూసుకున్న బైరాగి పసి బిడ్డలా మారి ఈ గంగమ్మ తల్లి ఒడిలోనే ఓలలాడతాడు...
దిగంబరుడై, కేశపాశలు విప్పి నాగా సాధువు సంతానరూపుడై ఈ జలరూపిణి జగన్మాతనే ఆలింగనం చేసుకుంటాడు.
జాతి భేదం లేదు....
కుల భేదం లేదు....
మత భేదం లేదు...
సంప్రదాయ భేదం లేదు....
ఉపాసనా భేదం లేదు....
నగరవాసీ, గ్రామ వాసీ, వనవాసీ అన్న తేడా లేకుండా ....మహామానవ సాగరతీరమూ గంగా తీరమూ సమాలింగనం చేసుకునే సమ్యక్ రమ్య ఘట్టం మహాకుంభమేళా.
సాగర, సంగా సంగమస్థలి గంగాసాగర్ ను ప్రయాగలోకే మోసుకొచ్చిన పరమాద్భుత లీల మహాకుంభమేళా.
భక్తితో భజనలు చేసేవారు....
విముక్తులై సేవలు చేసేవారు.......
ఉన్ముక్తులై నృత్యాలు చేసేవారు........
ఉన్మత్తులై మాతాలింగన పారవశ్యంలో తేలాడేవారు....
తదేకంగా నమస్కారం చేసేవారు....
సముద్రమంత గంగను దోసిట పట్టి అర్ఘ్యం ఇచ్చే వారు....
ఆద్యంతాలు లేని భారతీయ సంస్కృతీ పరంపర ప్రవాహం లో అంతా పరవశించేవారే!!
సామాజిక సమరసతా సందేశాన్ని అందుకుని తరించే వారే!!!
యుగాల కింద గరుత్మంతుడు మోసుకెళ్తున్న అమృతభాండం నుంచి రాలిన ఓ అమృతపు చుక్క ఈ దేశంలోని ప్రతి నదినీ పవిత్రమొనరించింది. యుగాలు మారినా, తరాలు మారినా ఆ ఘట్టాన్ని పునఃపునః స్మరించుకుంటూ జాతి జరుపుకుంటోంది కుంభమేళా. దేశం తన అంతరాత్మను తానే ఆవిష్కరించుకుని, అనేకానేక యుగాల గడచిన చరిత్రను, నడచిన మహాత్ములను అంతర్ముఖంగా ఆరాధించుకునే మహోత్కృష్ట ఘట్టం మహాకుంభమేళా.
"రండి రండి... దర్శనం చేసుకుంటే ధోవతీలు ఉచితం. స్నానం చేస్తే సంపెంగ అత్తరు ఉచితం" అని చెప్పే వ్యాపార ప్రకటనలు లేవు. సబ్బుల ఎడ్వర్టయిజ్ మెంట్లలా అర్థనగ్న ఆకర్షణలు లేవు. గంగమ్మ తల్లి టూరిజం ప్యాకేజీలు ప్రకటించలేదు. సర్కారు సబ్సిడీలు ప్రకటించలేదు. కానీ ఇంత మంది జనం ఎలా వస్తున్నారు. క్యాలెండర్లో రాసిన రెండో మూడో అక్షరాల వల్ల ప్రపంచంలోనే అతి పెద్ద మానవ సమాగమం ఎలా జరుగుతోంది. కుంభమేళా అనగానే జనం ఇసకేస్తే రాలనంతగా ఎలా జమకూడుతున్నారు? భాషలకతీతంగా, దూరాలను చెరిపేస్తూ ఇంత మంది ఎలా వస్తున్నారు? ఆర్తితో చేతులు సాచిన భక్తుడికీ, ఆర్ద్రతతో చేతులు సాచిన భగవతికీ మధ్య ఉన్న అబ్బురపరచే అనుసంధానమే ఈ జనాన్ని తీసుకొస్తోంది. జీవాత్మ పరమాత్మల మహా మిలన కాంక్షే ఈ జనసమాగమానికి కారణం, కారకం, ప్రేరకం.
దేవి సురేశ్వరి భగవతి గంగ...త్రిభువన తారిణి తరళతరంగకు చేతులెత్తి నమస్కరిద్దాం....
అవును... గంగే మన పరిచయం. అవును.... హం ఉస్ దేశ్ కే వాసీ హై.... జిస్ దేశ్ మే గంగా బహతీ హై!!!
No comments:
Post a Comment