మనం ఊహించినట్టే ఇప్పుడు ఎవరూ దాద్రీ గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు చర్చంతా గోమాంసం గురించే. కానీ ఈ మొత్తం చర్చకు మూల కారణం అయిన దాద్రీ ఇప్పుడు చర్చలో లేదు. కేరళ లోకి కాంగ్రెస్ ప్రభుత్వం నేరుగా బిజెపిపై ఆరోపణలు చేయడం, గోమాంసం అమ్మే, తినే హక్కు తమకుందని వాదించడం ఇప్పుడు ప్రధాన వార్త. నేను గోమాంసం తింటానని సిద్దరామయ్య క'ర్నాటకం' చేయడం పెద్ద వార్త.
దాద్రీ ఏమైంది?
అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే దాద్రీ కేసులో దమ్ము లేదు. ఆ ఆరోపణల్లో బలం లేదు. దాని వల్ల ఇక అదనంగా వచ్చే లాభం లేదు. కానీ వివాదాన్ని ఎలాగోలా కొనసాగించాలి. అందుకు కాంగ్రెస్ తన ఇద్దరు ముఖ్యమంత్రులను రంగంలోకి దించింది. "నేను గోమాంసం తింటాను." అని కర్నాటక లోని కాంగ్రెస్ ప్రభుత్వపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. కాల్బుర్గి హత్య వైఫల్యం, గోహత్యను వ్యతిరేకించిన మూడ్ బిద్రి బజరంగ్ దళ్ కార్యకర్త ప్రశాంత్ పూజారీ కిరాతక హత్యను నిలువరించడంలో వైఫల్యాలను చాపకింద తోసేందుకు పూర్తిగా అనవసర వివాదానికి సిద్ధ రామయ్య సిద్ధమయ్యారు. ఇలాగే ఢిల్లీలోని కేరళ హౌస్ లో గోమాంసం వండుతున్నారన్న ఆరోపణలపై ఆ సర్కారీ హోటల్ యజమానులు మాట్లాడటం లేదు. ఏకంగా కేరళ లోకి కాంగ్రెస్ కూటమి ముఖ్యమంత్రి ఊమెన్ చాండీ గరిటె చేత పుచ్చుకుని రంగంలోకి దిగారు. ఎప్పట్లాగో ఒక వర్గం మీడియా ఈ ఇద్దరు భేతాళ ముఖ్యమంత్రులనూ భుజాన వేసుకుంది.
ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులూ సిగ్గుబిళ్లను విసిరేసి గో రాజకీయాల్లో దుంకడం, వారిని గోచీ ఊడుతున్నా మోసేందుకు సిద్ధమౌతున్న ఒక వర్గం మీడియా ల లక్ష్యం సుస్పష్టం. వారి టార్గెట్ మోదీ. వారి లక్ష్యం బిజెపి.
దాద్రీ గురించి ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు?
దాద్రీ విషయాన్నే తీసుకుందాం. ఇప్పుడు అక్కడ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న నిజాలు పాపం, కాంగ్రెస్, కుహనాసెక్యులర్ వర్గాలకు, దురుద్దేశం నరనరానా నిండిన ఒక వర్గం మీడియాకు మింగుడు పడటం లేదు. అక్కడ చనిపోయిన అఖ్లాక్ కుటుంబానికి, పొరుగింట్లో ఉన్న రాహుల్ యాదవ్ కి చాలా కాలంగా గొడవలున్నాయి. రాహుల్ దూడను అఖ్లాక్ దొంగిలించాడన్నది ఆరోపణ. అయితే అఖ్లాక్ పై దాడి జరుగుతున్నప్పుడు అతనిని కాపాడేందుకు హిందువులు వచ్చారు. ఈ వార్తను ఇన్నాళ్లూ దాచినా ఇక దాచడం కష్టమౌతోంది. అఖ్లాక్ ఆ ఊరి రామలీలా కమిటీ సభ్యుడు. ఈ విషయం కూడా ఇక దాచడం ఒక వర్గం మీడియాకి కష్టమౌతోంది. అసలు శాంతి భద్రతల బాధ్యత రాష్ట్రప్రభుత్వానిది. ఆ ప్రభుత్వం పై ఒక్క మాటా ఎందుకు అనడం లేదని ప్రశ్నలు జోరందుకుంటున్నాయి. పైగా దాద్రీకి ఒవైసీ, అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీలను వెళ్లనిచ్చిన అఖిలేశ్ ప్రభుత్వం బిజెపి నేతలను ఎందుకు వెళ్లనివ్వలేదన్న ప్రశ్న ఇప్పుడు పైకి వస్తోంది. ఇంత హత్య జరిగినా అఖ్లాక్ కుటుంబం బిసాడా గ్రామంలోనే ఉంటామని ఎందుకు స్పష్టంగా చెబుతోందన్న ప్రశ్నా తెరపైకి వస్తోంది. ఇవన్నీ ఒక వర్గం మీడియాకి ఇబ్బంది కలిగించే ప్రశ్నలు. అందుకే దాద్రీ గురించి మాట్లాడటం తగ్గించేసింది.
ఈ వార్తలు వార్తలు కావా?
ఈ మధ్యలో మూడ్ బిద్రీలో ప్రశాంత్ పుజారీ హత్య జరిగింది. ఆయన గోవధను వ్యతిరేకించి, ప్రజాస్వామ్య బద్ధంగా, చట్టపరంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన్ని దుండగులు హత్య చేశారు. కానీ ఇది వార్త కానేకాదని ఒక వర్గం మీడియా నిర్ణయించింది. గోవాకి చెందిన హనుమంత్ పరబ్, అమృత్ సింగ్ లు బెల్గాం నుంచి గోమాంసం ఎగుమతికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. వారు తిరిగి వస్తూండగా వారిపై కిరాతకమైన దాడి జరిగింది. ఈ వార్త ఒక వర్గం మీడియా దృష్టిలో వార్త కాదు. దాడి జరిగింది కర్నాటకలో. గోవాలో కాదు. కర్నాటక ప్రభుత్వాన్ని ఎవరూ బోనెక్కించడం లేదు. ఎవరూ దాడులన్నీ కర్నాటకలో, కేరళలో, ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించడం లేదు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు దాడులు జరగడం లేదని ఎవరూ అడగడం లేదు. గోహత్యను నిషేధించాలని హైదరాబాద్ లోని యెమెనీ ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. లక్నోలోమౌలానా ఖాలిద్ రషీద్ ఫిరంగీ మహలీ వంటి ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు గోహత్యను వ్యతిరేకిస్తూ బీఫ్ పార్టీలకు భిన్నంగా మిల్క్ పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇవేవీ ఈ వర్గం మీడియా దృష్టిలో వార్తలు కానే కావు.
పైగా కేరళ హౌస్ సంఘటనలో కీలక పాత్రధారి అయిన హిందూ సేన, కాల్బుర్గి హత్య కేసులో, పన్సరే హత్య కేసులో వినిపిస్తున్న సనాతన సంస్థలకు, శ్రీరామ్ సేన లాంటి సంస్థలకు ఆరెస్సెస్, బిజెపిలకు సంబంధం లేదు. పైగా ఇవి ఈ సంస్థలను గట్టిగా విమర్శిస్తాయి. వీటికి ఊరుపేరు లేదు. పెద్దగా సభ్యులు లేరు. కర్నాటక ఎన్నికల్లో శ్రీరామ్ సేన బిజెపికి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టింది. తమిళనాట అర్జున్ సంపత్ హిందూ మక్కళ్ కచ్చి అనే సంస్థను నడుపుతాడు. ఆ సంస్థకు అధ్యక్షుడు, కార్యదర్శి, కార్యకర్తా ఆయనొక్కడే. కానీ ఆయన చేసిన ఓ చిన్న కామెంట్ ను కూడా మీడియా ఈనాడు ఫస్ట్ పేజీ పతాకశీర్షికలకు తీసుకొస్తుంది. ఆయన కూడా బిజెపిని వ్యతిరేకిస్తాడు. అయినా ఈ సంస్థలను బిజెపిని ఒకే గాట కట్టడం వెనుక ఒక వర్గం మీడియా ఆంతర్యం ఏమిటి?
ఒక వర్గం మీడియాకు కోపం ఎందుకు?
ఒక వర్గం మీడియా పనిగట్టుకుని మోదీని టార్గెట్ చేస్తోంది. అయితే గతంలో ఇదే వర్గం సౌమ్యుడిగా, ఉదారవాదిగా పేరున్న అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రభుత్వంపైనా ఇదే రకంగా విషం చల్లింది. ఇప్పుడు అదే పనిని చేస్తోంది. మోదీ ప్రభుత్వం పట్ల వీరి కోపానికి ఒక ప్రధానకారణం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ తరహా జర్నలిస్టులు కొన్ని వ్యాపార సంస్థలకు ఏజెంట్లుగా, అనధీకృత ప్రతినిధులుగా పనిచేసేవారు. ఎవరు టెలికాం ముఖ్యమంత్రి కావాలి, వాణిజ్య మంత్రి ఎవరు కావాలి వంటివి కూడా నిర్ణయించగలిగే వారు. యూపీఏ హయాంలో వెలుగు చూసిన నీరా రాడియా ఉదంతం ఇదే విషయాన్ని బయటపెట్టింది. అప్పుడు ఈ గుమ్మడికాయ దొంగలందరూ భుజాలు తడుముకున్నారు. బిజెపి ప్రభుత్వంలో వీరికి ఈ సౌలభ్యం లేదు.
అంతే కాదు. గతంలో ప్రధానమంత్రి విదేశ పర్యటనలకు వెళ్లేటప్పుడు ఒక నలభై మంది వరకూ సుప్రసిద్ధ జర్నలిస్టులను వెంట తీసుకువెళ్లేవారు. వారి ఖర్చంతా ప్రభుత్వం భరించకపోయినా, "ఇతర" సంస్థలు భరించేవి. ఇదొక రకం అవినీతి. మోదీ ప్రధాని అయిన తరువాత ఆయన ప్రభుత్వ మీడియా సంస్థ అయిన దూరదర్శన్, ఆకాశవాణి తప్ప మిగతా సంస్థల ప్రతినిధులను తీసుకువెళ్లడం మానేశారు. ఆయన మన్ కీ బాత్ కూడా ఆకాశవాణిలోనే వస్తుంది. పైగా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ ప్రకటనలు రావడం మొదలైంది. దీంతో అప్పటి వరకూ రాజభోగాలనుభవించిన ఈ మీడియా వర్గంలో అసంతృప్తి, ద్వేషం మొదలైంది. దానితో వారు విషప్రచారం మొదలుపెట్టారు. మోదీ విదేశ పర్యటనలను వివాదం చేశారు. నిజానికి మోదీ, మన్మోహన్ లు ఏడాదికి సగటున ఒకేలా పర్యటించారు. కానీ మోదీ విదేశ పర్యటనలు మాత్రమే వివాదం అవుతున్నాయి. చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద వివాదాలు అవుతున్నాయి.
ఈ కుట్రను అర్థం చేసుకుంటే వివాదాలు పొగమంచులా కరిగిపోవడం ఖాయం. వివాదాల వెనుక ఉన్న వారి అసలు రూపం బట్టబయలు కావడం అంతకన్నా ఖాయం.
No comments:
Post a Comment