నెమలి పెయింటర్లు - Raka Lokam

నెమలి పెయింటర్లు

Share This





నాలుగు సగం విరిగిన వాటర్ బాటిళ్లు....
అందులో నాలుగు వాటర్ కలర్ రంగులు....
నాలుగు మొనలు మెత్తగా చితక్కొట్టిన కర్ర పుల్లలు....
ఒక అట్టముక్క.....
ఒక పాత గుడ్డ....
వీటితో ఏం చేయొచ్చు?





మామూలుగానేతే వీటన్నిటినీ చెత్తకుండీలో పారేయొచ్చు. అంతకుమించి ఇవి దేనికీ పనికిరావు.
కానీ అదే శ్రీశైలంలోనైతే .... అందాల నెమళ్లు....అద్భుతమైన పడగల పాములు, విభూతులద్దిన శివలింగాలు, త్రిశూలాలు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూవులు .... గీయొచ్చు.
కర్రపుల్ల కుంచె అవుతుంది. అట్టముక్క పెయింటింగ్ ప్యాలెట్ అవుతుంది. విరిగిన వాటర్ బాటిల్స్ కలర్ కంటెయినర్లవుతాయి. కారు కాన్వాసవుతుంది. కారు కళాఖండాల్ని మోసుకెళ్లే మొబైల్ ఆర్ట్ ఎగ్జిబిషనవుతుంది.
శ్రీశైలం నుంచి వచ్చే ప్రతి కారు, ఆటో, బస్సు, లారీలపై వాటర్ కలర్స్ తో గీసిన ఈ బొమ్మలుండటం తప్పనిసరి. నల్లమల కనుమల్ని దాటి శ్రీశైలం వెళ్లి వచ్చేవారు ఈ "పెయింటింగ్ పాస్ పోర్టు" ముద్ర వేయించుకోవడం తప్పనిసరి. కారు.... కారుపై నెమలి.... శివలింగం... పాము.... త్రిశూలం చూడగానే "ఓహో ....శ్రీశైలం రిటర్న్ డ్" అనుకోవాల్సిందే.
శ్రీశైలంలో ఇలా వాటర్ కలర్ పెయింటింగులు వేసేవాళ్లు దాదాపు 90 మంది ఉన్నారు. ఒక్క కారును తుడిచి పెయింటింగ్ వేస్తే నూటయాభై గిట్టుతుంది. మామూలు రోజుల్లో ఒక్కో పెయింటర్ రెండో మూడో కార్లకు పెయింటింగ్ వేయొచ్చు. ఆదివారమైతే పదో పదిహేనో కార్లకు రంగులు అద్దవచ్చు.




చదువు సంధ్యలు లేకుండా అలాయిజులాయిగా తిరిగే 90 మందికి, వారి కుటుంబాలకీ శ్రీశైలం మల్లన్న భలే సెల్ఫ్ ఎంప్లాయిమెంటు స్కీము కనిపెట్టాడు.
శివలింగం, పాము, త్రిశూలం బొమ్మలు వేయడం మామూలే. ఎందుకంటే ఇది శ్రీశైలం కనుక. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి కనుక. మరి నెమలి బొమ్మ ఎందుకు వేస్తారు?
శ్రీశైలం క్రౌంచ పర్వతం. అంటే నెమళ్లు బాగా ఉండే చోటు. నెమళ్లు సుబ్రహ్మణ్య స్వామి వాహనాలు. నిజానికి శివుడు, అమ్మవారి కన్నా ముందు ఇక్కడ వెలసింది సుబ్రహ్మణ్యేశ్వరుడేనట. దానికి గుర్తుగానే ఇది క్రౌంచపర్వతం అయింది.
ఆ పెయింటింగ్ వేసేవారికి ఇదంతా తెలిసే వేస్తున్నారా? యుగాల నుంచీ శ్రీశైలం క్రౌంచపర్వతమన్న సత్యం వారికి తెలుసా?
ఏమో ... చెప్పలేం... ఎందుకంటే పెయింటింగ్ వేసేటప్పుడు ఎక్కడ లేని ఏకాగ్రత, పెయింటింగ్ పూర్తి కాగానే డబ్బుల మీదే ధ్యాస... తరువాత ఇంకో కారుకు రంగేసేందుకు వెతుకులాట. శ్రీశైలం పెయింటర్లకు మాట్లాడే తీరిక ఉండదు మరి.





తెలిసి వేస్తున్నారో, తెలియక వేస్తున్నారో తెలియదు కానీ... శ్రీశైలం కారు పెయింటర్లు ఒక పరంపరను, ఒక ఇతిహాసాన్ని, ఒక యుగాల చరిత్ర వికాస క్రమాన్ని మన కారుపై పంచరంగుల చిత్రంలా ... విచిత్రంగా గీసేస్తున్నారు.
నల్లమల కీకారణ్యాన్ని వదిలి నగరపు జనారణ్యానికి వచ్చేశాక కారు కడిగేటప్పుడు వాటర్ కలర్స్ నెమ్మదిగా జారిపోతూంటే .... ఒక్క క్షణం "అయ్యో" అనిపిస్తుంది. నా కారుకి నెమళ్లద్దిన పెయింటర్ ఏకాగ్రత గుర్తుకొస్తుంది. "మళ్లీ కారుపై రంగుపడితే బావుణ్ణు" అనిపిస్తుంది.



1 comment:

  1. ఎంతో చక్కని వ్యాసం... శ్రీశైలం చిత్రకారుల జీవితాల్ని కళ్ళకి కట్టినట్టు వ్రాశారు.. సామాన్యులు ఇటువంటివి అలా చూసి వెళ్ళిపోతారు....మీ వంటి మాన్యుల్ని అవి కదలిస్తాయి.. పది మంది దృష్టిలో పడతాయి.. మంచి వ్యాసానిచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete

Pages