ఒకనాడు రాచవైభవం నేడు రాళ్ళపాలు....
ఒకప్పుడు శతాబ్దాల ఘన చరిత్ర...
కానీ ఇప్పుడు భగ్న మందిరాలూ, శిథిలాలయాలు.....
కోటలన్నిటి కథా దాదాపు ఇలాగే ఉంటుంది....
కానీ ఇందుకు భిన్నమైన ఒక కోట మనరాష్ట్రంలోఉంది...అప్పట్లాగే ఇప్పుడూ ఆ కోట కళకళలాడూతూ ఉంటుంది....అప్పట్లాగే ఇప్పుడూ ప్రజాసేవలో తరిస్తోంది....అదే విజయనగరం కోట....
అది శస్త్రమూ శాస్త్రమూ జోడు గుర్రాల్లా కదం తొక్కిన కోట....
అది కదన వీరులను, కళాకారులను సమానంగా ఆదరించిన చోట....
అది సమరమూ సంగీతమూ కలగలిసి విలసిల్లిన చోటు....
అది లక్ష్మి, సరస్వతిలు కలిసుండే చోటు....
రాజరికాలు పోయినా ఆ కోట రాజసం పోలేదు....
ఎందుకంటే ఇప్పటికీ ఈ కోట ప్రజాసేవలోనే తరిస్తోంది....
విజయనగరం కోటను 1713లో కట్టించారు. 26 ఎకరాల్లో విస్తరించిందీ కోట....చతురస్రంలా ఉండే ఈ కోటకు నాలుగు వైపులా బురుజులుంటాయి....కోటకు 30 అడుగుల ఎత్తైన ప్రహరీ ఉంది....దాని చుట్టూ కందకం ఉంది....కందకం నిండా నీరుంటుంది...ఈ కందకాలు, ప్రహరీలు శత్రువులను దరిచేరనిచ్చేవి కావు....ఈ ప్రహరీ గోడ ఒక తారు రోడ్డంత వెడల్పు ఉంటుంది. ఇంత వెడల్పయిన గోడ ఇంకెక్కడ కనిపించదు....ప్రహరీ లోపల 19653 చదరపు అడుగుల నేలలో రాజ భవంతి, పెద్ద తోట ఉంటాయి....
ఇంత పటిష్టమైనది కాబట్టే ఈ కోటపై ఎప్పుడూ దాడులు జరగలేదు....
* * *
ఈ కోట ముందు ఒక చిన్న దర్గా ఉంటుంది....ఏమిటీ దర్గా...ఇక్కడెందుకుంది......అని ఆశ్చర్యం వేస్తుంది....ఈ కోటకీ దర్గాకీ విడదీయరాని సంబంధం ఉంది. ....అసలు గజపతి రాజుల రాజధాని కుమిలి గ్రామంలో ఉండేది. ఒక సారి అప్పటి రాజు విజయరామరాజు వేటకు ఈ ప్రదేశానికి వచ్చాడట....ఇక్కడకి రాగానే ఆయన గుర్రం ఆగిపోయింది....ఎంత ప్రయత్నించినా ముందుకు కదల్లేదు...అంతలో అక్కడ ఒక ముస్లిం ఫకీర్ ఢంకా బజాయిస్తూ కనిపించాడు...ఆయనే డంకే షా వలీ బాబా....ఆయన ఏడు వెదురు బొంగులు చూపించి...వాటితో కొలిచి చతురస్రం చేసి అక్కడ కోట కట్టమని చెప్పాడట...అలా చేస్తే ఏడు తరాల వరకూ పూసపాటి వంశం రాజ్యం చలాయిస్తుందని చెప్పాడట....పూసపాటి రాజా వారు ఆ ఫకీర్ సమాధిని తన కోట గుమ్మం ముందే కట్టించారట...
ఈ కోట నిర్మాణం కోసం ఒక చెరువును తవ్వించారు....ఆ చెరువు తవ్వుతూండగానే ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారు బయల్పడ్డారట....
ఈ రాజకోటలో ఇంకో రహస్యం ఉంది....
ఈ కోటతో అయిదు జయలు ముడిపడి ఉన్నాయి....
ఇది కట్టింది విజయ నామ సంవత్సరం....
పని మొదలైన రోజు జయవారం... ఆ రోజు విజయ దశమి.....
కట్టిన రాజుగారు విజయరామరాజు...
ఈ ఊరి పేరు విజయనగరం...అయిదు జయలు కలిసినందుకే పూసపాటివారు అజేయులయ్యారట....బొబ్బిలి, పద్మనాభం, చందుర్తి యుధ్ధాలు ఈ కోట నుంచే చేసి గెలిచారు....ఇక్కడ నుంచే పూసపాటివారి రాజ్యం విస్తరించింది...
దేశం ప్రజాస్వామ్యం వైపు పయనించిన తరుణంలో రాజులు రాజరికాలూ ప్రజాసేవకోసమేనని నమ్మిన రాచకుటుంబం ఈ కోటను విద్యాకేంద్రంగా మార్చేశారు....ఇలా చేసిన రాజ వంశాలు చరిత్రలోనే అరుదు......
1957లో అప్పటి రాజావారు పివిజి రాజు ఈ కోటను మానసాస్ ట్రస్ట్‌విద్యాసంస్థలకు అప్పగించి తాను వేరే చోటికి తరలిపోయారు. అప్పటినుంచీ ఈ కోట స్థానికులకు ఒక విద్యాలయంగా, ఒక దేవాలయంగా మారిపోయింది. ఇప్పుడిక్కడ మాన్సాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, మహారాజా బిఇడి కాలేజ్, మహారాజా హైస్కూల్, మహారాజా వుమన్స్ కాలేజీలు నడుస్తున్నాయి.... అంతే కాదు ఈ కోటలో ఒక అద్భుతమైన సైన్స్ మ్యూజియం ఉంది.
ప్రస్తుతం పూసపాటి రాజవంశీయులు ఆనందగజపతి రాజు, అశోక్ గజపతిరాజులు కూడా ఈ కోట పరిరక్షణకు పూర్తి శ్రధ్ధ తీసుకుంటున్నారు. అందువల్లే ఈ కోట ఒక నందనవనంగా విలసిల్లుతోంది....గజపతి రాజుల ప్రజా సేప ఈ రోజుకీ కొనసాగుతోంది....
ఆరోజు వారు మకుటం ఉన్న మహారాజులు...
ఈ రోజు మకుటం లేని మహారాజులు....
జనంతో మమేకమైనవాడే రాజు....జనమే జయం అనుకున్న వాడిదే విజయనగరం....వాడే గజపతి, దళపతి...జనపతి కూడా...ఈ పరమరహస్యం తెలిసినందుకే ఈ రాజకోట ఇప్పటికీ రాజవైభోగంతో వెలుగులు విరజిమ్ముతోంది....పాలకులకు పాఠాలు చెప్పగలగడమే విజయనగరం రాజకోట అసలు రహస్యం.....
No comments:
Post a Comment