వంద మీటర్లు!! - Raka Lokam

వంద మీటర్లు!!

Share This





ఇద్దరిదీ ఒకే ఊరు....
ఇద్దరూ అక్కడే పెరిగి పెద్దవాళ్లయ్యారు.
ఒకరు ప్రధానమంత్రి అయ్యారు.
ఇంకొకరు స్వదేశంలో పరదేశీ అయ్యారు.
ఎందుకిలా....?


ఇద్దరికీ తేడా ఒక్కటే...
వంద కిలోమీటర్లు ....


వంద కిలోమీటర్లు ఒక మనిషిని ప్రధానమంత్రిని చేసింది.
మరొకడిని స్వదేశంలో పరదేశీగా చేసింది.
సియాల్కోట్ వాళ్లిద్దరి ఊరు. అది పాకిస్తాన్లో ఉంది.

దేశ విభజన జరిగినప్పుడు ఒకాయన పంజాబ్ కి వచ్చేశాడు.
అక్కడే పెరిగి పెద్దవాడయ్యాడు. బాగా చదువుకున్నాడు. ఆర్ధికవేత్త అయ్యాడు. ఆ తరువాత రిజర్వుబ్యాంకు గవర్నర్ కూడా అయ్యాడు. అప్పుడు ఆయన పనితీరు పి.వి. నరసింహారావుకి బాగా నచ్చింది. పి.వి. ప్రధానమంత్రి కాగానే ఈయన దేశ ఆర్ధికమంత్రి అయ్యాడు. సరళీకృత ఆర్ధికవిధానాలను అమలు చేశాడు. బాగా పేరు తెచ్చుకున్నాడు. తరువాత ఢిల్లీలో జరిగిన విచిత్రనాటకంలో హఠాత్తుగా అదృష్టపు ఏనుగు ఆయన మెడలో గజమాల వేసేసింది. ఆయన ప్రధానమంత్రి అయ్యాడు.
ఆయన పేరు మన్మోహన్ సింగ్.

ఇంకొకాయన దేశ విభజన జరిగినప్పుడు జమ్మూకి వచ్చేశాడు.
అక్కడే పెరిగి పెద్దవాడయ్యాడు. శరణార్థి శిబిరాల్లో ఉన్నాడు. బతుకు అనునిత్యం పోరాటంలా సాగింది. షేక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆయన్ను విదేశీ అంది. జమ్మూకాశ్మీర్ పౌరుడు కాదంది. కాశ్మీర్ రాష్ట్రానికి మాత్రమే వర్తించే ఆర్టికల్ 370 ప్రకారం ఆయన ఆస్తులు కొనలేడు. పౌరసత్వం పొందలేడు. మైగ్రంట్ (వలసదారుడు) అన్న భుజకీర్తి బరువు మోస్తూ బతకాల్సి వచ్చింది. దేశంలోకి వచ్చి ఆరవై ఏళ్లు దాటినా శరణార్థే. అంటే స్వదేశంలో పరదేశీ అన్న మాట.
ఈయన పేరు ఊరు లేని ఒక అనామకుడు.

ఆయన పంజాబ్ కి వచ్చాడు. ప్రధానమంత్రి అయ్యాడు.
ఈయన జమ్మూకి వచ్చాడు. శరణార్థిగా మిగిలాడు.
రెండింటి మధ్యా దూరం వంద కిలోమీటర్లు.

ఆయన లాంటి వాళ్లు జమ్మూలో ఎందరో ఉన్నారు.
ప్రధానమంత్రి మాత్రం ఒక్కడు. ఒకే ఒక్కడు. ఒక్కటంటే ఒక్కడు.

అందుకే జమ్మూలో పాక్ శరణార్థుల ప్రతినిధి బృందం ఆ మధ్య మన్మోహన్ సింగ్ ని కలిసింది.
"మీదీ సియాల్కోట్. మాదీ సియాల్కోట్. మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు. మేము శరణార్థులుగా ఉన్నాం. కనీసం మీ హయాంలోనైనా మాకు పౌరసత్వం ఇప్పించండి." అని వేడుకున్నారు.

ప్రధానమంత్రి ఏం చేశారో ఊహించగలరా?

మన్ మోహన్ సింగ్ ఎప్పట్లాగే "మౌనమోహన్ సింగ్" మోడ్ లోకి వెళ్లిపోయారు.
వంద కిలోమీటర్ల దూరం కాస్తా లక్షల కిలోమీటర్ల దూరంగా మారిపోయింది.




(గమనికః రెండూ మన్మోహన్ ఫోటోలే)

2 comments:

  1. ఒక సమస్యని....ఒక విషయాన్ని...కళ్ళకు కట్టినట్లుగా....హృదయానికి హత్తుకునేలా...ప్రజా బాహుళ్యంలోకి తీసుకుని రావడంలో మీకు మీరే సాటి...

    ReplyDelete
  2. Thanks sir .... mee protsaaham naaku manchi tonic

    ReplyDelete

Pages