ఆయన ఇంకేం చేయలేదు.... - Raka Lokam

ఆయన ఇంకేం చేయలేదు....

Share This



ఆర్ ఎస్ కార్యకర్తల సమాధి పైన " ఈయన ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవక్. ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవక్ గానే చనిపోయాడు" అని రాసి ఉంటుంది. అంతకు మించి ఇంకేమీ చేయరు -

ఆరెస్సెస్ పై అలక వహించిన సమయంలో స్వాతంత్ర్యవీర్ సావర్కర్ తూష్ణీంభావంతో అన్న మాటలివి.

కానీ ఆరెస్సెస్ స్వయంసేవకులు నిజంగా ఇలాగే బతుకుతారు. ఇలాగే వెళ్లిపోతారు. వారి గురించి వ్రాయాలనుకుంటే చెప్పేందుకు ఏమీ ఉండదు. పేజీలకు పేజీల బయోడేటా ఉండదు. డిగ్రీలు, బిరుదులూ, పదవులూ ఉండవు. జీవితమంతా పనిచేసిన వారికి సంబంధించిన ఫోటో ఒక్కటి దొరకదు. చాలా పెద్ద పెద్ద కార్యకర్తల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఇంకా తమాషా ఏమిటంటే ... మన జీవితాలను చాలా ప్రభావితం చేసి, మనకు ఒక దశ, దిశ కల్పించిన వారి పేరు, కుటుంబం, నేపథ్యం వంటి కనీస వివరాలు కూడా దొరకవు.

అసొంలో నాకు మిత్రుడైన ఒక ప్రచారక్ (జీవితమంతా ఆరెస్సెస్ కే అంకితం చేసిన వ్యక్తి) ని ఉల్ఫా ఉగ్రవాదులు చంపేశారు. ఆయన ఫోటో ఎక్కడా లేదు. ఆయనది మహారాష్ట్ర. ఎలాగోలా ఇంటికి ఫోన్ చేస్తే బాల్యంలోని ఫోటోలు దొరికాయి తప్ప ఆయన లేటెస్టు ఫోటో లేదు. ఆయన పేరిట పాస్ బుక్కు లేదు. అకౌంటు లేదు. చివరికి వెతకగా వెతకగా ఆయన డ్రైవింగ్ లైసెన్సులో ఆయన పాస్ పోర్టు సైజు ఫోటో దొరికింది. ఆయన ముఖం మీద ఆర్ టీ ఐ ఆఫీసర్ సంతకమూ, స్టాంపూ ఉన్నాయి. వాటి వెనకాల ఆయన కళ్లద్దాలు.... వాటిలోనుంచి ఆయన కళ్లూ మాత్రం కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఆయన ఫోటో కావాలంటే ఇదొక్కటే దొరుకుతుంది.

ఆర్ ఎస్ ఎస్ అంటే రెడీ ఫర్ సెల్ఫ్ లెస్ సర్వీస్ అని ఒక పెద్దాయన అన్నారు. ఆరెస్సెస్ కార్యకర్తల జీవితం నిజంగా ఇంత సెల్ఫ్ లెస్ గానే ఉంటుంది.

కానీ ఆ కార్యకర్తలతో గడిపిన కాలం, వారి జీవన శైలి, జీవితమంతా కర్పూర హారతి పడుతున్నా నవ్వుతూ, జోకులు వేస్తూ, తాము అతి సామాన్యులమన్నట్టుగానే బతికి వెళ్లిపోయిన వైనం, మనకు తెలియకుండానే మన జీవితాలను ఆసాంతం మార్చేసిన విధానం మాత్రం బతికున్నంత కాలం మరిచిపోలేం.

ఇలాంటి వ్యక్తే తూములూరి లక్ష్మీనారాయణ గారు.

ఎవరీయన?

ఆయన జర్నలిస్టు. ఆరెస్సెస్ పత్రిక జాగృతికి సంపాదకులుగా పనిచేశారు. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికల్లోనూ పనిచేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక పాత్రికీయ శిక్షణ నిమిత్తం ఎంపిక చేసిన అరుదైన జర్నలిస్టుల్లో ఆయనా ఒకరు.

అంతేనా....

ఆయన ఎండోమెంట్స్ చట్టాలను అధ్యయనం చేసినంతగా ఈ దేశంలో ఇంకెవరూ చేయలేదు. దేశమంతటా పర్యటించారు. దేశమంతటా పనిచేశారు. జీవితమంతా పనిచేశారు. విశ్వహిందూపరిషత్ కి వెన్నెముకగా నిలిచారు. తెలుగునాట విహెచ్ పీ పనిని పెంచి పోషించారు. మఠాలకు పరిమితమైన స్వాములను ఆశ్రమాలనుంచి బయటకి తెచ్చారు. సమాజం కోసం పనిచేసేలా చేశారు.

అంతేనా....

కానీ తూములూరి లక్ష్మీనారాయణ గారంటే గుర్తుకు వచ్చేది ఆయన చిరునవ్వు, ఆయన చలాకీ మాటలు, ఆయన ఆశావాదం. చివరిదశలో విజయవాడలో ఉన్నప్పుడు కూడా ఆయనలో అదే ఆశావాదం కనిపించింది. అన్నిటినీ మించి ఆయన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్త. బాల్యం నుంచి చివరి ఘడియల వరకూ ఆయన ఆరెస్సెస్ స్వయంసేవక్. వేలాది మంది కార్యకర్తలను తయారు చేశారు. వారికి జీవనధ్యేయాన్ని, ఆజీవన మార్గాన్ని అందించారు.

పైగా ఆయన పనిచేసింది ఆషామాషీ సమయం కాదు. ఆరెస్సెస్ వాడిని అని చెప్పుకుంటే అష్టకష్టాలు పడాల్సిన రోజులవి. మొత్తం సమాజం ఖాకీ నిక్కరుగాళ్లని ఆరెస్సెస్ వారిని వెక్కిరించి వేళాకోళం చేసే కాలం అది. ఆర్ధిక ఇబ్బందులు, అవమానాలు, ఒత్తిడులు, ఇక్కట్ల మధ్య కూడా నమ్మిన ధ్యేయానికి కట్టుబడి నిలిచి పనిచేయాల్సిన పరీక్షా ఘడియలవి.

సావర్కర్ తూష్ణీంభావంతో చెప్పినా.... అక్షరాలా నిజం చెప్పారు.

ఆర్ ఎస్ కార్యకర్తల సమాధి పైన " ఈయన ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవక్. ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవక్ గానే చనిపోయాడు" అని రాసి ఉంటుంది. అంతకు మించి ఇంకేమీ చేయరు.

తూములూరి లక్ష్మీనారాయణ గారి విషయంలో కూడా ఇదే అక్షరాలా నిజం.

ఎందుకంటే ఆయన అచ్చమైన ఆరెస్సెస్ స్వయంసేవక్.

(శనివారం నాడు సుదీర్ఘ అనారోగ్యం తరువాత కన్నుమూసిన తూములూరి లక్ష్మీనారాయణ గారికి నివాళిగా)

1 comment:

  1. తూములూరి లక్ష్మీనారాయణ రచన "నిత్యసాధన చంద్రిక" విషయమై వెదుకుతూ మీ బ్లాగుకి రావటం జరిగింది. ఆ పుస్తకం ప్రతుల కోసం చూస్తున్నాను. ఈ నివాళికి నా వంతు కలుపుతున్నాను.

    ReplyDelete

Pages