నెట్టింట్లో కబుర్లు.... కాకరకాయలు - 3 - Raka Lokam

నెట్టింట్లో కబుర్లు.... కాకరకాయలు - 3

Share This

వరల్డ్ వైడ్ వెబ్ (డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు) పుట్టినప్పుడు వామనుడిలా అమెరికాలోనే ఉండేది. ఇప్పుడది త్రివిక్రముడై మూడో పాదం ఎక్కడ మోపాలి అని ప్రశ్నిస్తోంది. పిడికిట్లో పట్టే సెల్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచమంతా గుప్పెట్లో ఉన్నట్టే. ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ప్రేయసిలా కళ్లలో కళ్లు పెట్టి చూసే డెస్క్ టాప్, ఒళ్లో గువ్వలా ఒదిగి కూచునే లాప్ టాప్, పుస్తకమంత ఉండి ప్రపంచమంతా మోసే టాబ్లెట్లు, అరచేతిలో అఖిల విశ్వాన్ని చూసే మొబైల్స్ మనకు క్షణాల్లో చెప్పేస్తున్నాయి. అక్కడ్నుంచి, ఇక్కడ్నుంచి, ఎక్కడెక్కడ్నుంచో మీ కోసం పోగేసిన కాసిని నెట్టింటి కబుర్లు....ఇదిగో ....

గ్రౌండ్ లేదు... ఆట రాదు... అయినా ఛాంపియన్లు!


ఎటు చూసినా చుట్టూ నీరు, అంగుళం ఖాళీ లేకుండా ఊరంతా ఇళ్లు ఉన్న ఓ ద్వీపంలోని పిల్లలకు ఫుట్ బాల్ ఆడాలనిపించింది. బంతైతే దొరికింది కానీ గ్రవుండ్ ఏదీ? అక్కడా ఇక్కడా పడున్న చెక్కముక్కలతో నీటిపై తేలియాడే ఓ గ్రవుండ్ తయారు చేసుకున్నారు. దానికి ఎక్కడ పడితే అక్కడ మేకులు.... బంతి గ్రవుండ్ దాటిందంటే ఏకంగా నీళ్లలోకే ....అలాగే రక్తమోడుతూ, దెబ్బలు తగిలించుకుంటూ వాళ్లు ఆడుకున్నారు. ఆఖరికి టోర్నమెంట్లకు వెళ్లారు. లేని గ్రవుండ్ లో రాని ఫుట్ బాల్ ఆడి ఏడాదికేడాది ఛాంపియన్లుగా తిరిగివస్తున్నఈ పిల్లలది కోహ్ పాన్యీ అనే థాయ్ ద్వీపం. కోహ్ పాన్యీ కథను టీ ఎం బీ అనే ఓ థాయ్ బ్యాంక్ అయిదు నిమిషాల ఎడ్వర్టయిజ్ మెంట్ గా మార్చింది. 48.32 లక్షల మంది చూశారు. https://www.youtube.com/watch?v=jU4oA3kkAWU పై క్లిక్ చేసి మీరూ చూడండి.


సల్మాన్ ఖాన్ సే షాదీ కరూంగీ!



సోమీ అలీ, సంగీతా బిజ్లానీ, ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ లు చేయలేని పనిని చేసేస్తానంటోంది ఈ మూడేళ్ల పాప. ఎక్కడిదో తెలియదు కానీ ఈ పిడుగులాంటి పిల్ల సల్మాన్ సే షాదీ కరూంగీ అంటోంది. షాదీ అంటే హ్యాపీ బర్త్ డే లాంటిదని కూడా మనబోంట్లకు విడమర్చి చెబుతోంది. ఈ బులిపాప మన చుల్ బుల్ పాండేకి గిలిగింతలు పెట్టేసింది. అంతే ఆయన లవ్లీ సింగ్ గా మారిపోయాడు. సల్మాన్ ఖాన్ ఈ పిడుగు పంపిన విడియో పాలిట 'షేర్' ఖాన్ గా మారిపోయాడు. అయితే సల్లూ భాయ్ కనీసం మరో పదిహేను ఏళ్లు ఆగాల్సిందే. లేకపోతే మన భాయీజాన్ పై ఇప్పుడున్న కేసులకు ఇంకొకటి తోడవుతుంది. వేల లైక్ లతో గోలగోలగా ఉన్న ఈ విడియోని https://www.youtube.com/watch?v=S1GTnIAgNu0 చూడండి.

ఛమ్కీ గిమ్కీ పెట్టేస్కోనీ ... షాదీ గీదీ చేసేస్కోనీ ....


పెళ్లంటే నూరేళ్ల పంటే కాదు. వెయ్యింతల వెరైటీగా కూడా ఉండాలనుకుంటారు చాలా మంది. అనూహ్య ప్రదేశాల్లో అద్భుత వివాహాలు చేసుకోవాలనుకునేవాళ్లకి ఆస్ట్రేలియాకి చెందిన జూన్ బగ్ అనే వెడ్డింగ్ ప్లానర్ గొప్ప గొప్ప అయిడియాలు ఇస్తూంటుంది. ఆ జూన్ బగ్ ప్రతి ఏటా స్టన్నింగ్ వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఫోటో కాంటెస్టును నిర్వహిస్తుంది. ఈ ఏడాది అవార్డు విన్నింగ్ వెడ్డింగ్ ప్రదేశాల ఫోటోలు రిలీజయ్యాయి. ఇప్పటికే 3.51 లక్షల మంది చూశారు. http://junebugweddings.com/ పై క్లిక్ చేసి చూడండి. చూస్తే ఖాయంగా మళ్లీ పెళ్లి చేసేసుకోవాలనిపిస్తుంది.

డస్ట్ లేడీ!


మార్సీ బార్డర్స్ ఎవరో సెప్టెంబర్ 11, 2001 కి ముందు ఎవరికీ తెలియదు. న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట శిఖరాలను కుప్పకూల్చినప్పుడు శకలాల దుమ్ము ఆమెను కప్పేసింది. ధూళి నిండిన ఆమె ఫోటో ప్రపంచమంతా ఫ్లాష్ అయింది. అప్పటి నుంచీ ఆమెను డస్ట్ లేడీ అంటున్నారు. ఆమె శకలాల ధూళి వల్ల క్యాన్సర్ వచ్చి గత వారమే చనిపోయింది. ఉగ్రవాద భూతం చచ్చిన వాళ్లను ఎలాగో చంపేసింది. చావని వాళ్లను కూడా ఎలా చంపుతుందో డస్ట్ లేడీ విషాదాంతం చెబుతుంది.


జస్లీన్ వర్సెస్ సరబ్ జీత్


సోషల్ మీడియా కత్తి లాంటిది. కత్తితో కూరగాయలూ తరగొచ్చు. తలలూ తరగొచ్చు. ఢిల్లీకి జస్లీన్ కౌర్ కి ఈ విషయం బాగానే తెలిసి వచ్చింది. వీధిలో గిల్లి కజ్జాని మొబైల్ ఫోన్ మసాలా, ఫేస్ బుక్ తాళింపూ దట్టించి సరబ్ జీత్ అనే కుర్రాడిని కూర వండేసింది. సరబ్ జీత్ తన వాదనను వినిపించేలోగానే టీవీ ఛానెళ్లు ఆయనకి శిక్ష వేసేశాయి. కానీ మరుసటి రోజే కథ లో ట్విస్ట్ వచ్చేసింది. అసలు జస్లీన్ సరబ్ జీత్ ని బూతులు తిట్టిందని, కుర్రాడిది అంత తప్పేమీ చేయలేదని బయటపడింది. నిన్నటిదాకా ఆమెను వీరనారి అన్న నరంలేని నాలుకలు ఒక్క క్షణంలో మాట మార్చేశాయి. దీంతో జస్లీన్ ఏకంగా ఫేస్ బుక్ అకౌంట్ నే క్లోజ్ చేసేసుకోవాల్సి వచ్చింది.

No comments:

Post a Comment

Pages