ఐరేంధ్రి...శూన్యమ్మ...అనగనగా ఓ రాజ్యం - Raka Lokam

ఐరేంధ్రి...శూన్యమ్మ...అనగనగా ఓ రాజ్యం

Share This



అనగనగా ఓ రాజ్యం .

దాని పేరు వెలుతురు రాజ్యం.

కానీ ఆ రాజ్యమంతా చీకటే. ఎందుకంటే దాన్ని "అనగనగా ఓ ధీరుడు"లోని ఐరేంధ్రి లాంటి ఓ దుష్ట రాణి పరిపాలించేది. ఆమెకో దుష్ట సంతానం. ఆ బుల్లి యువరాజు మరింత దుష్టుడు. వాళ్ల అవినీతి, దోపిడి, అత్యాచారం, సర్వ భ్రష్టత్వం నాలుగు కాదు...నాలుగొందల పాదాలపై జెర్రి గొడ్డుల్లా పరుగులు తీసేవి.

ఐరేంధ్రి, బుల్లిదుష్టుడి పాలనకి అంతమే లేదేమోననిపించింది. ఈ చీకటి ఇక తెలవారదేమోననిపించింది.

అంతలో అడవిలో నుంచి ఒక యోగి వచ్చాడు. చీకటి తొలగాలంటే చిరుదివ్వెలు వెలిగించమన్నాడు. జనం అదే చేశారు. దాంతో ఐరేంధ్రికి అక్కడెక్కడో మండింది....వెలుతురును అస్సలు భరించలేకపోయింది. ఆ యోగిపేరు జయప్రకాశయోగి. ఆ యోగి సమాజంలో పూర్తి మార్పు కావాలని పిలుపునిచ్చాడు. అదే సంపూర్ణ విప్లవం అన్నాడు. ధైర్యం వచ్చిన ప్రజలు కాగడాలు వెలిగించారు. ఐరేంధ్రి, ఆమె కొడుకూ కలుగులోకి దూరిపోయారు.

అంతలో వెలుతురు రాజ్యం లోని విహార పరగణాలో విప్లవం వచ్చేసింది. లక్షలాది జనం వీధుల్లోకి వచ్చారు. ఇటు పశ్చిమాన ఉన్న సురాష్ట్ర ప్రాంతంలో చీకటిపై పోరాడుతూ 113 మంది ప్రాణాలు ఇచ్చేశారు. అక్కడ ప్రజా విప్లవానికి బెదిరి సుబేదారు సీటువదిలి పారిపోయాడు.

ఐరేంధ్రి బెంబేలెత్తిపోయింది. మంత్రదండం పట్టుకున్న చేతులు వణకడం మొదలుపెట్టాయి. ఎక్కడికక్కడ జనం ప్రవాహమై, ప్రభంజనమై, పతాకాలై వచ్చేస్తున్నారు. ఇక తన పని ఖతం అనుకుంది. చివరి ఆశగా మంత్రాల పుస్తకం తెరిచింది. అందులో ఓ మంత్రం కనిపించింది. దాన్ని పఠించింది.

మరుక్షణంలో అత్యవసరుడనే అతిబల రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు.

"ఐరేంధ్రీ ...ఏమిటి నీ ఆజ్ఞ" అన్నాడు.

"ఈ వెలుతురును ఖతం చేసేయ్"

"ఆ పని చేసేస్తా ఐరేంధ్రీ...కానీ రెండున్నరేళ్లలోపు అందర్నీ ఖతం చేసేయాలి. లేకపోతే నా చీకటి పరదా చినిగిపోతుంది...గుర్తుంచుకో" అంటూ రాక్షసుడు మాయమైపోయాడు.

అక్కడ్నుంచీ అత్యవసరంగా మొదలైంది చీకటి రాజ్యం. జయప్రకాశ యోగితో సహా అందర్నీ కారాగారంలోకి తరలించారు. అసలు రాజ్యాన్నే జైలుగా మార్చేశారు. భజన బృందం చీకట్లోనే ఐరేంధ్రి భజన సాగించింది. కొవ్వొత్తులు, ప్రమిదలు, లాంతర్లను పూర్తిగా నిషేధించేసింది ఐరేంధ్రి.

కానీ ప్రజలు మిణుగురు పురుగుల్ని పోగు చేసుకున్నారు. అవి వెలుతురు నిచ్చాయి.

ఐరేంధ్రి మిణుగురులను ఖతం చేయమంది...

ప్రజలు ఆకాశంలో నక్షత్రాల నుంచి వెలుతురు పొందడం మొదలుపెట్టారు...

ఐరేంధ్రి ఆకాశానికి పరదాలు వేయించింది. కానీ పరదాలకు కన్నాలు పెట్టారు ప్రజలు....కొద్దికొద్దిగానైనా వెలుతురు కనిపించసాగింది.
ఇటు భజన బృందం ఏ రోజుకారోజు ఐరేంధ్రిపై కొత్త కొత్త శ్లోకాలు...స్తోత్రాలు వ్రాసి పాడటం మొదలుపెట్టింది. ఐరేంధ్రి కూడా వాటిని నమ్మడం మొదలుపెట్టింది. ఇక తనకు ఎదురులేదని అనుకుని ప్రజల నుంచి పొగడ్తలు పొందేందుకు బయలుదేరింది. కానీ నక్షత్రాల వెలుగులో ప్రజలు ఆమెను గుర్తించారు. మంత్రదండం లాగేసుకున్నారు. జుట్టు పీకేశారు. వీరంగం వేయబోయిన బుల్లి దుష్టుడిని ఉతికి ఆరేశారు. పరదాలు చినిగిపోయాయి. వెలుతురు మళ్లీ వచ్చేసింది.

ఐరేంధ్రి తన మంత్రశక్తులను సప్తసముద్రాలకు అవతల ఉన్న శ్యూన్యమ్మ అనే మరో మంత్రగత్తెకి ఇచ్చేసింది. ఆమెను కోడలిగా చేసుకుంది. శూన్యమ్మకి రౌల్ అనే బిడ్డడున్నాడు. వాడూ మహాదుష్టుడే.

ఇటు ప్రజలు నెమ్మదిగా ఐరేంధ్రిని మరిచిపోయారు. ఆమె చీకటి పాలననూ మరిచిపోయారు. అప్పుడు శూన్యమ్మ వెలుతురు రాజ్యంలోకి వచ్చి కొన్ని కీలుబొమ్మల్ని తయారు చేసింది. వాటిని ముందుంచి మాటలు చెప్పకుండా, మీటలు నొక్కుతూ పాలన సాగించింది. మళ్లీ చీకటి పాలన మొదలైంది. అవినీతి అరువేల పాదాలతో పాకసాగింది. కొత్త శక్తితో నానాటికీ ఆకాశమంత పెరగసాగింది. వేల కోట్లు, లక్షల కోట్లు గుటకాయస్వాహా అవడం మొదలైంది. ఆ ధనమంతా సప్త సముద్రాలకవతల చెట్టుతొర్రలో ఉన్న రహస్యస్థావరానికి తరలిపోయింది. ప్రజలను దారి తప్పించేందుకు శూన్యమ్మ దీపాలను సైతం కొనేయడం మొదలుపెట్టింది. అవి తెల్లని వెలుతురునివ్వమంటే రంగురంగుల వెలుతురునిచ్చి పిచ్చెక్కించాయి. ఇక కీలుబొమ్మల్ని నెమ్మదిగా విరిచేసి, రౌలును రాజ్యమెక్కించాలని పథకం వేసింది. రాజ్యంలోని చివరి బంగారునాణాన్ని సైతం చెట్టు తొర్రలోకి తరలించేందుకు సిద్ధమైంది.

ఐరేంధ్రి శూన్యమ్మ అయితే జయప్రకాశ యోగి కూడా రామభగవాన యోగి అనే రూపం ఎత్తాడు. జనం గుర్తించకపోయినా శూన్యమ్మ యోగిని గుర్తించింది. అందుకే భయపడింది...బెంబేలెత్తింది....భటుల్ని పంపించింది....బాదిచంపమని ఆజ్ఙాపించింది. జనం కూడా మేల్కొన్నారు. రంగు దీపాలను పక్కనబెట్టి టార్చిలైట్లను వెలిగించుకుంటున్నారు. శూన్యమ్మ కంగారు మరింత పెరిగింది. తన మంత్రులు సిబ్బలుడు, చెత్తంబరుడు వంటి వారిని "చీకటి మళ్లీ రప్పించండి" అంటూ పురమాయించింది.




ఇక్కడి వరకూ జరిగిన కథ!!

శూన్యమ్మ అత్యవసర రాక్షసుడిని పిలిపిస్తుందా?

చీకటిని రప్పిస్తుందా?

కాగడాలు, కొవ్వొత్తులు, ప్రమిదలు, లాంతర్లను, ఆఖరికి నేలమీది మిణుగురులను, ఆకాశంలోని తారలను, చివరికి టార్చిలైట్లను కూడా నిషేధిస్తుందా?

భజన బృందం ఎప్పట్లాగే కొత్త శతకాలు రాసి పాచిపాటలు పాడేస్తుందా?

రామభగవాన యోగికి జైలు తప్పదా?

మళ్లీ రాజ్యమంతా జైలుగా మారిపోతుందా?

ఇవన్నీ వెలుతురు రాజ్యపు వెండితెరపై చూడాల్సిందే...అయితే ముగింపు మాత్రం జనం చేతుల్లోనే ఉంది....

ఒక్కమాట మాత్రం నిజం...ఈ సారి అత్యవసరుడి చీకటి పరదాకి అన్నీ చిల్లులే...రెండున్నరేళ్లు కాదు సరికదా రెండు రోజులు కూడా ఉండటం కష్టం!!!!


(ఐరేంధ్రికి వ్యతిరేకంగా జయప్రకాశ యోగి పోరాటం జూన్ 5, 1975లో మొదలైంది. రామభగవాన యోగి తిరుగుబాటు కూడా జూన్ 5నే మొదలైంది. మధ్యలో 36 ఏళ్ల గ్యాప్ ఉంది....కథ ఒక్కటే...రెండోది మొదటిదాని 2.0 వెర్షన్ మాత్రమే)

3 comments:

  1. కథలో చాలా నఛ్చింధి...పేర్లు....శూన్యయమ్మ,రౌలు,సిబ్బలుడు,ఛెత్తంభరుడు...నీ ఊహకి జొహరులు

    ReplyDelete
  2. ఐరెంద్రి అనే కన్నా.. ఇరెంద్రి... అంటే సూట్ అవుతుంది...

    ReplyDelete

Pages