చైనా దాడికి యాభై ఏళ్లు - 3 - Raka Lokam

చైనా దాడికి యాభై ఏళ్లు - 3

Share This


పాశ్చాత్య ఫాసిస్టు సామ్రాజ్యవాద తొత్తు, క్యాపిటలిస్టు కావలి కుక్క





"లెఫ్టినెంట్ కల్నల్ హెచ్. డబ్ల్యు. టోబిన్స్ మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు"
సిడ్నీ విగ్నల్ కి ఎక్కడలేని ఉత్సాహం ఉబికి వచ్చింది.
తానెన్నాళ్లుగానో కలలు కంటున్న హిమాలయాల సాహస యాత్రకు సమయం వచ్చేసిందా? మంచుకొండలపై పర్వతారోహకుడిగా పాదముద్రలు వేసే సమయం వచ్చేసిందా?
టోబిన్స్ సామాన్యుడు కాడు మరి. ఆయన హిమాలయన్ క్లబ్ కి వైస్ ప్రెసిడెంట్. హిమాలయన్ జర్నల్ కి సంపాదకుడు.
విగ్నల్ అప్పటికే సాహసయాత్రికుడిగా పేరు తెచ్చుకున్నాడు. సముద్రాల లోతుల్లో, పర్వతాల ఎత్తుల్లో సాహసయాత్రలు చేసేశాడు. టోబిన్స్ సాయంతో హిమాలయాల్లో సాహసయాత్ర చేయొచ్చుననుకున్నాడు విగ్నల్.
"కొందరు మిత్రులకు మీరొక సాయం చేయాలి" ఇదీ టోబిన్స్ విగ్నల్ కి చెప్పిన మాట.
టోబిన్స్ విగ్నల్ కి ఒక మిత్రుడిని పరిచయం చేశాడు. "ఈయన ఒక ఇంటలిజెన్స్ ఆఫీసర్. పేరేమిటని అడగకు. కేవలం మిస్టర్ సింగ్ అని పిలిస్తే చాలు. ఈయన నీకొక ఆఫర్ ఇచ్చేందుకు వచ్చాడు"
"టిబెట్ లోకి చైనీయులు చొచ్చుకువస్తున్నారు. వారు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. వారు మిలటరీ రోడ్లను నిర్మాణం చేస్తున్నారని మా అనుమానం. మేం వెళ్లి పరిశీలించే పరిస్థితి లేదు. భారతీయుల కదలికలను చైనా సైన్యం వేయి కళ్లతో నిఘా వేసి చూస్తోంది. అందుకే ఒక విదేశీ పర్వతారోహకుడిగా మీరు వెళ్తే బాగుంటుంది. మీరిచ్చే సమాచారం ప్రపంచంలోని అతి గొప్ప ప్రజాస్వామ్య దేశానికి చాలా ఉపయోగపడుతుంది"
ఇదీ సింగ్ చెప్పిన మాట.
అది 1955.
అప్పటికే సైన్యానికి టిబెట్ లో చైనా కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. 1952 నుంచే టిబెట్ లోని గార్టక్ లో ఉన్న భారతీయ వాణిజ్య ప్రతినిధికి వేధింపులు మొదలయ్యాయి. ఏడాది తరువాత చైనా నెహ్రూపై ఒత్తిడి తెచ్చి గార్టక్ లోని వాణిజ్య కార్యాలయాన్ని మూసేయించింది. వాణిజ్య ప్రతినిధి టిబెట్ వదిలేశాడు. 1948 లోనే షింజాంగ్ రాష్ట్రంలోని కాష్ గర్ లో ఉన్న భారతీయ వాణిజ్య కార్యాలయాన్ని చైనా మూసేయించింది.
ప్రపంచపు అతి ఎత్తైన పీఠభూమిపై చైనా ఏం చేస్తోంది?
ఎందుకు షింజాంగ్, టిబెట్ లనుంచి భారతీయులను పంపించేస్తోంది?
మరో ఏడాది తరువాత చైనాలోని భారతరాయబార కార్యాలయం లో మిలటరీ ఎటాచి గా ఉన్న బ్రిగేడియర్ ఎస్ ఎస్ మాలిక్ కూడా చైనా భారత భూభాగం మీదుగా చైనా పాకిస్తాన్ కి రోడ్డు వేస్తోందన్న సమాచారం ఉందని తెలియచేశాడు.
సింగ్ ఇచ్చిన ఆఫర్ ని విగ్నల్ తక్షణం ఒప్పుకున్నాడు. పర్వతారోహకుడికి హిమాలయానికి ఉన్న రొమాన్స్ అలాంటిది మరి.
1955 లో మానససరోవర్, రాక్షసతల్ సరస్సులకు సమీపంలో, కైలాస పర్వతానికి కూతవేటు దూరంలో చైనా, భారత, టిబెట్ లు కలుసుకునే సరిహద్దుల్లో ఉన్న గుర్లా మాంధాత పర్వతంపైకి విగ్నల్ సాహసయాత్ర ప్రారంభించాడు. టిబెట్ లోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఇది. 25,355 అడుగుల ఎత్తైన పర్వత శిఖరం ఇది. అలాంటి శిఖరాన్ని చేరుకునే యాత్రకు బయలుదేరాడు విగ్నల్. ఈ యాత్రకు లివర్ పూల్ డెయిలీ పోస్ట్, లైఫ్ మ్యాగజైన్లు స్పాన్సర్లు.
గుర్లా మాంధాత మంచు కొండని ఎక్కుతూనే ముంచుకొస్తున్న ముప్పును పసిగట్టాడు విగ్నల్. కొత్తగా ఆక్రమించుకున్న షింజాంగ్, టిబెట్ లలో మిలటరీ రోడ్ల నిర్మాణాన్ని గమనించాడు. భారత్ కి చెందిన ఆక్సాయిచిన్ మీదుగా చైనా అక్రమంగా నిర్మిస్తున్న రాదారులను చూశాడు.
చైనా భారీ రోడ్లు వేస్తున్నా భారత ప్రభుత్వం కుంభకర్ణుడిలా గుర్రుపెట్టింది.
కానీ మాంధాత పర్వతంపై విగ్నల్ ను చైనా డేగకన్ను పసిగట్టింది.
టగ్లాకోట్ పట్టణం దగ్గరే ఆయన్ను అరెస్ట్ చేసింది. చైనా టార్చర్ సెల్ లో చిత్రహింసలు పెట్టింది. ఆక్సాయిచిన్, అరుణాచల్ (అప్పట్లో నేఫా), సిక్కిం, భూటాన్ లు మావేనని బల్లగుద్ది చెప్పింది. నువ్వు అమెరికన్ సీఐఏ గూఢచారివంది. వారాల తరబడి నానా బాధలూ పెట్టింది.
విగ్నల్ పెదవి విప్పలేదు.
చివరికి చైనా అతడిని ఎముకలు కొరికే చలికాలంలో హిమాలయ సానువులపై ఒంటిరిగా వదిలేసింది. మంచుకొండల్లోనే అతడు సమాధి అయిపోతాడని అనుకుంది. కానీ విగ్నల్ మంచుతుఫానులను తట్టుకుని బతికి భారత్ కి వచ్చాడు. మిలటరీ ఇంటలిజెన్స్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ బైజ్ మెహతాను కలుసుకుని అన్ని వివరాలూ చెప్పాడు.
భారత సైన్యం విగ్నల్ కి గుండెనిండుగా కృతజ్ఞత చెప్పింది.
విగ్నల్ ఇచ్చిన విలువైన సమాచారాన్ని తీసుకుంది సైన్యం.

* * *
అత్యంత విలువైన ఈ సమాచారాన్ని తీసుకుని భారత ప్రభుత్వం ఏం చేసింది?
గుండెను చిక్కబట్టుకొండి...
గుండె జబ్బు ఉన్న వాళ్లు ముందుకు చదవకపోవడమే మంచిది.
నెహ్రూ ఈ నివేదికను చెత్తబుట్టలో పారేశాడు.
ఆయన పక్కనే కూచున్న రక్షణ మంత్రి వికె కృష్ణమీనన్ సైనికాధికారులపై భగ్గుమన్నాడు. ఒక సీఐఏ ఏజెంటు మాటలు పట్టించుకుని సోషలిస్టు మిత్రుడైన ఎర్ర చైనాను అనుమానిస్తున్నారని ఆక్షేపించాడు.
పాశ్చాత్య ఫాసిస్టు సామ్రాజ్యవాద తొత్తు, క్యాపిటలిస్టు కావలి కుక్క విగ్నల్ విలువేమిటని విరుచుకుపడ్డాడు. జనరల్ తిమ్మయ్యను అత్యంత అవమానకర పరిస్థితుల్లో బాధ్యతల నుంచి తొలగించాడు.
"మిమ్మల్ని చైనా ఫిరంగులకు ఆహారంగా వేస్తున్నానేమోనని భయంగా ఉంది" అని సైనికుల ముందు కన్నీరు పెట్టుకుంటూ జనరల్ తిమ్మయ్య నిష్క్రమించారు.

* * *
"అంతేనా... నేను చేసిన సాహసమంతా బూడిదలో పోసిన పన్నీరేనా" అని విగ్నల్ మిస్టర్ సింగ్ ని అడిగాడు.
"మేం మా ప్రయత్నాలను చేస్తున్నాం. మా ప్రధానమంత్రి ఏదో ఒక రోజు నిజాన్ని తెలుసుకుంటారు." అన్నాడు మిస్టర్ సింగ్ నిర్వేదంగా!

నెహ్రూ నిజం తెలుసుకున్నారు.
అక్టోబర్ 20, 1962 నాడు.
అప్పటికే చాలా ఆలస్యమైపోయింది.
చైనా భారత్ పై దురాక్రమణ చేసేసింది.


(1955 లో సిడ్నీ విగ్నల్ ఫోటో ఇది)

(తరువాతి కాలంలో విగ్నల్ "ది స్పై ఆన్ ది రూఫ్ ఆఫ్ ది వరల్డ్" అన్న పుస్తకం వ్రాశాడు. భారత్ లో ఏ ప్రచురణకర్తా "పాశ్చాత్య ఫాసిస్టు సామ్రాజ్యవాద తొత్తు, క్యాపిటలిస్టు కావలి కుక్క" రచనను ముద్రించే సాహసం చేయలేదు. నెహ్రూ, కృష్ణమీనన్ లు పోయినా కమ్యూనిస్టుల ప్రభావం పోలేదు. అందుకే ఆఖరికి అది లండన్ లో అచ్చైంది.. ఈ ఏడాది ఏప్రిల్ 4 న 89 ఏళ్ల ముదిమి వయసులో ఫ్రెండ్ ఆఫ్ ఇండియా సిడ్నీ విగ్నల్ తుది శ్వాస వదిలాడు. "అమ్మయ్య... ఆయనతోటే అన్ని రహస్యాలూ ఆవిరైపోయాయ"ని భారత్ లో ఏలిన వారు ఆనందపు నిశ్వాసం విడిచారు.)

1 comment:

  1. Hello Sir I just love to read your Posts they are amazing but the problem is very few can nkow about your Articles.
    I am running a website.
    www.apgap.com
    if u like you can mail me your articles along with your photo we can publish it in our site as special Column. i hope u can sir.
    Thankyou.
    MY email id urs.vamsee@gmail.com

    ReplyDelete

Pages