నెట్టింట్లో కబుర్లూ ... కాకరకాయలు 4 - Raka Lokam

నెట్టింట్లో కబుర్లూ ... కాకరకాయలు 4

Share This

ఆదిమ యుగంలో అరుపులు, పెడబొబ్బలే మాట్లాడుకునేవారు. అంతగా ప్రేమ పుడితే తాకి, ముట్టి భావాలు కలబోసుకునేవారు. ఆ తరువాత అమ్మలక్కలకు పిట్టగొడలు, అన్నలు, అయ్యలకు రచ్చబండలు దొరికాయి. అమెరికా నుంచి అనకాపల్లి దాకా రచ్చబండ చర్చిస్తే, ఆవకాయ నుంచి ఆడబిడ్డ దాకా పిట్టగోడ పార్లమెంటు చర్చించేది. ఇప్పుడు ఇంటర్ నెట్ పుణ్యమా అని గ్లోబ్ మొత్తం ఒక పిట్టగోడ. ప్రపంచం ఒక రచ్చబండ!! కిరాణా దుకాణాలు ఆన్ లైన్ లోకి వచ్చేశాయి. యూ ట్యూబ్ ఓ సినిమా హాలైపోయింది. అన్నిటికీ ఇప్పుడు ఇంటర్ నెట్టే దిక్కు. ఆఖరికి చావడానికి కూడా గూగుల్ గురువు సాయం తీసుకునే దశకి వచ్చేసింది ప్రపంచం. అంతకన్నా వింతేమిటంటే చావు వార్తను కూడా లైక్ కొట్టి షేర్ చేసే స్థాయికి ఎదిగిపోయింది ప్రపంచం. గత వారం నెట్ ప్రపంచాన్ని షేకాడించిన కొన్ని కబుర్లు....మీ కోసం !!!

చావు తెలివితేటలు!!!


ఆ అమ్మాయి చచ్చిపోవాలనుకుంది. అలాగిలాగ కాదు. ఖచ్చితంగా చచ్చిపోవాలనుకుంది. ఏం చేస్తే బతికే అవకాశాలు ఉండవో తెలుసుకునేందుకు ఏకంగా 48 గంటల పాటు వెబ్ సముద్రాన్నిఈదేసింది. 89 వెబ్ సైట్లను ఊదేసింది. ఆఖరికి ఆ 26 ఏళ్ళ అమ్మాయి 13వ అంతస్తునుంచి దూకి చావాలని డిసైడ్ అయింది. అయితే అక్కడా మళ్లీ రీసెర్చి..... ముందు తల నేలకి తగులుతుందా, కాలు తగులుతుందా? ఎలా దూకితే తల తగలడం ఖాయం? ఇవన్నీ ఆలోచించుకుని, ఆమె దూకేసింది. ఆమె అనుకున్నట్టే ఆమె కిందికి పోయింది. ఆయుష్సు పైకి పోయాయి. ఈశా హాండా అనే ఈ ఫ్యాషన్ డిజైనర్-కమ్-యాక్టర్-హోమ్ సెలూన్ సర్వీస్ ప్రొవైడర్ బెంగుళూరులో చనిపోయింది. ఆమె గదిలో ఉరితాడు, నిద్రమాత్రలు, పావుకిలో మారిజువానా ఇంకాఇంకా చాలా దొరికాయి. ఆమె ఎలా చనిపోయిందో ఇప్పుడు అందరికీ తెలుసు. కానీ ఎందుకు చచ్చిపోయిందో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు.
http://www.storypick.com/death-bengaluru-girl/


సైజ్ జీరో కి సవాలు


అందంపై అమెరికన్ల ఆలోచనలు చైనా అమ్మాయిల ఇనప బూటు లాంటివి. అవి అమ్మాయిలను సైజ్ జీరోల చట్రంలో బిగించేస్తాయి. బతుకును క్యాలరీల లెక్కలకు, నడుము కొలతలకు, కోలెస్టరాల్ తీసివేతలకు పరిమితం చేసేస్తాయి. బొద్దుగా ఉండటం పాపమేమోనన్నట్టు చేసేస్తాయి. ఏ ఫర్ అనోరెక్సియా, బి ఫర్ బులీమియా ఇలా ఆక్షరానికో అనారోగ్యం చొప్పున వచ్చినా పరవాలేదు, బ్యూటీ కొలతలు తప్పడానికి వీల్లేదనే వేలం వెర్రి స్థాయికి దిగజార్చేస్తాయి. అలా బొద్దుగా, ముద్దుగా ఉన్న ఓ పాప కత్తెరతో కోసేసుకునైనా లావు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్టున్న ఓ ఫోటోను టెర్రీ హెమెన్ వే అనే మహిళ ఫేస్ బుక్ లో షేర్ చేసింది. అక్షరాలా లక్షా పన్నెండు వేల మంది లైక్ చేశారు. సైజ్ జీరో వేలం వెర్రిని సవాలు చేసే ఈ ఫోటోను చూడండి. లైక్ చేయండి. https://www.facebook.com/photo.php?fbid=1051409341544876&set=a.478549962164153.113162.100000274601060&type=1&fref=nf

మాలూలుబా ... ఐ లవ్ యూ!!


అనగనగా నటాలియా అనే ఓ ఫ్రెంచి అమ్మాయి. ఒంటరిగా ఆస్ట్రేలియాకి వచ్చింది. మూలూలుబా అనే బీచ్ లో అటూ ఇటూ తిరిగి, ఓ ఐరిష్ పబ్ లో ఓ అందగాడిని కలిసింది. ఆమె సొగసరి. అతను గడసరి. అటు అలల హోరు. ఇటు వయసు జోరు. పైన వెన్నెల రాత్రి. కింద ఇసుక తిన్నెలు.... తెల్లారిన తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఆరు వారాల తరువాత ఆమెకి తాను తల్లి కాబోతున్నట్టు తెలిసింది. ఆమెలోని మాతృత్వం ఆమెను కనీసం పేరైనా తెలియని ఆ తండ్రి కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఓ యూట్యూబ్ విడియో పోస్ట్ చేసి, ఆయన్ని, నా బిడ్డని కలపండి అని వేడుకుంది. ఆస్ట్రేలియాలో వేల సంఖ్యలో ప్రజలు బీచ్ వెంట వెతుకులాడారు. నెట్ లో లక్క్షల సంఖ్యలో విడియోని షేర్ చేశారు. 30 లక్షల మంది విడియో చూశారు. అందరూ వారిద్దరూ మళ్లీ కలవాలని కోరుకున్నారు.మాలూలూబా బీచ్ పేరు మార్మోగిపోయింది. ఆఖరికి రెండు రోజుల తరువాత యాండీ సెల్లర్స్ అనే యువకుడు నేనే ఆ తండ్రిని అని ప్రకటించాడు. ఆస్ట్రేలియన్లు ఒక జంట కలిసిన తరుణాన సంతోషంతో మాలూలుబా బీచ్ వైపు పరుగులు తీశారు. భలేగా ఉంది కదూ ఈ లవ్ స్టోరీ... ఆగండాగండి. అక్కడే అసలు ట్విస్ట్! ఇదంతా మాలూలుబా బీచ్ కి, అక్కడి ఐరిష్ హోటల్ కి పబ్లిసిటీ ఇచ్చేందుకు యాండీ సెల్లర్స్ చేసిన చిలిపి మార్కెటింగ్ మాయాజాలం అన్నది బయటపడింది. అంతే .... ఓ అందమైన కలని చిదిమేసినందుకు ఆస్ట్రేలియన్లు ఇప్పుడు సెల్లర్స్ ను తిట్టిపోసుకుంటున్నారు. నటాలియాని ఆడిపోసుకుంటున్నారు.
http://www.theaustralian.com.au/archive/travel-2015-pre-life/french-tourist-overwhelmed-with-response-to-search-to-be-reunited-with-her-queensland-lover/story-e6frg8ro-1227508687218?sv=71867984b7cf605577bc7551832451be

నెటిజనులు నెటిధనులు అవుతారా?


కాన్పూరు లో ఓ కమల్ కుమార్. ఆయన ఉండేది ఒక మురికివాడలో. ఆయన ఉద్యోగం ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడం. ఆ చెత్త సేకరణతోటే తన కుటుంబాన్ని నడుపుకుంటాడు. కమల్ కుమార్ ఆషామాషీ మనిషి కాదు. పేరు మోసిన బాక్సర్. నేషనల్ లెవెల్ లో బాక్సింగ్ చాంపియన్ షిప్స్ లో పాల్గొని తన సత్తా ఏమిటో చూపించాడు. కానీ కాలం కలిసి రాక బతుకు చెత్తబండీని లాగుతున్నాడు. కనీసం తన పిల్లవాడిని బాక్సర్ చేసేందుకు సాయం చేసేవారి కోసం ఎదురు చూస్తున్నాడు. క్వింట్ అనే వెబ్ సైట్ కమల్ కుమార్ కథను విడియో రూపంలో నెట్ లోకి అప్ లోడ్ చేసింది. లైక్స్ బోలెడన్ని వస్తున్నాయి. కానీ లైక్ లతో కడుపు నిండదు. నెటిజనులు నెటిధనులు అవుతారా? కమల్ కుమార్ కష్టాన్ని తీరుస్తారా? నెట్ న్యూస్ లోనే చూద్దాం...
http://www.thequint.com/politics/2015/09/03/this-gold-medallist-boxer-collects-garbage-to-make-a-living


చాయ్ తో చదువు


కెఫే కాఫీడే, క్రాస్ వర్డ్ పుస్తకాల షాపు కలిసున్న చోట, బుక్ షాప్ లోనుంచి కావలసిన పుస్తకాన్ని తీసుకుని కాఫీ తాగుగూ చదివేయొచ్చు. వెళ్లేటప్పుడు కావాలంటే పుస్తకాన్ని కొనుక్కోవచ్చు. లేకపోతే అక్కడే వదిలేసి రావచ్చు. సరిగ్గా అలాంటి హోటలే నడుపుతున్నాడు 62 ఏళ్ల లక్ష్మణ్ రావ్. మహారాష్ట్ర అమరావతి నుంచి ఢిల్లీకి వచ్చి అక్కడ ఒక ఫుట్ పాత్ టీ షాపు నడుపుతున్నాడు. దాని పక్కనే తాను వ్రాసిన 12 హిందీ పుస్తకాలను కూడా పెడుతున్నాడు. ఆయన నవలలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ప్రజలు చాయిలో నంజుకుని తినేస్తున్నట్టు చదువుతున్నారు. అక్కడ నిజంగా చాయ్ పే చర్చ జరుగుతూ ఉంటూంది. ఇందిరా గాంధీ నుంచి ఎందరో ప్రముఖులతో ఆయన దిగిన ఫోటోలు కూడా అక్కడ దర్శనమిస్తూ ఉంటాయి.
http://scroll.in/article/684925/video-along-with-tea-delhi-chai-wallah-serves-up-the-12-books-he-has-authored


కుర్దీ నిద్రపోయాడు... ఇకనైనా మేల్కొందామా?



అదేమిటో .... తుఫాను వచ్చినా గడ్డిపోచ బతికే ఉంటుంది. కానీ యుద్ధం వస్తే మాత్రం పసిపాపలే చనిపోతూంటారు. అలాంటి వాడే అలన్ కుర్దీ. ఎర్ర చొక్కా, నీలి నిక్కరుతో టర్కీ సముద్ర తీరంలో ఆదమరిచి పడుకున్నట్టు పడున్న అలన్ కుర్దీ ఇప్పుడు యుధ్దం పై యుద్ధం ప్రకటించడానికి ఒక పెద్ద కారణం. సరిహద్దులపై సమరం సాగించేందుకు ఒక ఆయుధం. వీసాల విచ్చుకత్తులను విరిచేసేందుకు ఒక సాధనం. తీరానికి శవమై కొట్టుకొచ్చిన మానవత్వం ఇప్పుడు ప్రపంచం గుండెలోపలి మెత్తటి పొరలను గీరుతోంది. అలన్ కుర్దీ #హ్యుమానిటీ వాష్డ్ అషోర్ అన్న హ్యాష్ టాగ్ గా మారిపోయారు. అతని బాల్యాన్ని విజయవంతంగా నిద్ర పుచ్చేసిన ప్రపంచం ఇప్పటికైనా మేల్కొంటుందా?
http://www.buzzfeed.com/ryanhatesthis/humanity-washed-ashore#.ob83nDPKy

(సెప్టెంబర్ 7, 2015 న సాక్షి దినపత్రిక ఫ్యామిలీ సెక్షన్ లో ప్రచురితం)

1 comment:

  1. లంకె లు పని చెయ్యటం లేదు

    ReplyDelete

Pages