వి ఫర్ విక్టరీ....
రెండు వేళ్లు చూపించడం గెలుపుకి సంకేతం.....
గెలుస్తామన్న పట్టుదలకి సంకేతం...
ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటమి వద్దన్న సంకల్పానికి సంకేతం.
ఈ రెండు వేళ్ల వెనుక కాస్త ఇంగ్లీషు వాడి తిక్కుంది.....
ఆ తిక్కకి కొంచెం లెక్కుంది.
ఆ తిక్క, దాని లెక్క ఏమిటో తెలుసుకోవాలంటే ఏడొందలేళ్లు వెనక్కి వెళ్లాలి.
1337 నుంచి 1447 వరకూ ఇంగ్లండ్ కి, ఫ్రాన్స్ కి మధ్య నూటపదేళ్ల పాటు యుద్ధం జరిగింది. పగ, పట్టుదల, ప్రతీకారం ముప్పేటలా పెనవేసుకుపోయిన యుద్ధం అది. రక్తాలు పారేయి. తలలు తెగేవి. రాజులు మారిపోయారు. సైనికులూ చచ్చిపోయారు. తరాలు మారిపోయాయి. క్యాలెండర్లో తేదీలు కాదు, సంవత్సరాలు కాదు, శతాబ్దమే మారిపోయింది.
ఈ వందేళ్ల యుద్ధంలోనే ఇంగ్లీషువాళ్లు ఫ్రెంచి వాళ్లపైన ఎన్నెన్నో వ్యంగ్యాలు, వెటకారాలు సంధించారు. చెప్పకుండా పెట్టే సెలవును ఫ్రెంచి లీవ్ అన్నారు. బట్టలు వదిలేసి చేసే స్నానాన్ని ఫ్రెంచ్ బాత్ అన్నారు. పోరాడకుండా పారిపోవడాన్ని ఫ్రెంచి వాలర్ అన్నారు.
ఫ్రెంచి పిరికిదనానికి ఒక కారణం కూడా ఉండేది.
ఇంగ్లీషువాళ్ల బాణాలు....
అవి గురితప్పేవి కావు. గుచ్చుకుని చంపేవి. ఇంగ్లీషు బాణమంటే చాలు వాళ్లు వణికిపోయేవారు.
అది ఏ స్థాయికి చేరిందంటే ఇంగ్లీషువాడు దొరికితే చాలు... ముందు వాడి చూపుడువేలు, మధ్యవేలు నరికిపారేసేవారు. ఎందుకంటే ఆ రెండు వేళ్లూ లేకపోతే వాళ్లు బాణాలు వేయలేరు. ఇలా వేళ్లు నరికే ఉద్యమాన్ని ఫ్రెంచివారు పెద్దెత్తునే చేపట్టారు.
ఇంగ్లీషువాడు అప్పట్నుంచీ ఫ్రెంచివాడిని చూడగానే దూరం నుంచే చూపుడువేలు, మధ్యవేలు చూపించి ఆటపట్టించేవాడు. "ఇదిగో నావేళ్లు మిగిలే ఉన్నాయి. బాణాలేస్తా.... చూపుడువేలుతో చంపేస్తా.... మధ్యవేలుతో మసిచేస్తా" అని చెప్పకుండా చెప్పేవాడు.
అలా ఇంగ్లీషువాడు రెండు వేళ్లు చూపించేవాడు.
ఫ్రెంచివాడు ఉక్రోషంతో రగిలిపోయేవాడు.
నూటపదేళ్ల తరువాత యుద్ధం అంతమైపోయింది. ఆ తరువాత రెండు వేళ్లు చూపించడం ఇంగ్లీషువాడు మరిచిపోయాడు. దాన్ని చూస్తే ఫ్రెంచివాడు రగిలిపోవడమూ మానేశాడు.
బాణాల యుగం పోయింది. బాంబుల యుగం వచ్చింది. తొలి ప్రపంచయుద్ధం అయి, రెండో ప్రపంచయుద్ధం మొదలైంది.
యుద్ధంలో జర్మన్ బాంబులు బ్రిటిషర్లను కకావికలం చేసేశాయి. లండన్ మరుభూమి అయిపోయింది.
అప్పుడు ముందు ప్రజల్లో ధైర్యం నింపడం అవసరమైంది. కష్ట సమయం వచ్చినప్పుడే కర్తవ్యదీక్ష ఉన్న నాయకుడు వస్తాడు. ఇంగ్లండ్ కష్టకాలంలో చర్చిల్ ప్రధాని అయ్యాడు.
అప్పుడు వందేళ్ల ఫ్రెంచి-ఇంగ్లండ్ పోరాటం కథలు గుర్తుకొచ్చాయి. ఇంగ్లీష్ రేడియో బిబిసి రెండు వేళ్ల సంకేతం చూపించి విజయం మనదే అని చెప్పమని ప్రజలను ప్రోత్సహించింది. 1941 జులైనెలలో ఒక సభలో చర్చిల్ కూడా రెండు వేళ్ల విజయసంకేతాన్ని చూపించాడు.
అంతే .......అక్కడి నుంచి అది మహాపాపులర్ అయిపోయింది. విక్టరీ సైన్ చూపించే చర్చిల్ చిత్రపటాలు ఈ చిహ్నాన్ని ఇంటింటికీ చేర్చాయి.
అలా ఇంగ్లీషు వాడు మళ్లీ రెండు వేళ్లు చూపించనారంభించాడు.
అది చూపి నెదర్లాండ్స్ వాడూ రెండు వేళ్లు చూపించాడు.
బెల్జియం వాడూ రెండు వేళ్లు చూపించాడు.
ఈ సారి ఫ్రెంచి వాడికి కోపం రాలేదు. వాడు హిట్లర్ బూట్ల కింద నలిగిపోతున్నాడు.
ఫ్రెంచివాడూ రెండు వేళ్లు చూపించాడు.
ఇంగ్లీషువాడి భుజంతో భుజం కలిపి మరీ రెండు వేళ్లు చూపించాడు.
ఈ సారి రగిలిపోయింది ఫ్రెంచి వాడు కాదు. జర్మన్ వాడు.
అలా రెండు వేళ్లు విజయసంకేతంగా చూపించడం ఆనవాయితీ అయ్యింది.
అది చూసి ఆరు దశాబ్దాల తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఒక యెల్లో నాయుడు గారు కూడా రెండు వేళ్లు చూపించాడు.
తెలుగువాడికి ఈ కథంతా తెలియదు. రెండు వేళ్లంటే వాడికి తెలిసింది వేరు.
"ఆయన్ని త్వరగా పంపించేయండి. లేకపోతే ఇక్కడే అంతా ఖరాబు చేసేస్తాడేమో...... ఏం చేస్తాడో ఏమో ..... ఖర్మ ... ఖర్మ.... అంతా కడుక్కు చావాలి" అని అధికారం నుంచి బయటకి పంపించేశాడు.
This article is very informative like your other articles, except the ending. I am not a fan of CB, it appeared to me more as a personal comment.
ReplyDelete