ఒక్కడంటే ఒక్కడు.....!!! - Raka Lokam

ఒక్కడంటే ఒక్కడు.....!!!

Share This

ఒక్కడంటే ఒక్కడు.....!!!
ఆయన పేరు లాంబిస్ ఎంగ్లెజోస్. ఆయనో స్కూల్ టీచర్....బడిలో పిల్లలకు పాఠాలు చెప్పుకునే వాడు. తనూ, తన స్కూలూ, తన సంసారం, తన సమస్యలూ ...ఇదే ఆయన లోకం. అందరు బడిపంతుళ్ల లాగానే ఆయనా....
కానీ....చరిత్ర పాఠాలు చెబుతూ చెబుతూ ఆయన చరిత్రలోతుల్లోకి వెళ్లిపోయేవాడు. మొదటి ప్రపంచ యుద్ధం నాటి సంఘటనల్లోకి వెళ్లిపోయేవాడు. 1914 నుంచి జరిగిన మొదటిప్రపంచ యుద్ధానికి తన దేశమైన ఆస్ట్రేలియాకి ఓ విచిత్ర సంబంధం ఉంది. ఆస్ట్రేలియన్ సేనలు ఖండాంతరాలు దాటి పాల్గొన్న మొట్టమొదటి యుద్ధం అది. అంతే కాదు....ఆ యుద్దంలో ఓ చీకటి ఘట్టమూ ఉంది. ఆ చీకటి ఘట్టాన్ని ఆస్ట్రేలియా చరిత్రలోని చీకటి 24 గంటలు అంటారు. ఎందుకంటే జర్మన్ల చేతిలో 5533 మంది ఆస్ట్రేలియన్ సైనికులు చనిపోయింది ఆ ఇరవై నాలుగు గంటల్లోనే. 1916 జులై 19, 20 తేదీల్లో ఆ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగింది యూరోప్ లోని ఫ్రాన్స్ ఉత్తర భాగంలోని ఫ్రమెలెస్ అనే చిన్న గ్రామంలో.....అక్కడ చనిపోయిన సైనికుల వివరాలు లేవు...వారి సమాధులెక్కడున్నాయో తెలియదు. కొద్ది మంది సమాధులు దొరికాయి కానీ చాలా మందిని ఏం చేశారో కూడా ఎవరికీ తెలియదు. 96 ఏళ్ల క్రితం జరిగిన యుద్ధం గురించి ఎవరికీ పట్టలేదు.
నిజానికి ఫ్రమెల్లెస్ యుద్ధం ఓ భయంకర వ్యూహాత్మక తప్పిదం. ఫ్రమెల్లెస్ కి సరిగ్గా 80 మైళ్ళ దూరంలో సోమె అనే చోట జర్మన్లకు మిత్ర రాజ్యాలకు మధ్య భీకరమైన పోరు చెలరేగుతోంది. ఆ యుద్ధం నుంచి జర్మన్ల దృష్టిని మళ్లించేందుకు ఫ్రమెల్లెస్ ను చేజిక్కించుకోవాలని మిత్ర రాజ్యాల సేనలు భావించాయి. అందుకే బ్రిటిష్, ఆస్ట్రేలియన్ సేనల్ని ఫ్రమెల్లెస్ ను ఆక్రమించుకొమ్మని ఆదేశాలు జారీ అయ్యాయి. జులై 19 న మిత్ర రాజ్యాల సేనలు ముందుకు సాగాయి. అతి సులువుగా తొలి రక్షణ వలయాన్ని ఛేదించాయి. రెండో రక్షణ వలయం ఛేదించి, అక్కడున్న ట్రెంచిల్లోకి చేరుకోవాలి. కానీ అక్కడే ఊహించని ముప్పు ఎదురైంది. రెండో రక్షణ కవచం చేరుకున్నాక చూస్తే ట్రెంచిలన్నిటా వాన నీరు నిండి ఉంది. కాపాడుకునేందుకు మార్గం లేదు. దాంతో జర్మన్ తుపాకులకు మిత్ర రాజ్యాల సైనికులు ఈజీ టార్గెట్లయిపోయారు.  పదిహేను వందలమంది బ్రిటిష్ సైనికులు, 5533 మంది ఆస్ట్రేలియన్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఊరు కాని ఊరులో, దేశం కాని దేశంలో కత్తికో కండ అయిపోయారు.  వారి శవాలూ దొరకలేదు....సమాధులూ దొరకలేదు....ఆస్ట్రేలియా చరిత్రలో అసువులు బాసిన అమర వీరుల వివరాలే లేవు....
లాంబిస్ కి ఇది తీరని  లోటులా కనిపించింది. మన వాళ్ల వివరాలు తెలియకపోవడం ఏమిటి? మన వారి సమాధులెక్కడ ఉన్నాయో తెలియకపోవడమేమిటి? ఈ ప్రశ్నలు ఆయన్ను వేధించ సాగాయి. బడిపంతులు గిరీ చేసుకుంటూ, తనూ ... తన సంసారం ....అనుకుంటూ ఉండ లేక పోయాడు. ఫ్రమెల్లెస్ ఆయన్ని పిలుస్తున్నట్టు....ఆస్ట్రేలియన్ల ఆత్మలు పలకరిస్తున్నట్టు అనిపించింది.
అంతే...ఖాళీ దొరికితే చాలు ....కాస్త డబ్బులు పోగైతే చాలు ....ఫ్రమెల్లెస్ కి వెళ్లిపోయేవాడు లాంబిస్. అణువణువూ గాలించేవాడు. ఎక్కడో ఒక చోట సమాధులు దొరక్కపోతాయా అని వెతికే వాడు. ఏళ్లు గడిచినా ఫలితం మాత్రం దొరకలేదు...లాంబిస్ పట్టు మాత్రం విడవ లేదు.  హెలీకాప్టర్లను అద్దెకి తీసుకుని ఆ ప్రాంతమంతా ఆకాశ మార్గాన సర్వే చేశాడు....ఫలితం లేదు....ఆ ఊళ్లో రికార్డులన్నీ పరిశీలించాడు....ఫలితం లేదు....పాత తరం వారందరినీ కదిలించి చూశాడు ....ఫలితం లేదు....చివరికి జర్మన్ వార్ రికార్డులను అధ్యయనం చేయడం మొదలు పెట్టాడు. అలా వెతుకుతూంటే జులై 21, 1916 న ఎనిమిది పెద్ద గోతులు తవ్వడానికి, సైనికులను పూడ్చిపెట్టడానికి పనిముట్లూ, పరికరాల కోసం ఫ్రమెల్లెస్ లోని కమాండర్ హెడ్ క్వార్టర్స్ కి రాసిన లేఖ దొరికింది. ఫీజెంట్ వుడ్ అనే అటవీ ప్రాంతంలో గోతులు తవ్వేందుకు అనుమతి కోరుతూ రాసిన లేఖ కూడా దొరికింది. దాంతో ఆయనకు  మిత్ర రాజ్యాల సైనికులను పాతి పెట్టడానికే ఈ గోతులు తవ్వి ఉంటారని అనుమానం వచ్చింది. ఆ తరువాత మళ్లీ ఫిజెంట్ వుడ్ ప్రాంతంలో వెతికాడు.
చివరికి వెతకగా వెతకగా ఫీజెంట్ వుడ్ అడవుల్లో పది మీటర్ల పొడవు, 2.2 మీటర్ల వెడల్పు ఉన్న ఎనిమిది సామూహిక సమాధులు బయటపడ్డాయి. అవి ఆస్ట్రేలియన్లవేనని లాంబిస్ కు నమ్మకం కలిగింది.
ఆ తరువాత నుంచీ ఊరుకాని ఊరులో, దేశం కాని దేశంలో అజ్ఙాత ఆస్ట్రేలియన్ వీరులకు సగౌరవంగా, సైనిక మర్యాదతో అంత్యక్రియలు నిర్వహించాలని, వారి కోసం మెమోరియల్ ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిన బూనాడు. ఆ నాటి సైనికుల కుటుంబీకులను, వారసులను వెతికి వెతికి పట్టుకున్నాడు. వారిని కూడ గట్టాడు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాడు. ప్రభుత్వం మొదట్లో లాంబిస్ ను పట్టించుకోలేదు. తరువాత విసుక్కుంది....కానీ చివరికి ప్రజాభిప్రాయం ముందు తలొగ్గి, దారికి వచ్చింది.
2007లో ఆస్ట్రేలియా ప్రభుత్వం మెటల్ డిటెక్టర్ సర్వేలు నిర్వహించి సమాధుల్లో ఉన్న లోహపు ముక్కలు ఆస్ట్రేలియన్ సైనికులకు చెందినవే నని రూఢి చేసుకుంది. ఆ తరువాత సైనికుల అవశేషాల డిఎన్ ఎ ను, వారి వారసుల డిఎన్ ఎ సాంపిల్స్ తో మ్యాచ్ చేసి మరీ చూపుకుంది. ఆ తరువాత సైనికుల కోసం అదే ఫ్రమెల్లెస్ లో సమాధులు కట్టించాలని నిర్ణయించింది. దీనికి బ్రిటిష్ ప్రభుత్వం కూడా చేతులు కలిపింది. చివరికి ఈ ఏడాది జులై 19న ఫ్రమెల్సెస్ లో సమస్త సైనిక మర్యాదలతో సైనికులను పునస్సమాధి చేయడం జరిగింది. దీనికి బ్రిటిష్ యువరాజు చార్లెస్ సైతం హాజరయ్యాడు.
నాకెందుకులే అనుకోకుండా ఉద్యమించిన ఒక్కడంటే ఒక్క బక్క బడిపంతులు ప్రయత్నాల వల్ల అటు అస్ట్రేలియా నుంచి యూరప్ దాకా కదిలింది. దేశం కోసం పోరాడిన వారికి గుర్తింపు లభించింది. బెస్ట్ ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్, క్వీన్స్ అవార్డు వంటివి లాంబిస్ ను వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఫ్రమెల్లెస్ అనే చిన్న గ్రామంలో నిర్మాణమైన స్మృతి స్తంభం ఇచ్చినంత సంతోషం లాంబిస్ కి ఇంకేవీ ఇవ్వలేదు...

1 comment:

  1. రాకా,

    చదువుటుంటెనే రొమాలు నిక్కపుడుసుకొచ్హాయంటె నమ్ము....చాలా స్పూర్తిదాయకమైన యదార్థ గాధ.....ఓ సామాన్యమైన బడిపంతులు తీసుకున్న సాహసొపేతమైన స్వాభిమాన నిర్ణయాన్ని సాకరం చేసుకున్న తీరు నిజంగా అభినందనీయం...ఇలాంటి యదార్థ గాధ నీ బ్లాగు ద్వార మా వరకు చేరవెసే నీ ప్రయత్నం కూడా అభినందనీయమే ------నీ శ్రావణ్.

    ReplyDelete

Pages