ప్రజా ప్రతినిధులు ఎక్కడ సమావేశమౌతారు? పార్లమెంటులో. లిబియా పార్లమెంటు ఇటీవల సెప్టెంబర్ 9, 2014 నాడు ఎక్కడ సమావేశమయ్యారు? పార్లమెంటు భవనంలో కాదు. కనీసం ఏదో ఒక హోటల్ లో కూడా కాదు. ఏదో ఒక అడవిలోనూ, ఆఖరికి గుడిసెలోనో కాదు. ఓ పడవలో సమావేశమైంది.
లిబియా పార్లమెంటు సమావేశాలు గ్రీకు కంపెనీ ఎలిరోస్ లైనర్ వారి భారీ ఫెర్రీలో సమావేశమైంది. ఎంపీలకు భద్రత కల్పించేందుకు గ్రీకు సెక్యూరిటీ గార్డులు కాపలా కాశారు. టోబ్రుక్ నగరం తీర ప్రాంతంలో సముద్ర జలాల్లో ఈ సమావేశం జరిగింది.
లిబియా రాజధాని ట్రిపోలీ, రెండో అతిపెద్ద నగరం బెంగాజీ, మూడో అతిపెద్ద నగరం డెర్నాలు ఇస్లామిక్ ఉగ్రవాద శక్తుల చేజిక్కాయి. ప్రభుత్వం పలాయనం చిత్తగించి టోబ్రుక్ నగరానికి దూరంగా, భూమిలో కాక నీటిలో నిలబడింది. ఆ ప్రభుత్వం ఆదేశాలు నీటి మీది రాతలు కాక మరేమవుతాయి?
ఇదీ ప్రస్తుతం లిబియా పరిస్థితి!.తమాషా ఏమిటంటే అంతర్జాతీయ వ్యవహారాలపై వెలువడే అత్యంత ప్రతిష్ఠాత్మక పత్రిక ఫారిన్ పాలసీ 2010 లో దేశాల సార్వభౌమత్వ దారుఢ్యం పై స్టేట్ ఫ్రాజైలిటీ ఇండెక్స్ ని వెలువరించింది. దీనినే ఫెయిల్డ్ స్టేట్ ఇండెక్స్ (విఫల దేశాల సూచి) అని కూడా అంటారు. ఈ సూచికలో లిబియాకి ప్రపంచంలో బలమైన దేశాల్లో ఒకటిగా పేర్కొనడం జరిగింది. ఈ సూచిక ప్రకారం సిరియా ఓ మోస్తరు బలమైన దేశం.
ఐదు దేశాలు పధ్నాలుగు అవుతాయా?
కానీ ఇప్పుడు సిరియా అనే దేశం ఉంటుందా ఉండదా అన్నదే పెద్ద ప్రశ్న. ఒక్క సిరియా మాత్రమే కాదు. ఇరాక్, టర్కీ, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ సహా ఇస్లామిక్ దేశాల భూ సరిహద్దులు మారిపోబోతున్నాయన్న సందేహాలు నానాటికి పెరుగుతున్నాయి. గత సంవత్సరం సుప్రసిద్ధ రచయిత్రి, గల్ఫ్ దేశాల వ్యవహారాల నిపుణురాలైన రాబిన్ రైట్ రాబోయే రోజుల్లో పశ్చిమాసియాలోని అయిదు దేశాలు 14 దేశాలు అయిపోతాయని జోస్యం చెప్పారు.
• అంతర్యుద్ధంతో కొట్టుమిట్టాడుతున్న సిరియా మధ్యధరా సముద్రాన్ని ఆనుకుని ఉన్న అలావీ తెగ షియాలు నివసించే అలావిస్థాన్, సున్నీ జనాధిక్యత ఉన్న సున్నిస్థాన్, కుర్దులు నివసించే ఉత్తరప్రాంతం కుర్దిస్థాన్ గా విడిపోవచ్చు.
• లిబియా మూడు భాగాలు కావచ్చు. ఒకటి రాజధాని త్రిపోలీ ఉన్న ట్రిపోలిటానియా, రెండవది బెంగాజీ ఉన్న సైరెనైకా, మూడవది సభా నగరం కేంద్రంగా ఫెజ్జన్.
• ఇరాక్ మూడు భాగాలుగా విడిపోవచ్చు. సున్నీలు ఎక్కువగా నివసించే ప్రాంతం, షియాలు నివసించే ప్రాంతం, కుర్దులు నివసించే ప్రాంతం ఇలా మూడు భాగాలు కావచ్చు.
• సిరియా, టర్కీ, ఇరాక్ లలోని కుర్దులు కలిసిపోయి ఒక కుర్దిస్తాన్ గా ఏర్పడవచ్చు. అలాగే సిరియా, ఇరాక్ లలోని సున్నీ జనాధిక్య ప్రాంతాలు కలిసిపోయి ఒకే దేశంగా ఏర్పడ వచ్చు. ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ప్రాంతాల్లో పాగా వేశారు.
• సౌదీ అరేబియా కూడా సౌదీ రాజుల పాలనకు ముందరి లాగా తెగల ఆధిపత్యం, మత పరమైన తేడాల ఆధారంగా అయిదు భాగాలుగా విడిపోవచ్చు. తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర అరేబియాలు, మధ్యలో వాహబీల ప్రాబల్యం ఉన్న వాహబిస్తాన్ లుగా ఏర్పడవచ్చు.
• యెమెన్ కూడా ఉత్తర దక్షిణ యెమెన్ లు గా విడిపోవచ్చు. దక్షిణ యెమెయన్ సౌదీ అరేబియాలో కలిసిపోవచ్చు.
ఇస్లాంలో అంతర్గత వైరుధ్యాలు
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2006 నాటికే జియోపాలిటిక్స్ నిపుణుడు రాల్ఫ్ పీటర్స్ "బ్లడ్ బోర్డర్స్ - హౌ ఎ బెటర్ మిడిల్ ఈస్ట్ వుడ్ లుక్" అన్న పుస్తకం వ్రాసి, రాబోయే రోజుల్లో పశ్చిమాసియా అంటే ముస్లిం జగత్తు జాతులు, తెగలు, షియా సున్నీ విభేదాల ఆధారంగా ముక్కముక్కలు కావచ్చునని, మొదటి ప్రపంచ యుద్ధానికి ముందరి పరిస్థితులు రావచ్చునని ప్రతిపాదించాడు. తమాషా ఏమిటంటే మొదటి ప్రపంచ యుద్ధం నాటికి ఇవన్నీ అత్యంత బలహీనుడైన టర్కిష్ ఖలీఫా ఆధిపత్యంలో ఉంటూ, ఆయనపై తిరుగుబాటు చేస్తూ ఉండేవి. వాటిని బ్రిటిష్ దౌత్య వేత్త మార్క్ సైక్స్, ఫ్రెంచ్ రాయబారి జార్జి పికాట్ లు యుద్ధానంతరం మ్యాప్ పై పెన్ను తీసుకుని సరళ రేఖలు గీసి లిబియా, ఇరాక్, ఇలా విడగొట్టారు. ఈ సరళరేఖ పరిస్థితులను అత్యంత సంక్లిష్టం చేసేసింది. ఎందుకంటే సరిహద్దు రేఖకి అటూ ఇటూ ఒకే తెగ ప్రజలుండటం, వారి మధ్య సన్నిహిత సంబంధాలుండటంతో ఈ రేఖలకు ఏ నాడూ విలువ లేకుండా పోయింది. ఇప్పుడు నెమ్మదినెమ్మదిగా, జాతులు, తెగలు, ఇస్లాంలోని అంతర్గత విభేదాల ఆధారంగా మళ్లీ పాత దేశాలు పుట్టుకురావచ్చునని, ప్రపంచ పటం మారవచ్చునని రాల్ఫ్ పీటర్ ప్రతిపాదించాడు.
సున్నీ, షియా అంతర్గత విభేదాలు ఇప్పుడు గల్ఫ్ దేశాలను కుదిపేస్తున్నాయి.ఉదాహరణకు బహ్రేన్ షియా మెజారిటీ. కానీ పాలకుడు సున్నీ. ఇరాక్ లో జనం షియా, సున్నీ కుర్దులుగా విడిపోయి ఉన్నారు. పాలకులు షియాలు. సిరియాలో జనాభా సున్నీ, పాలకుడు మైనారిటీ షియా అలావీ తెగకు చెందిన వాడు. ఇరాన్ లో షియాలది ఆధిపత్యం. కానీ సీస్తాన్ బెలుచిస్తాన్ అన్న ప్రాంతంలో మాత్రం సున్నీలదే ఆధిపత్యం. లిబియాలో తెగల మధ్య ఆదినుంచీ ఆధిపత్య పోరు నడుస్తూండేది. ఇప్పుడది మరింత ప్రస్ఫుటమై, మూడు ముక్కలయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.
పాకిస్తాన్ ముక్కలవుతుందా?
రాల్ఫ్ పీటర్, తదితర ప్రపంచ భౌగోళిక రాజకీయ విశ్లేషకులందరూ పాకిస్తాన్ అఫ్గనిస్తాన్ ల గురించి కూడా జోస్యాలు చెబుతున్నారు. అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ ల రూపురేఖలు కూడా మారతాయని వారంటున్నారు. దానికి కూడా తెగల వైరమే ప్రాతిపదిక. తూర్పు అఫ్గనిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ లలో ఉన్న ఫక్తూన్ తెగ లు కలిసిపోయి ఫక్తూనిస్తాన్ గా ఏర్పడవచ్చునని, పాకిస్తాన్ లోని బెలూచీ తెగ ప్రజలు విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడవచ్చునని కూడా చెబుతున్నారు.
చాలా మంది దృష్టికి రాని విషయం ఏమిటంటే 1990 వరకూ ప్రపంచ దేశాల్లో చాలా స్థిరత్వం ఉందని, ఇక కొత్త దేశాలు ఏర్పడటం అసంభవమని భావించారు. కానీ 1990 తరువాత ప్రపంచంలో 26 కొత్త దేశాలు పుట్టుకొచ్చాయి. సోవియట్ యూనియన్ పదిహేను దేశాలైంది. యుగోస్లావియా ఏడు దేశాలైంది. చెకొస్లవాకియా రెండు దేశాలైంది. ఇథియోపియా నుంచి ఎరిట్రియా వేరు పడింది. ఇండొనేసియా నుంచి తూర్పు తిమోర్ వేరైంది. దక్షిణ యెమెన్ ను ఉత్తర యెమెన్ ఈ మధ్యే కలుపుకుంది. అది మళ్లీ ఇప్పుడు విడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మరో వైపు సూడాన్ నుంచి దక్షిణ సూడాన్ వేరే దేశంగా ఏర్పడబోతోంది. ఇలా ప్రపంచపటం మధ్య భాగంలో మ్యాపులు మారిపోతున్నాయి. దేశాలు పుట్టుకొస్తున్నాయి.
భారత్ పై ప్రభావం
ఈ పరిణామాలు సహజంగానే భారత్ కి ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే పశ్చిమాసియాలోని సున్నీ, షియా వైరుధ్యాల ప్రకంపనలు భారత దేశాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. మన దేశంలోనూ ముస్లింలలో సున్నీలు 85 శాతం, షియాలు 15 శాతం ఉన్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, కాశ్మీర్ లోయల్లో షియా, సున్నీ ఘర్షణలు జరుగుతున్నాయి. కాశ్మీరు లోయలోని బద్ గామ్, కార్గిల్, గురేజ్ సెక్టర్ లలో షియా సున్నీ విభేదాలు తారాస్థాయికి చేరాయి. మరో వైపు ఆక్రమిత గిల్గిత్ బాల్తిస్థాన్ లో స్థానిక షియా జనాభాకి, పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన సున్నీ జనాభాకి మధ్య ఘర్షణలు నిత్యకృత్యమౌతున్నాయి. వాటి ప్రభావం ఇటు కాశ్మీరు లోయపైన, కార్గిల్ పైన కూడా పడుతున్నాయి.
ఇప్పటికే ఇరాక్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు షియాలపై కిరాతకాలు జరపడం, షియాలను ఊచకోత కోయడం, వాటి వీడియోలను వెబ్ ప్రపంచం ద్వారా అందరికీ అందించడం, రాబోయే రోజుల్లో షియాలకు ఆరాధ్య కేంద్రాలైన కర్బలా, నజాఫ్, బస్రాలను ధ్వంసం చేస్తామని ప్రకటించడం వంటివి షియాలలో ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహావేశాలను పెంచుతున్నాయి. భారత దేశం నుంచి ఇప్పటి వరకూ షియాల తరఫున, ఇరాక్ లో యుద్ధం చేయడానికి గాను ఏడు వేల మంది షియాలు వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరో వైపు ఇస్లామిక్ స్టేట్ తమ ఆధిపత్యం అరేబియాకు విస్తరించగానే తాము మక్కాలో ఉన్న మహ్మద్ ప్రవక్త సమాధిని, ప్రపంచ ముస్లింలకు పవిత్రమైన కాబాను ధ్వంసం చేస్తామని ప్రకటించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రకారం సమాధులను పూజించడం ఇస్లామ్ వ్యతిరేకం. అది పైగంబర్ సమాధి అయినా ధ్వంసం చేయాల్సిందే. కాబాలో ఒక రాతిని పూజిస్తారు కాబట్టి అది విగ్రహారాధన అవుతుంది. విగ్రహారాధన ఇస్లాం వ్యతిరేకమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు భావిస్తున్నారు. ఈ ప్రకటన వెలువడ్డ తరువాత నుంచి సున్నీలలోనే పలువురు ఇస్లామిక్ స్టేట్ ను వ్యతిరేకిస్తున్నారు.
మరో వైపు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు, అఫ్గనిస్తాన్ లోని అల్ కాయిదాకి మధ్య ప్రస్తుతం ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇస్లామ్ ప్రపంచ విజేతగా మారే ముందు నల్లని జెండాలు ధరించిన ఇస్లామ్ సేనలు ఖొరాసాన్ (నేటి ఇరాన్, అఫ్గనిస్తాన్) ను ఆక్రమించుకుని, అంతిమ పోరును భారతదేశంలో చేస్తాయని ఇస్లామిక్ ఉగ్రవాదులు భవిష్యవాణి చెబుతున్నారు. దీన్ని వారు గజ్వా ఎ హింద్ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య అల్ కాయిదా దక్షిణాసియా శాఖను క్రియాశీలకం చేసింది.
కాబట్టి పశ్చిమాసియా లో జరుగుతున్న పరిణామాల ప్రభావం భారతదేశంపై కూడా ఉండటం ఖాయం. భారతదేశం ఈ పరిణామాలను నిశితంగా గమనించాల్సి ఉంటుంది. 1914 తొలి ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచపటం పూర్తిగా మారిపోయింది. పశ్చిమాసియా, యూరప్ లు ప్రభావితమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఆసియా, యూరప్ ల మ్యాప్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మళ్లీ తొలి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు పూర్తయిన సమయంలో మళ్లీ ప్రపంచ పటం మారిపోబోతోందా?
ఇవి ఖచ్చితంగా భారతీయులు పట్తించుకోవలసిన విషయాలే!మంచి సమాచారం ఇచ్చారు!!
ReplyDeleteThank you so much for liking the post. Please read my other posts too
DeleteSudhakar garu very nice to read such an article. Better it should be published in daily like Sakshi instead of confining to blog
ReplyDeletebagundandi
ReplyDelete