అనగనగా ఒక ఆశ్రమం. అక్కడ పరమాత్మ సాక్షాత్కారానికి ఒక తపోమార్గాన్ని గురువుగారు ఆవిష్కరించారు.
తపస్సు చేయడంలో కఠినాతికఠిన నియమాలుండేవి. నిత్యం తపస్సులోనే ఉండాలి. ఏడాది ఒకే ఒక్కసారి మాట్లాడే అవకాశం వస్తుంది. అదీ రెండంటే రెండు మాటలే మాట్లాడాలి. ఆ తరువాత మళ్లీ మాట్లాడాలంటే ఏడాది ఎదురు చూడాల్సిందే.
ఒకాయన ఈ తపోమార్గంలో వెళ్లాలని ఆశ్రమంలో చేరాడు.
చేరనైతే చేరాడు కానీ కొద్ది రోజుల్లోనే ఇది చాలా కఠినమయమైన జీవితమని అనిపించింది. ఆయనకు చాలా ఇబ్బందిగా అనిపించింది.
ఏడాది తరువాత ఆయనకు రెండు మాటలు మాట్లాడే అవకాశం వచ్చింది.
బాగా ఆలోచించి... ఆలోచించి గురువు గారితో ఆ రెండు మాటలూ చెప్పాడు.
"నిద్ర.... ఇబ్బంది"
గురువుగారు మౌనంగా తల పంకించాడు.
మళ్లీ ఏడాది గడిచింది. ఈ సారి తన వంతు రాగానే ఆ వ్యక్తి గురువు గారితో ....
"అన్నం.... అధ్వాన్నం" అన్నాడు.
గురువుగారు మళ్లీ తలపంకించారు.
ఇంకో ఏడాది గడిచిపోయింది. ఈ సారి ఆ వ్యక్తి రెండే రెండు మాటలు చెప్పాడు.
"రాం... రాం"
ఆ తరువాత ఆశ్రమం వదిలి పారిపోయాడు.
మూడేళ్లయినా చిన్న చిన్న కష్టాలపైనే బుర్రపెట్టి అమూల్య సమయాన్ని తపస్సుకు కేటాయించకపోవడం పెద్ద తప్పు.
ఈ తరహా జీవితానికి పనికిరానని మానసికంగా గుర్తించినా, "రాం ... రాం" అనడానికి మూడేళ్లు తీసుకోవడం మరింత పెద్ద తప్పు.
ది ఓన్లీ హోప్
పడవ ప్రమాదంలో చిక్కుకుంది.
అలల తాకిడికి భయంకరంగా అటూ ఇటూ ఊగుతోంది.
విపరీతమైన గాలులు వీస్తున్నాయి... చూస్తూ చూస్తూనే తుఫాను ముంచుకొచ్చింది.
పడవలో వారంతా ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఉన్నారు.
ఒక ప్రయాణికుడు మాత్రం బిగ్గరగా ఏడుస్తూ పెడబొబ్బలు పెట్టనారంభించాడు.
"బాబోయ్ ... ఈ దిక్కుమాలిన పడవ ఎక్కానురోయ్... ఇది ఎందుకూ పనికిరాదు... ఇక్కడ నాకు రక్షణేది" అని అరవ సాగాడు.
వారి అరుపుల వల్ల ఇతరులకూ భయం పట్టుకుంది.
పడవ సరంగు అది చూశాడు.
ఒక్క ఉదుటున ఆ వ్యక్తికి తాడు కట్టి, నీళ్లలోకి విసిరేశాడు.
వాడు అయ్యో కుయ్యో అంటూ కేకలు వేశాడు. కాపాడండి... కాపాడండి అంటూ అరిచాడు. సరంగు నెమ్మదిగా తాడు లాగి వాడిని పడవలోకి తీసుకొచ్చాడు.
ఈసారి వాడు ఉలుకూ పలుకూ లేకుండా ఒక మూలన కూచున్నాడు.
"ఇప్పుడు అర్థమైందా నీకు రక్షణ ఎక్కడుందో? ఎంత ప్రమాదంలో ఉన్నా ఈ పడవే నీకు దిక్కు..."
No comments:
Post a Comment