(విదేశీ) అన్నం బ్రహ్మ (రాక్షసి) - Raka Lokam

(విదేశీ) అన్నం బ్రహ్మ (రాక్షసి)

Share This
డోమినోస్ పిజ్జా....ప్రపంచం మొత్తం మీద 9000 కి పైగా ఔట్ లెట్స్ ఉన్న అతి పెద్ద ఫుడ్ చెయిన్. ఇదొక అమెరికన్ కంపెనీ. ఈ కంపెనీ పిజ్జాలు రాకెట్ స్పీడ్ తో  సేలయ్యే షాపు ఎక్కడుందో తెలుసా?
అమెరికాలో కాదు...యూరోప్ లో కాదు. ఆస్ట్రేలియాలో.
కొనుగోలు దార్లలో ఎక్కువ మంది ఎవరో తెలుసా?
ఆస్ట్రేలియన్లు, న్యూజీలాండర్లు కాదు. భారతీయ మూలానికి చెందిన వారు.
అప్పుడే ఆశ్చర్యపోకండి. ఇంకా చాలా ఉంది.
సెకండ్ హయ్యెస్ట్ సేల్స్ ఇన్ ది వరల్డ్ ఎక్కడో తెలుసా? మన దేశ రాజధాని ఢిల్లీలోని నోయెడా సెక్టర్ 18లో.
మరి మూడో స్థానం.....?
మూడో స్థానం కూడా ఢిల్లీలోనే ఉంది. ఢిల్లీలోని ద్వారకా ఏరియాలో ఉందీ ఔట్ లెట్.
అంతే కాదు...బర్గర్ల సేల్ లో బహుళ జాతి బడా సేఠ్ మెక్డోనాల్డ్ బెస్ట్ సేల్స్ చేసేదీ ఇండియాలోనే. జలంధర్ లోని మెక్డొనాల్డ్ ఔట్ లెట్ ఇండియాలోనే బెస్ట్ సేల్ నమోదు చేస్తోంది. రెండో స్థానం ఢిల్లీలోని ఐఎస్ బిటి ఏరియాలోని మెట్రో రైల్వే స్టేషన్ లో ఉంది.
ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. పిజ్జాల పెను కొనుగోలు దారుగా, మెక్డొనాల్డ్ ఖజానాలు నింపే కల్ప తరువుగా ఉన్నది మేరా భారత్ మహానే. నాలుక దాటే దాకా రుచిని నమ్ముకుని, నాలుక దాటింతరువాత కుప్పెడు కొలెస్టరాల్ గా మారి రక్తనాళాల్లో పేరుకుని, రక్త పోటు, గుండె పోటు రావడానికి కృష్ణ తులాభారంలో తులసీదళమంత గ్యారంటీ గా నిలుస్తున్నాయి ఈ ఫాస్ట్ ఫుడ్ రారాజులు.
దేశంలో ఇప్పటికే 320 డొమినోస్ పిజ్జా దుకాణాలున్నాయి. డొమినోస్ ఏడాదికి 47  శాతం రేటున పెరుగుతోంది. అంతే కాదు....ప్రస్తుతం అమెరికాలో సెకనుకి 350  పిజ్జాలు అమ్ముడవుతున్నాయి. బ్రిటన్ లో 90 శాతం జనాభా వారానికి కనీసం ఒక్క సారి పిజ్జాని చప్పరించేస్తున్నాయి. అంటే ఏడాదికి దాదాపు 46.6 కోట్ల పిజ్జాలు ఖతం అవుతున్నాయన్న మాట. అయితే రాబోయే కొన్నేళ్లలో అమెరికా, బ్రిటన్ల తల దన్ని మరీ మన దేశం ఫాస్ట్ ఫుడ్ మార్కెట్ ను డొమినోస్ డామినేట్ చేసేయబోతోంది.
మన దేశంలో పిజ్జా, బర్గర్లు సూపర్ ఫాస్ట్ హైవేలో పరుగులు తీస్తున్నాయి. సేల్స్ శరవేగంతో సాగుతున్నాయి. పిజ్జా, బర్గర్ల మార్కెట్లో ఏడాదికేడాది 40 శాతం పెరుగుదల ఉంది. ఈ లెక్క చూస్తే మీకు చుక్కలు కనిపించడం ఖాయం. ఫుడ్ ఫ్రాంచైసింగ్ రిపోర్టు ప్రకారం 2001 లో ప్రతి నెలా 15 లక్షల పిజ్జాలు దేశంలో అమ్ముడయ్యేవి. 2008 నాటికి నెలకి 35 లక్షల పిజ్జాలు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అవుతున్నాయి.
మన దేశంలో ప్రస్తుతం ఇంటి బయట తినడానికి ఏటా 32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో సింహభాగం నగరాలు, పట్టణాల్లోనేనని వేరే చెప్పనక్కర్లేదు. ఫుడ్ ఫ్రాంచైసింగ్ రిపోర్టు ప్రకారం మన దేశంలో 35 శాతం మంది ఉద్యోగాలు చేసే ఒంటరిగాళ్లు కనీసం నెలకొక్క సారైనా హోటల్ లో తింటున్నారు. మహా నగరాల్లో కూడా బయట తినడం పెరిగింది. 2003లో నెలకి 2.7 సార్లు బయట తింటే, ఇప్పుడు నెలకి ఆరు సార్లు బయట తింటున్నారు. అంటే ఆరేళ్లలో డబుల్ అయిందన్న మాట. 2008 నాటికే రిటెయిల్ ఫుడ్ సెక్టర్ 70 బిలియన్ డాలర్ల మేరకు వ్యాపారం చేస్తోంది. 2025 నాటికి ఇది పెరిగి పెద్దదై 150 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నది అంచనా. అంటే రాబోయే రోజుల్లో పిజ్జాలు, బర్గర్లు భారీగా బొజ్జల్లోకి వెళ్తాయన్న మాట.
ఇది పిజ్జా, బర్గర్లకే పరిమితం కాదు. ఉప్పుల కుప్పలు, నూనెల తెప్పలూ అయిన కుర్కురేలు, బింగోలు, ఆలూ చిప్స్ , చాకొలెట్స్  తదితర సమస్త ఫాస్ట్ ఫుడ్ ల ను తినడం నానాటికీ పెరిగిపోతోంది.
ఈ హై కొలిస్టరాల్ ఫుడ్ బిపి, షుగర్, కిడ్నీ వ్యాధులు, జీర్ణాశయ సంబంధ వ్యాధులకు రాబోయే రోజుల్లో రాచబాటలు వేయబోతోంది. వ్యాయామాలు తగ్గి, కొలిస్టరాల్ హెచ్చి, అనారోగ్యాలకు అసలు చిరునామాలుగా మారబోతున్నారు మన స్వీట్ ఇండియన్స్. మరో మాటలో చెప్పాలంటే ముందు పట్టణాల్లో, ఆ తరువాత విలేజిల్లో వినాయకులు తయారవుతారన్న మాట. ఒబేసిటీ మన మెగా సిటీలను మింగేస్తుందన్న మాట. మన మారుతున్న లైఫ్ స్టైల్ మన కొంపల్ని ముంచేస్తుందన్న మాట.
వీటన్నిటి అర్థం ఏమిటంటే ఉత్పాదక శక్తి తగ్గుతుంది. మెడికల్ బిల్లులు హెచ్చుతాయి.
అన్నం బ్రహ్మ అనుకునే భారత దేశంలో ఈ విదేశీ అన్నం బ్రహ్మ రాక్షసి కాబోతోంది. మనమంతా పోటాపోటీగా సహనౌ భునక్తు అనుకుని ఫాస్ట్ ఫుడ్ ని చొక్కా లోపలి చెత్తకుండీలో నింపేసుకుంటున్నాం.
కంపు కొట్టడమో, కుళ్లు పుట్టడమో ఖాయం....

2 comments:

  1. Shocking facts!
    One thing is sure, in the UK any sensible human who cares for own health will not go for fast food.
    No wonder in the UK, 'Chicken Tikka Masala' is the favourite dish (now it's infact the National Dish of Britain!)
    As the NHS (the state run) takes care of the health of the people of Britain, it always warns not eat junk food (like Burgers, Pizzas, fizzy drinks, etc)
    Bharat should show the world what health food is, not blindly follow the west to become obese country in the world!

    ReplyDelete
  2. అవును సర్... మనం వాస్తవాలను డైజెస్ట్ చేసుకోలేం కదా...

    ReplyDelete

Pages