మహంకాళిని కలిసిన మహేశ్వరుడు .... - Raka Lokam

మహంకాళిని కలిసిన మహేశ్వరుడు ....

Share This


శంకర్ మాస్టర్ దిగ్గున పక్క మీద నుంచి లేచారు...
ఆయన ఒళ్లంతా కంపిస్తోంది....
పెదవులు వణుకుతున్నాయి...
విషపానం చేస్తున్న శివుడు మళ్లీ కలలో కనిపించాడు... "నీటి మడుగు అడుగున ఉన్నాను... నన్ను బయటకి తియ్యి"
శివుడు ఆవే మాటలు మళ్లీ అన్నాడు.
"చెరువులో నుంచి నన్ను బయటకి తియ్యి.... నేను మహేశ్వరుడిని...."
కొద్ది రోజులుగా శంకర్ మాస్టర్ కి ఇదే కల వస్తోంది... ఇవే మాటలు వినిపిస్తున్నాయి.

మాస్టార్జీ ఇదే విషయాన్ని తన బంధువులు, మిత్రులతో చెప్పారు...."పదండి వెతుకుదాం" అనుకున్నారు వాళ్లంతా.

* * *

శతాబ్దాలుగా మడుగు అట్టడుగున ఉన్న శివలింగాన్ని ఒక జలతరంగం బలంగా తాకింది....
"మహేశ్వరా..... "
గంగను జటలో పట్టిన శివుడు పుడిసెడు నీట ఒకటా ....రెండా.... శతాబ్దాలు....తలదాచుకున్నాడు....
ఒకప్పుడు అగణిత భక్తజనం పూజలందుకుని, నిత్యాభిషేకాలు పొందిన వాడు...
వేదఘోషల నడుమ సమారాధనలు, సంబరాలలో తేలాడిన భంభం మహాదేవుడు....
విభూది విచిత్ర కాంతులతో విశ్వానికి వెలుగుపంచిన మహేశ్వరుడు.....
నీళ్లలో ఏళ్లకు ఏళ్లు తలదాచుకున్నాడు....
ఎందరో ఆ నీళ్లలో ఈదులాడేవారు... కేరింతలు కొట్టేవారు .... కానీ విషపాన మత్త విశ్వంభర నీలకంఠుడి నిద్దుర చెడలేదు.... కానీ ఎంతటి ఆటగాడాయన... ? తాను నిద్దుర పోతూ అదే ఊళ్లో పాఠాలు చెప్పుకునే పంతులు గారైనశంకర్ మాస్టర్ నిద్దుర మాత్రం చెడగొట్టేశాడు....

ఆయన భక్తవశంకరుడు.
అయినా గజ ఈతగాళ్లను కాస్త ఏడిపించి కానీ దొరకలేదు.
అయిదు వందల అడుగుల పొడవు, రెండు వందల యాభై అడుగుల వెడల్పు ఉన్న జలాశయం అది.
నీళ్ల నుంచి నెమ్మదిగా శివలింగం బయటకు కనిపించింది. ఒడ్డున ఉన్న భక్త సందోహం భక్తి భావోద్వేగంతో "హరహరమహాదేవ" అని నినదించారు. ఆకాశంలో ఒక్కసారి మేఘాలు ముసురుకున్నాయి.... చిరు జల్లు పడింది... జలగంగ నుంచి తల ఎత్తిన శివుడికి జలధరార్భటులు, చలిత దిక్కరుల ధనధన ఫెళఫెళల మధ్య ఆకాశగంగాభిషేకం జరిగిపోయింది....
తడిలో శివుడు తళతళ మెరిసిపోయాడు...
కొందరికి పూనకం వచ్చింది...
కొందరికి మూర్ఛ వచ్చింది...
అందరికీ పులకింతలు పుట్టాయి...
నీటిలో పుట్టిన శివుడిని జలగంగ రాజరాజేశ్వరుడన్నారు. నీటి మధ్యలోనే గుడి కట్టారు. ఆ ఊరి తలరాత మారిపోయింది. ఆ ఊరి పేరుకు సార్థకత వచ్చింది....




ఆ ఊరి పేరు మహేశ్వరం.... మాంఖాల్ మహేశ్వరం... హైదరాబాద్ కి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది మహేశ్వరం.
పేరులోనే మహేశ్వరుడున్న ఊరు అది. మరి మాంఖాల్ ఏమిటి? శతాబ్దాల కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ ఏలుబడి పుణ్యమా అని మహంకాళి మాంఖాల్ అనే పలుకుబడిగా మారిపోయింది. అంటే మాంఖాల్ మహేశ్వరం పార్వతీపరమేశ్వరులు కొలువున్న ఊరు. అలవాటుగా ఉన్న మాంఖాల్ మహేశ్వరాన్ని ఆధునికులు పొరబాటుగా మహేశ్వరం అనేసి అమ్మవారిని, అయ్యగారిని విడదీసేస్తున్నారన్న మాట. తస్మాత్ జాగ్రత!

* * *

మాంఖాల్ మహేశ్వరం అంటే ఇప్పుడు హై కాస్ట్ రియల్ ఎస్టేటు, కాసిన్ని సెజ్ లు, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, కలవారి ఫార్మ్ హౌస్ లు, కావలసినన్ని మామిడి తోటలు ...
కానీ ఒకప్పుడు మాంఖాల్ మహేశ్వరానికి మహా గొప్ప చరిత్ర ఉండేది. నాలుగొందల సంవత్సరాల కింద 1658 నుంచి 1687 వరకూ గోల్కండను పాలించిన అబూహసన్ తానీషా కాలంలో ఇదే ఊరిలో ఆయన మంత్రులు అక్కన్న, మాదన్నలు తిరుగాడేవారు. వారి బంధువే కంచెర్ల గోపన్న. భద్రాచలాన్ని కట్టి రామదాసుగా మారిపోయిన వాడు ఇతనే. అక్కన్న మాదన్నల తండ్రి భానూజీ పంతులు మహేశ్వరం పక్కన ఉన్న హన్మకొండలో శిస్తులు వసూలు చేసే అధికారి. ఆయన అక్కన్నపల్లి, మాదన్నపల్లి, భానుపురం అనే మూడు గ్రామాలను నిర్మించాడు. ఈ రోజు అవి అకన్ పల్లి, మాన్సన్ పల్లి, సుభాన్ పల్లిలుగా మారిపోయాయి. అక్కన్న మాదన్నలు ఈ ప్రాంతంలో 108 దేవాలయాలు కట్టించారట. అందులో ఒకటి మాంఖాల్ మహేశ్వరంలోని రాజరాజేశ్వరాలయం. ఇదే కాక మహంకాళి అమ్మవారికి ఇంకొక గుడి కూడా ఉండేది.




మహేశ్వరంలో అక్కన్న పూజించిన కోదండ రామాలయం, శివగంగ, విష్ణుగంగ అనే కోనేర్లు, వీరమ్మ కుంట అనే చెరువు, వారే కట్టించిన ఒక పెద్ద కోట ఉండేవి. ఇక్కడే కాక పొరుగునే ఫకీర్ గుడాలో హనుమాన్ దేవాలయాన్ని కూడా కట్టించారు.
అక్కన్న మాదన్న, తానీషాల యుగం దక్షిణాదిన హిందూ, ముస్లిం సమైక్యతకు ఆకాశమంత ఆధారం. రాజు ముస్లిం. మంత్రులు హిందువులు. పాలనా యంత్రాంగమంతా హిందువుల చేతుల్లోనే ఉండేది. నేడు రంగారెడ్డి జిల్లాగా పిలుచుకునే ప్రాంతమంతా మందిరాలు, మఠాలతో విలసిల్లేది. ప్రజలు సుఖంగా ఉండేవారు.
ఢిల్లీలో మతమౌఢ్య మొగలు పాదుషా ఔరంగజేబుకు ఈ హిందూ, ముస్లిం సమైక్యత గిట్టలేదు. పైగా అక్కన్న మాదన్నల ప్రోత్సాహంతో తానీషా "హిందవీ స్వరాజ్" నిర్మాత, మరాఠా మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజుతో స్నేహం చేశాడు. ఔరంగజేబు ఆటకట్టు చేసేందుకు శివాజీని గోల్కొండకు ఆహ్వానించాడు. శివాజీ గౌరవార్థం గోల్కొండ దక్షిణ ద్వారంపై శివాజీ చిత్రాన్ని కూడా గీయించాడు.
గోల్కొండలో కొన్నాళ్లు ఉన్న శివాజీ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలాన్ని దర్శించుకునేందుకు పరిజనంతో పాటు బయలుదేరాడు. ఆ సమయంలో మాంఖాల్ మహేశ్వరం, జిన్నాయిగూడం నర్సింహస్వామి దేవాలయం కూడా దర్శించుకున్నాడు. జిన్నాయిగూడెంలో శివాజీ ఒక కోటను కూడా కట్టించుకున్నాడు. ఆ కోట అవశేషాలు ఇప్పటికీ ఉన్నాయి.
శివాజీ చనిపోయిన అనంతరం ఔరంగజేబు గోల్కొండపై దాడిచేశాడు. అక్కన్న మాదన్నలను చంపించాడు.




మాదన్నల యుగం అంతరించింది.
మతోన్మాదన్నల యుగం మొదలైంది.
హిందువులపై అణచివేత మొదలు పెట్టాడు. తన సైన్యంతో పరిసరప్రాంతాల్లోని గుడులన్నిటినీ ధ్వంసం చేశాడు. కోటలోని కోదండరామాలయం ధ్వంసమైపోయింది. శివాలయం నాశనమైపోయింది. శివలింగాన్ని భక్తులు చెరువులో దాచేశారు. కోటలో ఒక మసీదు ఏర్పడింది. కొంతభాగం నిజాముల కొత్వాలీ (ఆఫీసు) గా మారిపోయింది.

* * *

అప్పటి నుంచి ఆ ఊరు పేరుకే మహేశ్వరం... ఊళ్లో మహంకాళి గుడి ఉంది. మహేశ్వరుడు లేడు. ... అమ్మవారు అయ్యగారి కోసం తపస్సు చేస్తున్నట్టు ఒంటరిగా ఉండేది. ఊరు ఏదో కోల్పోయినట్టు పడుండేది. భర్త కోసం ఆమె తపిస్తూంటే బిడ్డల్నెవరు పట్టించుకుంటారు మరి?
నాలుగు వందల యాభై ఏళ్ల తరువాత శంకర్ మాస్టర్ కలలోకి వచ్చి తానున్నానని చెప్పేదాకా అమ్మవారు, అయ్యగారు మళ్లీ కలుసుకోలేదు. ఆ తరువాత నుంచి మాంఖాల్ మహేశ్వరం కళే మారిపోయింది. ఊరు కళకళలాడుతోంది.
గుడిలో కింది అంతస్తులో రాజరాజేశ్వరీ దేవి, పై అంతస్తులో జలగంగేశ్వరుడు కొలువుంటారు. ఒక్కసారి వేలాది మంది స్నానం చేసేంత పెద్ద కోనేరులో గుడి ఉంది. చుట్టూ పదహారు శివాలయాలున్నాయి. చాలా మటుకు ఇంకా జీర్ణావస్థలోనే ఉన్నాయి. నెమ్మదినెమ్మదిగా పునర్నిర్మాణం సాగుతోంది.

గుడికి కొద్ది దూరంలోనే గఢి .......
గఢిలో రాముడు లేని గుడి ..........
ఒక మూలన అమ్మవారి చిన్న గుడి ..........
ఆ పక్కనే గఢిలో అలనాటి మసీదు ..........
ఇంకోపక్క గఢిలోనే జిల్లాపరిషత్ స్కూలు ...........
ఆ పక్కనే పంచాయతీ ఆఫీసు .....
శతాబ్దాల క్రితం నాటి చరిత్రకు మూగసాక్షులుగా కనిపిస్తూంటాయి.




ఒక్క క్షణం కళ్లు మూసుకొండి. ....

వందల ఏళ్ల నాటి సైనికుల కత్తుల ఖణఖణలు...
గుర్రాల గిట్టల చప్పుళ్లు...
శతఘ్నుల భీకర శబ్దాలు...
భీతావహ జనావళి ఆర్తనాదాలు వినిపిస్తాయి....

ఇంకొంచెం వెనక్కి వెళితే ...
గుర్రాలపై అక్కడ తిరుగాడిన అక్కన్న మాదన్నలు...
వారి తండ్రి భానోజీ పంతులు....
ఛత్రపతి శివాజీ, ఆయన మరాఠా సేనల హరహర మహాదేవ నినాదాలు కళ్ల ముందు బొమ్మ కడతాయి...

ఇంకొంచెం వెనక్కి వెళితే ...
కోదండ రాముడి గుడిలో గంటల గణగణలు...
అమ్మవారి గుడి ముందు పోతరాజుల విన్యాసాలు....
మహేశ్వర మందిరంలో ప్రణవనాదాలతో వాతావరణం నిండిపోతుంది....
మనసు గుడి మహేశ్వరుడికి అంకితమైపోతుంది....

* * *

మహేశ్వరం నుంచి తిరిగివచ్చేటప్పుడు గుడి ముందు ఒక చిన్న విగ్రహం ఉంటుంది.
దాన్ని చూడటం మరిచిపోకండి.
అది మహేశ్వరుడిని, మహంకాళిని మళ్లీ కలిపిన శంకర్ మాస్టారు విగ్రహం.
టి. శంకర్ ఖత్రి మాస్టర్ .... 2003, సెప్టెంబర్ 18 న అమ్మ మహంకాళి, అయ్య మహేశ్వరుడి ఒడిలోకి ఒదిగిపోయారు.....

2 comments:

  1. very good post.. unbelievable.. fantastic

    ReplyDelete
  2. మీ బ్లాగ్ చదువుతుంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంటుంది నాకు. చరిత్ర, వ్యక్తిత్వం, పరిశోధన, వర్తమానం, దేశభక్తి లాంటి వాటితో పాటు ఇంకా మీఋ రాస్తున్న చాలా విషయాలు నేటి యువతకు ఎంతో అవసరమయినవి.

    ధన్యవాదములు

    ReplyDelete

Pages