గురువు చెబుతున్నాడు...
శిష్యుడు వింటున్నాడు....
"ఒక ఊరిలో ఒక ధనిక వ్యాపారి అద్భుతమైన భవనాన్ని కట్టించాడు. పాలరాతి ఫ్లోరింగ్, అందమైన గవాక్షాలు, అద్భుతమైన నగిషీలు, కళ్లు మిరుమిట్లు గొలిపే అలంకరణలు... ఇలా ఏ కోణం నుంచి చూసినా ఆ భవనానికి సాటిలేదు"
శిష్యుడు ఆసక్తిగా వింటున్నాడు.
" ఆ ఇంట్లో మాత్రం కుక్కలు, గాడిదలు, పందులు, ఎలకలు నివాసముంటున్నాయి. ఇల్లు పాడుబడిపోతోంది"
" ఆ ఇంటికి కాపలా లేదేమో"
"అవును నాయనా... అదే నిజం"
"ఇంతకీ ఆ ఇల్లు ఎక్కడుంది గురువుగారూ" ఉండబట్టలేక శిష్యుడు అడిగేశాడు.
"మన శరీరమే ఆ భవనం నాయనా. దీనికి ఎనలేని అందం ఉంది. అన్ని అవయవాలు, ఎన్నో వ్యవస్థలూ ఉన్నాయి. కానీ కాపలా సరిగ్గా లేదు. అందుకే కామమనే కుక్క, క్రోధమనే గాడిద, లోభమనే పంది, మోహమనే ఎలకా ఈ దేహ భవనంలో కాపురం చేస్తున్నాయి."
"మరి కాపలాదారుడెవరు గురువుగారూ"
"ఆత్మసాక్షి నాయనా"
చిలక మాట్లాడింది!
ఒంటరితనం పోగొట్టుకోవడానికి ఒకతను మాట్లాడే చిలుకను కొనుక్కొని వచ్చాడు.
ఆ మర్నాడు అతను నీరసంగా దుకాణానికి తిరిగివచ్చాడు.
"ఈ చిలుక అస్సలు మాట్లాడటం లేదు" అని చెప్పాడు.
"అరే... చిలక మాట్లాడి తీరాలే.... ఒక పనిచేయండి. ఈ బుల్లి నిచ్చెన తీసుకువెళ్లండి. పంజరంలో పెడితే దీనిపైకి చిలక ఎక్కుతుంది. హాయిగా మాట్లాడుతుంది" అన్నాడు దుకాణదారు.
ఆ మరుసటిరోజు వ్యక్తి మళ్లీ తిరిగి వచ్చాడు.
"ఈ రోజూ చిలక మాట్లాడలేదు"
"అలాగా... అయితే ఈ అద్దం తీసుకువెళ్లండి. నిచ్చెన ఎక్కి, అద్దంలో తనను తాను చూసుకుని చిలక మాట్లాడుతుంది"
ఆ మరుసటి రోజు వ్యక్తి మళ్లీ హాజరు.
"చిలక ఎగిరిపోయింది"
"అయ్యో...ఒక్క మాట కూడా మాట్లాడలేదా?"
"మాట్లాడింది"
"ఏం మాట్లాడింది?"
"మూర్ఖుడా... ఇన్ని కొంటావు కానీ ఒక జాంపండు కొనాలన్న తెలివి లేదా? "
హాట్సఫ్ సర్ మనిషి దేహాన్ని పోల్చిన తీరు నాకు బాగా నచ్చింది.నేను మొదటగా ఇది చిన్న టైంపాస్ కథ అనుకున్నాను.నేను ఆ శిష్యుని స్థానంలో ఉండి ఎంటా అని ఆలోచించాను పూర్తిగా చదివితేగాని అందులోఅర్ధం తెలియలేదు.ఒక మంచి సత్యం చెప్పినందుకు కృతజ్ఞతలు గురువుగారు ......
ReplyDelete