అన్నన్నా ఎంత మాట!! - Raka Lokam

అన్నన్నా ఎంత మాట!!

Share This
అవినీతిపై అన్నా సాహెబ్ హజారే సమరం సాగిస్తున్నారన్నది ఇప్పటి హాట్ న్యూస్. నిజానికి ఆయన అవినీతిపై సమరం చేస్తున్నారా లేక జనలోకపాల్ బిల్లుకోసం ఉద్యమం చేస్తున్నారా? టీవీల జోరు, వాటి టీఆర్ పీల హోరులో ఈ విషయంపై ఎవరూ ఆలోచించడం లేదు.

అన్నాసాహెబ్ హజారే అవినీతిపైనే సమరం చేస్తూ ఉంటే అంత పెద్ద 2 జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడలేదు?
ఆయన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రలో ఆదర్శ హౌసింగ్ కుంభకోణం పెచ్చరిల్లి మిలటరీ బాసుల్నీ, ముఖ్యమంత్రుల్నీ కుప్పకూల్చేస్తుంటే ఆయన ఎందుకు మౌనంగా ఉండిపోయారు?
హసన్ అలీ అనబడు గుర్రంకొట్టు యజమాని మంత్రుల నుంచి మన సినీస్టార్ల దాకా అందరినీ హవాలా హైవేలో హిచ్ హైక్ చేస్తూ ఉంటే అన్నా సాహబ్ "మౌనమే నీ భాష ఓ మూగ మనసా" అని ఎందుకు మిన్నకుండిపోయారు?
కామన్వెల్త్ ఆటలతో అవినీతి చెలగాటం ఆడుతూంటే ఆయన మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? నిజానికి షుంగ్లూ రిపోర్టులో కల్మాడీ నుంచి షీలా దీక్షిత్ దాకా రాజకీయ నేతల భాగోతాలు బట్టబయలైన సమయంలోనే ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టిన అన్నాసాహెబ్ దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదెందుకు?
గత ఏడెనిమిది నెలలుగా దేశాన్ని కుదిపేస్తున్న ఈ అవినీతి కుంభకోణాల్లో కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. కొందరు కటకటాల వెనుక కటకటా అంటున్నారు. మిలటరీ జనరల్స్ నుంచి బలిసిన బ్యూరోక్రాట్ల దాకా, సమాంతర సర్కార్లు నడిపిన రాడియాల నుంచి రాజకీయుల దాకా అందరూ బోనెక్కారు. ఇవన్నీ జరుగుతూండగా మిన్నకుండిన అన్నాసాహెబ్ అవినీతిపై పోరు చేస్తున్నారంటే ఎలా నమ్మాలి?

అన్నాసాహెబ్ గతంలోనూ ఒక సారి అవినీతిపై సమరం చేశారు. అప్పట్లో మనోహర్ జోషీ మహారాష్ట్రలో శివసేన ముఖ్యమంత్రి ఉండేవాడు. బిజెపికి చెందిన గోపీనాథ్ ముండే ఉప ముఖ్యమంత్రిగా ఉండేవారు. నిరాహారదీక్షల పర్వం అప్పుడూ కొనసాగింది. చివరికి ప్రభుత్వం పూర్తిగా అప్రతిష్ట పాలయ్యేదాకా ఉద్యమం చేశారు. ఆ తరువాత సర్కారు మారింది. అవినీతి యథాప్రకారం కొనసాగింది. కానీ అన్నా హజారే ఉద్యమం మాత్రం కొనసాగలేదు. ఎందుకు? అని ఎవరూ అడగలేదు. ఎందుకంటే చదివేసిన న్యూస్ పేపర్లతో పాటే ప్రజలు మెమరీని కూడా పాత సామాన్ల కొట్టు వాడికి అమ్మేయడం మనకు అలవాటే కదా!!
ఇప్పుడు కూడా అన్నాసాహెబ్ శరద్ పవార్ పై దాడిచేసి, ఆయన రాజీనామాను కోరుతున్నారే కానీ, అవినీతిపరుడైన థామస్ ను సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్ గా నియమించడంలో కీలక పాత్ర పోషించిన అప్పటి కేంద్ర మంత్రి, ఇప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ గురించి ఒక్క మాటా మాట్లాడటం లేదు. ఈ సెలెక్టివ్ సత్యాగ్రహం తమాషాగా లేదూ? శరద్ పవార్ కీ కాంగ్రెస్ కీ మధ్య శీత యుద్ధం నడుస్తోందన్న విషయం, పవార్ ను ఇరకాటంలో పెట్టేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తూ వస్తోందన్నదీ గుర్తంచుకుంటే ఈ మౌనం వెనక ఏవేవో కొత్త అర్థాలు స్ఫురిస్తాయి కదూ.
ఇప్పుడు కూడా అన్నాసాహెబ్ హజారే నిరాహార దీక్షకు మద్దతు ప్రకటించిన వారిలో బోఫోర్సు-క్వాత్రోక్కీ ఫేమ్ సోనియా గాంధీ కూడా ఉన్నారు. ఆమెకు అన్నా సాహెబ్ ఆనందంగా ధన్యవాదాలు కూడా ప్రకటించేసుకున్నారు. "నీ అవినీతి మద్దతు నాకొద్దు ఫో" అని అనలేదు. పాపం పెద్దగా ఎలాంటి అవినీతి ఆరోపణలూ లేని సుష్మాస్వరాజ్, ఉమా భారతిలను మాత్రం "రావద్దు ఫో" అనేశారు. "దీని భావమేమి అన్నా సాహెబ్" అని అడిగే ఓపికా తీరికా ఎవరికీ లేదు.
ఇంతకీ అన్నా సాహెబ్ దేని కోసం పోరాడుతున్నారు? ఆయన జనలోకపాల్ బిల్లు కోసం పోరాడుతున్నారు. మంచిదే. కానీ గుప్పెడు ఎన్జీవోలు, ఆధునిక మీడియాను అందిపుచ్చుకునే సామర్థ్యం ఉన్న కొందరు యాక్టివిస్టులు ప్రజాస్వామ్యాన్ని చేతుల్లోకి తీసుకోవడం వల్ల వచ్చే అనర్థాలేమిటి?అన్నా సాహెబ్ కాకపోవచ్చు కానీ, దేశంలోని 95 శాతం స్వచ్ఛంద సంస్థలకు నిధులు వచ్చేది అమెరికా, దాని మల్టినేషనల్ కంపెనీల నుంచే. అంటే ఎవరి కంట్రోల్ లోకి వెళ్లబోతున్నామో ఊహించుకోవడం కష్టమేమీ కాదు. ఈ ఎన్జీవోలు తమ తమ ఆర్ధిక లావాదేవీలను ప్రభుత్వాలు తనిఖీ చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా అడ్డుపడుతూనే వస్తున్నాయి. అలా ప్రయత్నించిన ప్రభుత్వాలు, పార్టీలపై విమర్శలు చేస్తూనే వస్తున్నాయి. గుప్పెడు ఎన్జీవోలు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికై ఏర్పడ్డ ప్రభుత్వాలనుంచి బాధ్యతల్లేని అధికారాలను హస్తగతం చేసుకోవడం వల్ల వచ్చే పరిణామాలేమిటి? ఈ ఎన్జీవోల ప్రజాబలం ఎంత? ఇలాంటి వాళ్లే అన్నా సాహెబ్ హజారే దీక్ష చేపట్టిన జంతర్ మంతర్ ఏరియాను భారతదేశపు తహరీర్ స్క్వేర్ అంటున్నారు. హోస్నీ ముబారక్ తన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించడం నచ్చని సైన్యం జనాందోళనకు పరోక్షంగా సహకరించింది. తహరీర్ లో ఉద్యమం జరుగుతున్నంత సేపూ మౌన ప్రేక్షకుడిగా నిలిచింది. ఉద్యమకారుల గులాబీలను స్వీకరించి, చిరునవ్వుతో పోజులిచ్చింది. సైన్యం జన మిత్రుడన్న భావనను, ముబారక్ జన శత్రువన్న భావనను కలిగించింది. ముబారక్ అత్యాచారాల్లో తనకూ భాగస్వామ్యం ఉందన్న విషమాన్ని గుర్తుకు రాకుండా చేసింది. ఇప్పుడు సైన్యానికి కంటగింపుగా ఉన్న ముబారక్ పోయాడు. తహరీర్ ఉద్యమకారులు అలిసిపోయారు. పాలన మాత్రం సైన్యం చేతుల్లోనే ఉంది. లిబియాలోనూ ఇదే కథ! గడ్డాఫీ మూర్ఖపాలనను వ్యతిరేకించేవారు అమెరికా తమ దేశంపై జరుపుతున్న దాడులను సమర్థిస్తున్నారు. పాలకులెవరైనా అమెరికా పంట పండినట్టే. తహరీర్ స్వ్కవేర్ లో జరిగిందే ఇక్కడా జరుగుతుందా?
అన్నా సాహెబ్ చుట్టూ చేరిన వాళ్లను చూస్తే కూడా ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. పోలింగ్ రోజున "జాగోరే" అనే టాటా టీ ఎడ్వర్టయిజ్ మెంట్ టీవీలో చూస్తూ "కూల్...ఆస్సమ్...అమేజింగ్" అనుకుంటూ కనీసం కారులోనైనా వెళ్లి వోటేయలేని బద్ధకపు చాటరింగ్ క్లాసు గాళ్లను నమ్మి ఏ ఉద్యమం నడవాలి? టీవీలు, ఫేస్ బుక్కులు, ట్విట్టర్లు ఉద్యమాలకు సాధక శక్తులు కాగలవేమో కానీ చోదక శక్తులు కాలేవు గాక కాలేవు. అవినీతి వల్ల అందరికన్నా ఎక్కువ ఎక్కువగా నష్టపోతున్న పేదవాడిని భాగస్వామిచేయకుండా, ప్రక్షాళన అవసరమైన రాజకీయ వ్యవస్థలకు దూరంగా ఉంచుతూ అవినీతిపై పోరాటం చేయడం సాధ్యమేనా?
అన్నా సాహెబ్ హజారే చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేకున్నా ఆయనను స్వార్థపర శక్తులు వాడుకోవడం లేదన్న విషయం మాత్రం రూఢి కావలసిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. లేకపోతే అన్నాసాహెబ్ పోరాటం విఫలం కావడం ఖాయం.
పి.ఎస్ - అన్నా సాహెబ్ హజారే గారి ఉద్యమం వీలైనంత తొందరలో తెమిల్చేయడం ఎంతైనా అవసరం. ఎందుకంటే ఐపీఎల్ ఆట మొదలైతే టీవీఛానెళ్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ "కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ"గా మారిపోతుంది.

4 comments:

  1. sudhakarji,,
    naananiki avatalivaipu bahaganni baaga chupincharu.. janam andaru jai jai antunte naalaantivallukuda peddaga alochinchkundane bagachestunnaranipinchindi... kaani mee visleshana chusaaka mee alochanakuda righgane anipistondi... very nice analsys...

    ReplyDelete
  2. అన్నా హజారేకు మద్దతు పలకటం ఓ ఫేషన్ లా మారింది...
    ఆత్మ పరిశీలన చేసుకోవటానికి ఇష్టపడని చాలామంది గుంపులో గోవింద అన్నట్టుగా సై కొట్టారు...
    అన్నా హజారే గురించి తెలియని వాళ్ళు సైతం మీడియా ముందు ప్రగల్బాలు పలికారు...
    మన మీడియాది అన్నింటా ఓవర్ యాక్షన్ అని మరోసారి రుజువైంది.

    ReplyDelete
  3. Nice perspective on Anna!
    If your allegations are true, Anna needed to be questioned by us about his 'selective' agitations.
    But, I think this small step towards corruption free Bharat is welcome.

    ReplyDelete
  4. A good and different take on Anna Hazare. Worth reading I must say

    ReplyDelete

Pages