ఎవరైనా చూడకముందే బియ్యం గోళెం ఖాళీ చేసి అందులో డబ్బు దాచేసుకుంటారు.
గోతాం సంచిలో పెట్టి గొయ్యి తవ్వి దాచేస్తారు.
అప్పటికప్పుడు పరుపులోని దూది తీసేసి నోట్ల కట్టలతో నింపేసి, ఆ పరుపు మీద పడుకుంటారు.
అప్పటికప్పుడు గోవా పారిపోతారు ... బీచిల్లో బికినీ భామల్ని కడుపారా, కన్నులారా చూసేందుకు....
బంజారా హిల్స్ లో భూమి కొనేసి, రిజిస్ట్రేషన్ చేయించేస్తారు.
పెళ్లాన్ని పదినిమిషాల్లో నడిచే నగల దుకాణంగా మార్చేస్తారు.
కానీ సురేశ్ కి ఇంత జ్ఞానం లేదు. బుద్ధి అంతకన్నా లేదు.
కళ్ల ముందు కోటి నలభై లక్షలు ఒకచిన్న కాగితం రూపంలో ఉన్నాయి.
కానీ "ఇవి నావు కావు.. ... నీవే " అని ఇచ్చేశాడు.
సురేశ్ కేరళ లోని ఎర్నాకుళంలో లాటరీ టికెట్లు అమ్ముకునే చిరు వ్యాపారి.
అయ్యప్పన్ అతని దగ్గర నుంచి అయిదు లాటరీ టికెట్లు కొన్నాడు. తీరా చూస్తే జేబులో డబ్బులు లేవు. "డబ్బులు తీసుకువస్తా... టికెట్లు ఉంచు" అని చెప్పాడు. వెళ్లాడు... రెండు మూడు రోజులైనా రాలేదు.
లాటరీ ఫలితాలు మాత్రం వచ్చాయి.
అందులో అయ్యప్పన్ కొన్న ఒక లాటరీకి కోటి నలభై లక్షలు బహుమతి వచ్చింది.
"అయ్యప్పన్ రాలేదు కదా... డబ్బులు కట్టలేదు కదా.... ఆ లాటరీ నీదే... ఉంచేసుకో" ఎంతో మంది ఈ సలహా ఇచ్చారు.
సురేశ్ నిజంగా బుద్ధిలేని వాడు.... "ఇవి అతను కొనుక్కున్నాడు... అతనివే... వాటిపై నా అధికారం లేదు" అని ఆ టికెట్లు తీసుకుని అయ్యప్పన్ ఇంటిని వెతుక్కుంటూ వెళ్లాడు.
అయ్యప్పన్ కొయ్యబారిపోయాడు. సురేశ్ ని చూసి "నేను డబ్బులు ఇవ్వలేదు.. కాబట్టి అవి నీవే" అన్నాడు.
"కాదు నీదే ... నీ లాటరీ డబ్బులు తీసుకుని, నా టికెట్ల డబ్బులు నాకిచ్చెయ్" అని అక్కడ పెట్టి వచ్చేశాడు.
మరుసటి రోజు నుంచీ మళ్లీ లాటరీలు అమ్ముకుంటూ బతికేయడం మొదలుపెట్టాడు. "నాకు దేవుడు ఇచ్చింది ఇదే. ఇంతకు మించి నేనేమీ ఆశించను" అనుకున్నాడు.
"ఇదం న మమ" (ఇది నాది కాదు)
"పరద్రవ్యేషు లోష్ఠవత్" (పరుల సొమ్ము రాయితో సమానం)
చెప్పడం ఎంత సులభం?
చేయడం ఎంత కష్టం?
అందుకే సురేశ్ కథ తెలుసుకున్న తమిళ నటుడు పార్తిబన్ సురేశ్ ను వెతుక్కుంటూ ఎర్నాకుళం వచ్చాడు. ఒక సందు మూల లాటరీలు అమ్ముకునేసురేశ్ ను కలుసుకున్నాడు.
"కోటి రూపాయలు ముందుంటే నువ్వు చూపిననిజాయితీని నేను చూపుతానో లేదో" అని నిజాయితీగా ఒప్పేసుకున్నాడు. సురేశ్ ను తనతో చెన్నై తీసుకెళ్లాడు. తన సేవాసంస్థ మనిద నేయ మండ్రమ్ ఆధ్వర్యంలో సురేశ్ ను సన్మానించాడు. శాలువ కప్పాడు. ఈ కార్యక్రమం మార్చి 26 న చెన్నైలోని లక్ష్మీహాల్ లో జరిగింది. సురేశ్ ను సినీ ప్రముఖులు వివేక్, ప్రసన్న, రోహిణిలు కూడా ప్రశంసలతో ముంచెత్తాడు. లక్ష రూపాయల బహుమతి కూడా ఇచ్చారు. .
సురేశ్ వదిలేసుకున్న కోటి కన్నా అతనికి వచ్చిన లక్ష చాలా గొప్పది. దాని కన్నా గొప్పది అతనికి వచ్చిన ప్రశంస. అంతకన్నా గొప్పది ఎందరెందరినో తన ముందు తల వంచేలా చేసిన అతని నిజాయితీ, నిబ్బరం. దాని విలువ కోటి నలభై లక్షల రూపాయల కన్నా చాలా చాలా చాలా ఎక్కువ.
సురేశ్ లాంటి బుద్ధిలేని వాళ్లు, అజ్ఞానులు ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఉన్నారు.
:) mari anta buddilekunda vundatam kastame.. dhanamoolamidam jagat!
ReplyDeleteరాకాజీ,
ReplyDeleteఈ కలికాలంలో ఇంత అమాయక చక్రవర్తులు ఇంకా ఉన్నారా అనిపిస్తుంది..నమ్మలేకపోతున్నాను..అయినా ఆధారాలు చూపారుగా , నమ్మక తప్పట్లేదు..ఎంతైనా మనోడు సన్మానానికి సరైనవాడే...
NARENDER JAVVAJI
patrikalu, media raayani, cheppani manchi prapancham lo challa vundi....
ReplyDelete