అతనికి ఉడుకురక్తం. ప్రపంచంలో చెడును చూసి రగిలిపోయేవాడు.
దేవుడిని ప్రార్థించేవాడు.
"దేవా ... ఈ బుద్ధిలేని ప్రజలందరికీ మంచి దారి చూపించు. నేను ఎంత చెప్పినా వారు మంచివాళ్లుగా మారడం లేదు. వారికి సన్మార్గం చూపించు"
యువకుడు కాస్తా నడివయస్సు లోకి వచ్చేశాడు.
సమాజం అలాగే ఉంది.
దాన్ని మార్చలేనని అతనికి అర్థమైపోయింది. అప్పుడు అతను దేవుడిని ఇలా ప్రార్థించేవాడు.
"దేవా... ప్రపంచం సంగతి పక్కనబెట్టు. నా భార్యాపిల్లలకు సన్మార్గం చూపించు స్వామీ. నేను చెప్పిన మంచిమాటలు వినేలా చేయి స్వామీ..."
నడివయస్సు కాస్తా ముసలితనంగా మారింది.
జుత్తు తెల్లబడింది. చూపు మసకబారింది. ముఖంపై ముడుతలు వయస్సు లెక్కలు వేసీ వేసీ పలకమీద పసివాడి బలపం గీతల్లా కనిపించసాగాయి.
ఊరు పొమ్మంటోంది. కాడు రమ్మంటోంది.
అప్పుడు అతను దేవుడిని ఇలా ప్రార్థించాడు.
"స్వామీ... ప్రపంచాన్ని మార్చడం కాదు. నా వాళ్లను మార్చడం కాదు. ప్రభూ... ముందు నన్నుమార్చు....అందరిలో మంచినే చూసేవాడిలా నన్ను మార్చు స్వామీ"
No comments:
Post a Comment